ఢిల్లీలోని ఓ హోటల్‌లో 21 మంది ప్రాణాలు బలి తీసుకున్న అగ్నిప్రమాదం! హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో మెట్రోరైలు మార్గం సమీపంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో షాపులన్నీ బుగ్గిపాలైన భారీ ఫైర్ యాక్సిడెంట్!! గత పక్షం రోజుల్లో కలవరపరిచిన ఇలాంటి వార్తలు అనేకం. కానీ, సరిగ్గా 90 ఏండ్ల కిందట మన హైదరాబాద్‌లో జరిగిన అలాంటి ఓ అనూహ్య దుర్ఘటనే తెలంగాణ వ్యాప్తంగా సినిమా ప్రదర్శన దృశ్యం మొత్తాన్నీ మార్చేసిందని తెలుసా? ఆట మధ్యలో ఆనాటి రాత్రి జరిగిన ఆకస్మిక అగ్నిప్రమాదం 14 మంది నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఆ విషాద ఘటన బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా ప్రపంచవ్యాప్తంగా పత్రికల్లో ప్రధాన వార్తగా నిలిచింది. నాటి నిజాం రాష్ట్రంలో సినిమాటోగ్రాఫ్ చట్టం ఆవిర్భావానికి కారణమైంది.
సరిగ్గా తొమ్మిది దశాబ్దాల కింద సంగతి. అది 1936 జూన్ 14. సమయం… రాత్రి తొమ్మిదింబావు. స్థలం… హైదరాబాద్‌లో జనసమ్మర్దం అధికంగా ఉండే సుల్తాన్‌బజార్ ప్రాంతంలోని మోతీమహల్ టాకీస్. తెర మీద హిందీ చిత్రం ‘కాలేజ్ గర్ల్’ (1935) నడుస్తోంది. మిస్ మాధురి – రాజా శాండో తదితరులు ప్రధాన తారాగణం. ఆ రొమాంటిక్, కామెడీ, థ్రిల్లర్ అప్పటికే బొంబాయి, ఢిల్లీ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విశేష జనాదరణ పొందింది. ఎట్టకేలకు హైదరాబాద్‌కు వచ్చింది.
ఆ రోజున ఏం జరిగింది?
ఆ సినిమా అప్పటికి తొమ్మిది రోజులుగా ప్రేక్షకాదరణతో విజయవంతంగా నడుస్తోంది. ఆ ఆదివారం సాయంకాలపు ఆటకు హాలంతా రద్దీగా ఉంది. హాలులో దాదాపు 600 మంది జనం. షో దాదాపు చివరకొస్తున్న సమయం. పరదా ధరించే కులీన స్త్రీలు ఎప్పటిలానే… పై బాల్కనీలోని దక్షిణం వైపున జనానా స్త్రీల కోసం కేటాయించిన ప్రత్యేకమైన పరదా సెక్షన్‌లో కూర్చొని సినిమా చూస్తున్నారు. ఇంతలో ఏమైందో ఏమో.. ఆపరేటర్ రూమ్‌కు వెనుక వైపు నుంచి ఉన్నట్టుండి పెద్ద పేలుడు శబ్దం వచ్చింది. ఎక్కడ నుంచో ఉన్నట్టుండి నిప్పు రాజుకుంది.
నిమిషాల్లో హాలంతా మంటలు వ్యాపించాయి. కొయ్యతో చేసిన బాల్కనీని కూడా ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అందరూ భయాందోళనలతో హాలులో నుంచి బయటపడేందుకు ప్రయత్నించడంతో నిష్క్రమణ ద్వారాల వద్ద పెనుగులాట, గాయాలు తప్పలేదు. బాల్కనీలో చిక్కుబడ్డవాళ్ళు మెట్లు దిగి వద్దామంటే, మంటలతో మార్గం మూసుకుపోయింది. పైన ఉండలేరు. కిందకు దిగి రాలేరు. చూస్తుండగానే క్షణాల్లో బాల్కనీ మొత్తం తగలబడిపోయింది. కాసేపటికి పై కప్పుతో సహా మొత్తం కుప్పకూలిపోయింది. హాలంతా బుగ్గి పాలైంది. ఆ గందరగోళంలోనే పైనున్న బాల్కనీ నుంచి కిందకు దూకి, కొందరు కాళ్ళు చేతులు విరగ్గొట్టుకున్నారు. అభాగ్యులైన 12 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఆ అగ్నికీలలకు ఆహుతయ్యారు.
200 అడుగుల ఎత్తు మంటలు…
అగ్గి రాజుకున్న అయిదు నిమిషాల్లో హాలంతా మంటలు వ్యాపించాయి. అదే సమయంలో గాలి బలంగా వీస్తుండడంతో, అగ్నికి వాయువు తోడైంది. నియంత్రణ కష్టమైంది. అగ్నికీలలు ఏకంగా 150 నుంచి 200 అడుగుల ఎత్తు లేచాయట. ఆ మంటలు ఏకంగా హుస్సేన్ సాగర్ చెరువు కట్ట మీద, సికింద్రాబాద్ స్టేషన్ మీద దాకా కనిపించాయని పత్రికల సమాచారం. మంటలు చుట్టుపక్కలి భవనాలకు వ్యాపించకుండా నిరోధించేందుకు రెండు ఫైరింజన్లతో, అగ్నిప్రమాద దళాలు చాలాసేపు శ్రమించాల్సి వచ్చింది. ఆడవాళ్ళను ఇదే సందుగా దొంగలు అడ్డగించి, వాళ్ళ నుంచి సొమ్ములు గుంజుకున్నారు. మరోపక్క ఎలక్ట్రిక్ లైట్ వైరులో నిప్పు రాజుకుందనీ, అది అంతటికీ వ్యాపించవచ్చనే భయంతో ప్రమాదం జరిగిన మోతీమహల్ టాకీస్ చుట్టుపక్కల ఇళ్ళవారు ఇళ్ళలోని సామాన్లు తీసుకొని వచ్చి, ఆ రాత్రి అంతా రోడ్ల మీదే గడిపారు. ఇక, మోతీమహల్‌కు పక్కనే ఉండే రాయల్ టాకీస్ వాళ్ళయితే, లైట్లన్నీ ఆపేసి, ముందు జాగ్రత్తగా ఫైరింజన్‌ను కూడా తెప్పించి ఉంచుకున్నారు. మర్నాడు ఉదయం కూడా ప్రమాదభయంతో ఆ చుట్టుపక్కల దుకాణాలేవీ తెరవనే లేదు. ఆ రోజుల్లోనే దాదాపు లక్ష రూపాయల మేర ఆస్తినష్టం సంభవించినట్టు లెక్క. అసలు ఆరోజు ఆటకు నైజాం ప్రధానమంత్రి మహారాజా సర్ కిషన్ పర్షాద్ బహదూర్ సైతం హాలుకు వచ్చి, సినిమా చూడాల్సిందట. వీలు కుదరక ఆఖరి క్షణంలో ఆయన ప్రోగ్రామ్ రద్దయింది.
ఎవరిదా సినిమా హాలు?
అగ్నికీలలకు ఆహుతైన ఆ మోతీమహల్‌కు పెద్ద చరిత్రే ఉంది. హైదరాబాద్‌లో నేటి సుల్తాన్ బజార్‌కు సమీపంలో రెసిడెన్సీ బజార్‌లో ఆ థియేటర్ ఉండేది. అంతకు ముందు దాని అసలు పేరు – ‘ప్రేమ్ థియేటర్’. 1920 ప్రాంతంలో సేఠ్ లాల్‌జీ మేఫ్‌ుజీ అనే వ్యాపారి తన స్థలంలో ఆ థియేటర్ కట్టారు. అది పలు రంగస్థల, వినోద ప్రదర్శనలకు నెలవైంది. ఆ హాలును ఆనుకొన్న ఇల్లు కూడా మేఫ్‌ుజీదే. కాలక్రమంలో రెసిడెన్సీ బజార్ అధికారుల అనుమతితో 1932లో ఆ థియేటర్‌ను పూర్తి సినిమా హాలుగా మార్చారు. ఒక దశలో ఆ థియేటర్‌నూ, ఆ ఇంటిలో కొంత భాగాన్నీ అసలు యజమాని మేఫ్‌ుజీ నుంచి కలకత్తాకు చెందిన మెస్సర్స్ మోతీమహల్ థియేటర్ లిమిటెడ్ యాజమాన్యం లీజుకు తీసుకొంది. అలా లీజుకు తీసుకొని, హాలును నడిపిన సదరు వ్యక్తి… రారు బహదూర్ సేఠ్ హర్‌దత్ రారు మోతీలాల్ చమరియా. అనేక వ్యాపారాలున్న ఆయన అప్పట్లో ఓ పెద్ద సినీ వ్యాపార దిగ్గజం కూడా! ఆయన పేరు మీదే హాలు పేరు కాస్తా మోతీమహల్ అయింది. ఆ రెసిడెన్సీ బజార్ చుట్టుపక్కలే పలు సినిమా హాళ్ళు ఉండేవి. అందులోనూ మోతీమహల్‌కు అత్యంత సమీపంలోనే రాయల్ టాకీస్ ఉండేది. చమరియా లీజుకు తీసుకున్న మోతీమహల్‌లోనే అగ్ని ప్రమాదం, ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించాయి. అప్పట్లో నెలకు రూ. 1043 అద్దె చెల్లించేలా 1935 ఫిబ్రవరిలో అయిదేళ్ళ లీజు ఒప్పందం కుదిరింది.
హాలు నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని విచారణ సంఘం సైతం అభిప్రాయపడింది గనక, థియేటర్‌కు లీజుదారులైన చమరియాలు అయిదేండ్ల కాలానికీ అద్దె, నష్టపరిహారం చెల్లించాలన్నది హాలు సొంత యజమాని వాదన. ఆ విషయమై ఆయన బొంబాయి హైకోర్టుకెక్కారు.
కేసు వాదించిన జిన్నా! ఆ హాలే…
అటుపైన ‘దిల్‌షాద్’!!
లీజుదారైన చమరియా మాత్రం… హాలు నిర్వహణలో తమ నిర్లక్ష్యం ఏమీ లేదనీ, ప్రమాద ఘటన తర్వాత మిగిలిన లీజు కాలానికేమీ అద్దె చెల్లించాల్సిన బాధ్యత తమకు లేదనీ వాదించారు. ఈ కేసులో చాలామందికి తెలియని ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. అది ఏమిటంటే – తర్వాతి కాలంలో పాకిస్తాన్ ఏర్పాటులో కీలకభూమిక వహించిన మహమ్మద్ అలీ జిన్నా సదరు కేసులో హాలు సొంతదారైన లాల్‌జీ మేఫ్‌ుజీ పక్షాన న్యాయవాదిగా కోర్టులో వాదనలు వినిపించారు. ఏమైనా, ఆ తర్వాత కాలంలో అగ్నిప్రమాదం జరిగిన చోటే, బుగ్గిపాలైన ఆ ‘మోతీమహల్’ సినిమా హాలే ‘దిల్షాద్ టాకీస్’గా పునర్నిర్మాణమైంది. హైదరాబాద్‌లో రాజ్‌కపూర్ సహా ప్రసిద్ధ దర్శక, నిర్మాతల పాపులర్ హిందీ సినిమాల ప్రదర్శనకు చిరునామాగా చాలాకాలం నడిచింది.
నిద్ర లేచిన నిజాం సర్కార్
అప్పట్లో సికింద్రాబాద్ ప్రాంతం, ముఖ్యంగా కంటోన్మెంట్ ఏరియా అంతా బ్రిటీషు వారి నియంత్రణలో ఉండేది. హైదరాబాద్‌లో మాత్రం ఒక్క కోఠి ప్రాంతంలోని బ్రిటీష్ రెసిడెన్సీ ఏరియా మినహా మిగతా అంతటా నిజాం మాటే రాజశాసనం. అయితే, రెసిడెన్సీ బజార్‌లో ఉన్నందున ఈ మోతీమహల్ టాకీస్ 1933 దాకా బ్రిటీషు వారి ఏలుబడి ప్రాంతం కిందే ఉండేది. అలా ఆ ప్రాంతం తమ నియంత్రణలో ఉన్నప్పుడే బ్రిటీషు వారు ఆ హాలుకు పర్మిషన్, లైసెన్సులు వగైరా అన్నీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత రెసిడెన్సీ బజార్‌లోని కొన్ని ప్రాంతాలను బ్రిటీషు పాలకులు నిజాం ప్రభుత్వానికే వదిలేయడంతో, ఈ సినిమా హాలు ప్రాంతం కూడా నిజాం సర్కార్ కిందకు వచ్చి చేరింది. అలా ఆ ప్రాంతపు పగ్గాలు తమ చేతిలోకి వచ్చాక, అగ్ని ప్రమాదం జరిగే లోపు హైదరాబాద్ సంస్థానం ఆ థియేటర్‌ను ఒక్కసారి మాత్రమే తనిఖీ చేసింది. అంతే! ప్రమాదఘటనతో నిజాం సర్కార్ కళ్ళు తెరిచింది. దుర్ఘటన జరిగిన మరునాడు ఉదయమే నిజాం ప్రభువు స్వయంగా వెళ్ళి, సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అనుకోని అపాయాలు ఎదురైనప్పుడు ప్రేక్షకులు హాలులో నుంచి సురక్షితంగా తప్పించుకొనే మార్గాలు ఏర్పరిస్తే తప్ప, ఇకపై థియేటర్లను నడపడానికి అనుమతించవద్దంటూ పోలీసు కమిషనర్‌కూ, మునిసిపాలిటీకీ నిజామ్ అప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. ఫలితంగా, హుటాహుటి తనిఖీలతో ప్రసిద్ధ సినిమా హాళ్ళు… రాయల్, మినర్వా, సెంట్రల్ టాకీ హౌస్, ఎక్సెల్షియర్‌లు నాలుగింటినీ ప్రభుత్వ అధికారులు తాత్కాలికంగా మూసేయించారు.
విస్తుగొలిపే నిజాలు
మనసును కలచివేసిన ఈ మోతీమహల్ ప్రమాదానికి మూలకారణాలను విచారించి, ఇలాంటివి పునరావత్తం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సూచించాలంటూ నిజాం రాజు ప్రత్యేకంగా ఓ బహిరంగ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. నాటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఎస్.టి. హాలిన్స్ ఆ విచారణ సంఘానికి సారథి. కమిటీ ఎనిమిదిసార్లు సమావేశమై, బహిరంగ విచారణ జరిపింది. తొమ్మిది రోజుల్లో దాదాపు 55 మంది సాక్షుల కథనాలను రికార్డు చేసింది. చివరకు పరదా పద్ధతి పాటించే మహిళా ప్రేక్షకుల సాక్ష్యాలను సైతం వారి ఇళ్ళకు వెళ్ళి మరీ సేకరించింది. సిఫార్సులతో సహా సమగ్రమైన నివేదికను సమర్పించింది. హాలు యాజమాన్యం పెద్దయెత్తున సినిమా రీళ్ళను స్టోర్ రూమ్‌లో నిర్లక్ష్యంగా నిల్వచేసి ఉంచిందనీ, దాంతో మంటలు చెలరేగాయనీ విచారణ సంఘం తన నివేదికలో తేల్చింది.
సిఫార్సులతో మారిన నైజాం సినీ దృశ్యం
అదే సమయంలో హాలిన్స్ విచారణ కమిషన్ కొన్ని కీలక సిఫార్సులు కూడా చేసింది. దేశంలోని బ్రిటీష్ పాలిత మిగతా ప్రాంతంలో లాగా నిజాం రాష్ట్రంలోనూ సినిమాటోగ్రాఫ్ చట్టం చేయాలంది. రాష్ట్రంలో సినిమాటోగ్రాఫ్ చట్టం, సినిమా హాళ్ళను నియంత్రించే నిబంధనలు లేకపోవడమే మోతీమహల్ దుర్ఘటనకు దారి తీసిందని అభిప్రాయపడింది. అలాగే, విద్యుత్ శాఖ సమర్పించిన ఎలక్ట్రిసిటీ యాక్ట్ ముసాయిదా అప్పటికి కొద్దికాలంగా నిజాం ప్రభువు ఆమోదం కోసం నిరీక్షిస్తోంది. వీలైనంత త్వరగా దానికి రాజముద్ర వేయాలని సూచించింది. మరోపక్క ఈ ఘటనతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ సైతం తమ నగరం పరిధిలోని సినిమా హాళ్ళ భద్రతపై దష్టి పెట్టింది. అలాగే, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం సహా బ్రిటీష్ ఇండియాలోనూ థియేటర్ల పర్యవేక్షణ కట్టుదిట్టమైంది.
చీర కొంగుతో ప్రాణాలు కాపాడిన సాహస స్త్రీ
మోతీమహల్ ఘటన సాహసోపేతమైన మానవీయ ఘట్టానికీ సాక్ష్యమైంది. మెట్ల మార్గం మూసుకుపోయి, మంటల్లో చిక్కుకున్న బాల్కనీ నుంచి ఆడవాళ్ళు, పిల్లలను కాపాడేందుకు పోలీసులు సహా పురుషులెవరూ పెద్దగా ముందుకు రాని దుస్థితి. అనేకమంది భయంతో బాల్కనీలో నుంచి కిందకు దూకుతున్నారు. కొందరికి తీవ్రగాయాలయ్యాయి. మరికొందరికి ప్రాణగండం తప్పలేదు. అంతటి ఆ గందరగోళ పరిస్థితుల్లోనూ.. ఓ స్త్రీ మాత్రం మానవత్వంతో పాటు, సాహసాన్ని ప్రదర్శించింది. ఏ మాత్రం వెనకాడకుండా తాను కట్టుకున్న చీర కొంగు తీసి, ఆ బాల్కనీలోని ఓ స్తంభానికి కట్టింది. అదే ఆసరా చేసుకొని, తనతో పాటు ఒక్కొక్కరిగా పలువురు బాధితుల్ని మంటల్లోని ఆ బాల్కనీ నుంచి నేల మీదకు దింపింది. ఆఖరికి అపస్మారకంలో కిందపడిపోయిన ఆ సాహసిక స్త్రీమూర్తి పేరు… అష్రఫ్- ఉన్నీసా బేగమ్. ఓ రిటైర్డ్ భారతీయ ఆర్మీ ఆఫీసర్ సతీమణి.
అప్పటికే ఆమెది పెద్ద వయసు. అయినా సరే ఆమె చూపిన ఆ అపూర్వ ధైర్యసాహసాలు, అసాధారణ మానవత అందరినీ ఆశ్చర్యపరిచాయి. చివరకు ఆ సాహసం నాటి బ్రిటీష్ ప్రభుత్వాన్ని సైతం కదిలించింది. అంతే… అందుకు గుర్తుగా ఉన్నీసా బేగమ్‌ను 1937లో ప్రత్యేకంగా గ్యాలంట్రీ మెడల్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ (బ్రిటీష్ సామ్రాజ్య శౌర్యపతకం)కు ఎంపిక చేసింది. అంతకు ముందు సామాజిక సేవ, మిషనరీ సేవ, వైద్యం తదితర రంగాల్లో భారతీయ మహిళలకు కైజర్-ఐ-హింద్ పతకాలు లభించాయి కానీ, బ్రిటీష్ ఆర్డర్‌కు సంబంధించి ఇలా ఓ శౌర్య పతకాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళ మాత్రం ఆమే కావడం విశేషం.
మరణం లేని మతాతీత మానవత్వం
ఆ ఘటనలో ‘అంత ఎత్తు మీద నుంచి నేల మీద పడితే, పిన్న వయసు వాళ్ళకు సైతం ప్రాణాంతకమే! అలాంటిది ఈ పెద్ద వయసులో ఉన్నీసా బేగమ్ ప్రాణాలతో బతకడం ఓ అద్భుతం’ అని డాక్టర్ అన్నాడు. దాదాపు రెండు నెలల చికిత్స తర్వాత కానీ ఆమె మామూలు మనిషి కాలేకపోయారు. మోతీమహల్ ఘటన తర్వాత పదేండ్లకు 1947లో ఉన్నీసా బేగమ్ మరణించారు.
మోతీమహల్ ఘటనలో ఆమె లాగానే మరో ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకరు భౌతికంగా సామాన్యుడే అయినా, మానసికంగా మానవత్వం మూర్తీభవించిన అసామాన్యుడు. అతనూ ముస్లిమే! పేరు – సయ్యద్ ఇక్బాల్ అహ్మద్. జిల్లా పోలీస్ సి.ఐ.డి. విభాగానికి చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్. ఆ రోజున అతను ఎంతో ధైర్యం ప్రదర్శించి పలువురు మహిళల, పిల్లల ప్రాణాలు కాపాడారు. ”అతని సేవ నిరుపమానం. కర్తవ్యనిష్ఠకు అతనో అద్భుతమైన నిదర్శనం” అని ఎంక్వైరీ కమిటీ తన నివేదికలో ప్రత్యేకంగా ప్రశంసించింది. మరో హీరో.. అప్పట్లో నిజాం ప్రభువుల ట్రాన్స్‌లేషన్ బ్యూరోలో పనిచేస్తున్న అబ్దుల్ ఖుద్దూస్. హాలులోని తొక్కిసలాటలో గాయాల పాలై, రక్తం కారుతున్నప్పటికీ ఆయన సహాయ కార్యకలాపాల్లో ముందున్నారు. మంటల్లోకి చొచ్చుకుపోయి మరీ స్త్రీల గ్యాలరీ నుంచి ఎంతోమందిని కాపాడారు. మానవత్వానికి మరణం లేదని నిరూపించారు.
నైజాంలో సినిమాటోగ్రాఫ్ చట్టానికి శ్రీకారం
బ్రిటీషర్ల ఏలుబడిలోని మిగతా భారతావనిలో ‘ఇండియన్ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ – 1918’ అప్పటికే చాలాకాలంగా అమలులో ఉంది. కానీ, నిజాం రాష్ట్రంలో మాత్రం అన్నేళ్ళుగా అలాంటి చట్టమేదీ లేదు. 1936 నాటి మోతీమహల్ ఘటనతో నిజాం తన ఏలుబడి రాష్ట్రంలోనూ ‘సినిమాటోగ్రాఫ్ యాక్ట్’ అనే కొత్త చట్టం తొలిసారి తీసుకువచ్చారు. దాని ప్రకారం నిజాం పాలిత ప్రాంతాల్లో సినిమా హాళ్ళకు లైసెన్సులు జారీ చేసే అధికారాన్ని జిల్లాలో తాలూక్‌దార్‌కూ, నగరంలో పోలీస్ కమిషనర్‌కూ కట్టబెట్టారు. లైసెన్స్ జారీ సందర్భంలోనే కాక ఆ తర్వాత కనీసం ఏడాదికి ఓ సారైనా సినిమా హాళ్ళ తనిఖీలు జరగాలన్న నిబంధన పెట్టారు. అలా నిజాం రాష్ట్రపు కొత్త చట్టం హాళ్ళ నిర్మాణం, నిర్వహణ, తనిఖీలకు మార్గదర్శకాలను నిర్వచించినట్లయింది. అప్పటి వరకు రాష్ట్రంలో రకరకాలుగా నడుస్తున్న సినిమా హాళ్ళన్నీ ఒకే ప్రమాణాలను పాటించక తప్పలేదు.
సినిమా మోజును తప్పుబట్టిన నిజాం
ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది కానీ, ప్రమాదం జరిగిన మర్నాటి సాయంత్రం నిజాం ఓ ఫర్మానా జారీ చేశారు. ”సినిమా అనేది ఓ వినోదస్థలం. కానీ, ఇటీవల జనంలో అది ఓ వెర్రి వ్యామోహంగా మారిందని నా దష్టికి వచ్చింది. గత రాత్రి (మోతీమహల్ టాకీస్‌లో) జరిగిన పెను విషాదానికి చెవి ఒగ్గి, వారు భవిష్యత్ పాఠం నేర్చుకోవాలి. సినిమా లాంటి ఉల్లాసాలను పరిధుల్లోనే ఉంచుకోవాలి” అని ఆ ఫర్మానాలో పేర్కొన్నారు. చివరకు, నిజాం ప్రభువు సతీమణి సైతం దుర్ఘటన బాధితుల కుటుంబాలకు తన సంతాపం ప్రకటిస్తూనే, సినిమాల పట్ల వేలంవెర్రిని ఆడవాళ్ళు తగ్గించుకోవాలంటూ హితబోధ చేశారు. మన గడ్డ మీది తెలుగు పత్రికల మొదలు చివరకు ఉత్తరాది పత్రికలు సైతం దాదాపు అదే భావన వ్యక్తం చేయడం గమనార్హం. సినీ మాధ్యమం ఎంత పాపులరైనా అప్పట్లోనూ కొంత తక్కువ భావనే ఉండేదనడానికి ఇదో తార్కాణం.
60 ఏండ్ల తర్వాత ఢిల్లీ ‘ఉపహార్’లోనూ…
ఏమైనా, భారతదేశ సినీచరిత్రలో హైదరాబాద్ మోతీమహల్ థియేటర్ ప్రమాదం ఓ మనసును పిండేసే ఓ మరువలేని విషాద సంఘటన. హైదరాబాద్ దుర్ఘటన జరిగిన 61 ఏండ్ల తర్వాత 1997లో ఈసారి జూలై 13న మన దేశ రాజధాని ఢిల్లీలో ‘ఉపహార్’ సినిమా థియేటర్‌లో అతి దారుణమైన అగ్ని ప్రమాదం సంభవించింది. హిందీ సూపర్ హిట్ ‘బోర్డర్’ ప్రదర్శన సమయంలో జరిగిన ఆ భారీ ప్రమాదంలో 59 మంది ఊపిరాడక మరణించారు. థియేటర్లలో ఉండాల్సిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ఇలాంటి ప్రమాదాలు అప్పుడూ ఇప్పుడూ గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇటీవల తెలంగాణలో ఎక్కడ చూసినా సినిమా ఎగ్జిబిటర్లకూ, సింగిల్ స్క్రీన్లకూ మరణశాసనం రాస్తున్న మల్టీప్లెక్స్ సానుకూల సినీ వ్యాపార వాతావరణం గురించే చర్చ జరుగుతున్న వేళ… థియేటర్ల భద్రత కూడా పట్టించుకోవాల్సిన అంశం. కనీసం ఫైర్ ఇంజన్ వాహనాలైనా వచ్చేందుకు వీలు లేకుండా అగ్గిపెట్టెల లాంటి అనేక మాల్స్ కమ్ మల్టీప్లెక్సులు పేటకొకటి పుట్టుకొస్తున్న పరిస్థితుల్లో 90 ఏండ్ల కిందటి మోతీ మహల్ ఘటన మరిచిపోకూడని పాత పాఠం.
”నా కన్నా వాళ్ళ ప్రాణాలు ముఖ్యమనుకున్నా!”
నిజానికి, అష్రఫ్ ఉన్నీసా బేగమ్ అప్పటికే వయసు మీద పడ్డ మహిళ. అయినా సరే, మోతీమహల్ థియేటర్ తగలబడిపోతున్న సమయంలో పిన్నవయస్కులైన తోటి మహిళల కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధమై, తెగువ చూపారు. ”ఆ రోజున సినిమా హాలులో హఠాత్తుగా మంటలు చెలరేగినప్పుడు పక్కనున్న తోటి పరదా స్త్రీలందరూ నిస్సహాయతతో, నిరాశలో కూరుకుపోయారు. అయినవాళ్ళయిన మగవాళ్ళు సాయానికి రాకుండా, వారిని అలా విధి రాతకు వదిలేసిన ఆ క్షణంలో… నేనో నిర్ణయానికి వచ్చా. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా ఫరవాలేదు కానీ, ఆ ఆడవాళ్ళను కాపాడాలనుకున్నా. ఎంతో జీవితం చూసి, వయసు మీద పడిన నా ప్రాణాల కన్నా యువతులైన నా సోదరీమణుల ప్రాణాలు ముఖ్యమని భావించాను” అని తన మానసిక స్థితిని అప్పట్లోనే ఆమె వర్ణించారు. అందుకే, ఆమె మరో ఆలోచన ఏదీ లేకుండా, తాను కట్టుకున్న చీర విప్పి, మంటలు చుట్టుముట్టిన బాల్కనీలో ఓ స్తంభానికి కొంగు కట్టారు. తాడులాగా దాన్ని ఆసరాగా చేసుకొని, ఆడవాళ్ళు కిందకు దిగేందుకు సాయపడ్డారు.
”ఆ చీర సాయంతోనే ఇతర మహిళలతో పాటు నా చిన్న కూతురు కూడా హాలు పై నుంచి కిందకు దిగింది. ఊపిరాడని పొగ, ఆ మంటలు నన్ను చుట్టుముట్టక ముందే ఆ చీర సాయంతో కిందకు వచ్చేయమంటూ నా చిన్న కూతురు ఏడుస్తూ, కింద నుంచి పదే పదే చెప్పసాగింది. కానీ, మిగతా ఆడవాళ్ళందరినీ అక్కడే బాల్కనీలో వారి మానాన వారిని అలా మంటలకు వదిలేసి, కిందకు వచ్చేసేందుకు నా మనసొప్పుకోలేదు. చివరకు, డాబా మీద ఇంకా మిగిలివున్న కొద్దిమంది స్త్రీలు మాత్రం నా సలహా పాటించి, ధైర్యంగా, చీర సాయంతో కిందకు దిగడానికి సిద్ధంగా లేరని అర్థమయ్యాక, అప్పుడు నేను స్వయంగా కిందకు దిగడానికి ప్రయత్నించాను” అని ఆ సంగతులు గుర్తుచేసుకున్నారు. అయితే, అప్పటికే చాలామందికి సాయపడడంలో శ్రమించడంతో శారీరకంగా ఆమెకు నీరసం వచ్చేసింది. మరోపక్క అప్పటి దాకా ఆ వేడి పొగగాలుల్ని పీల్చడంతో, తల తిరిగి, బాల్కనీలో నుంచి కిందకు దిగుతూ అంత ఎత్తు మీద నుంచి నేల మీదకు పడిపోయింది. అపస్మారకంలోకి వెళ్ళిపోయింది. అప్పటికే కిందకు దిగిన 17 ఏళ్ళ కూతురు కష్టపడి, సాయంపట్టి ఆవిడను అక్కడ నుంచి బయటకు తెచ్చింది. ఆ గందరగోళంలో వాళ్ళ కారు ఎక్కడుందో తెలియలేదు. ఎలాగోలా ఓ టాంగా పట్టుకొని, తల్లీకూతుళ్ళు ఇంటికి తిరిగొచ్చి పడ్డారు.
రెంటాల జయదేవ, 9441371357



