విద్య సమాజంలో ఎలాంటి మార్పును తీసుకురాగలదో తెలిపేందుకు నిదర్శనమే డాక్టర్ ఎన్ జెన్సీ. అయితే ఒకప్పుడు సమాజమే కాదు కుటుంబం సైతం ఆమె పుట్టుకను అంగీకరించలేదు. అడగడుగున వివక్ష, హేళనలు, అవమానాలు. వాటన్నింటికి తన పని, గుర్తింపుతోనే తగిన సమాధానమివ్వగలనని భావించి నిశబ్దంగా పట్టుదలతో సాగింది. చివరకు ఆ నమ్మకమే గెలిచి.. అద్భుతమైన విద్యా ప్రతిభతో అందరి నోళ్లూ మూయించింది. ప్రపంచం ముందు విజేతగా నిలబడింది. ట్రాన్స్‌జెండర్ అంటే విలక్షణమైన మనిషి, విభిన్నంకాదు అని అందరూ అంగీకరించేలా తన గెలుపుతో చాటిచెప్పిన ఆమె పరిచయం నేటి మానవిలో…
తమిళనాడులో పీహెచ్‌డీ పట్టా పొందిన తొలి ట్రాన్స్ జెండర్ ఎన్. జెన్సీ చదువు పూర్తి చేసిన తర్వాత ఆమె లయోలా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం పొందింది. యూజీ, పీజీలలో స్వర్ణ పతక విజేత అయిన ఆమె ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ఉచిత విద్య, జీవనోపాధి సహాయం అందించడంలో తోడ్పడుతుంది. తమిళనాడులోని తిరుత్తని సమీపంలో ఉన్న ఆర్‌కే పేట అనే చిన్నగ్రామంలో జెన్సీ బాల్యం సాగింది. అత్యంత చిన్న వయసులోనే కఠోర సత్యం తెలుసుకుంది. తనను ఈ ప్రపంచం మనుగడ సాగించనివ్వదని అర్థం చేసుకుంది. తల్లిదండ్రుల మద్దతు లేకుండా సాగుతున్న ఆమెకు గుర్తింపు కోసం పోరాటం ఆ క్షణం నుంచే మొదలైంది. తనకు రక్షణగా ఉండేది ఏది అని అన్వేషించడం మొదలుపెట్టింది.
వివక్షకు విరుగుడు విద్య మాత్రమే
అనుక్షణం వెంటాడుత్ను వివక్షకు విరుగుడు విద్య మాత్రమే అని అర్థం చేసుకున్న జెన్సీ ఎలాగైనా చదువుకోవాలని బలంగా నిర్ణయించుకుంది. అంతే కాదు ఎప్పుడు గుర్తింపు పొందేలానే చదవాలని పట్టుదలతో ముందుకు సాగింది. అలా వలక్కనంపూడిలోని స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యలో కూడా ప్రథమ స్థానంలో ఉండేది. ఉపాధ్యాయులు, సహ విద్యార్థుల నుంచి తన ప్రతిభతో గుర్తింపు, గౌరవం దక్కించుకునేలా ఆహర్నిశలు కష్టపడింది. ఆ పరుగు తిరుత్తానిలోని అరుల్మిగు సుబ్రహ్మణ్యస్వామి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చేరి ఆంగ్లంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదువు వరకు కొనసాగింది. అందులో కూడా గోల్డ్ మెడల్ సాధించింది.
తొలి ట్రాన్స్ జెండ్ మహిళగా…
తర్వాత ఆమె డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మాస్టర్స్, ఎంఫిల్ చేసింది. ఆ రెండింటిలోనూ గోల్డ్ మెడల్ ఆమెదే కావడం మరో విశేషం. ఆ తర్వాత చెన్నైలోని లయోలా కళాశాల నుంచి ఆంగ్లంలో పిహెచ్‌డి పూర్తి చేసి, అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం పొందింది. అలా ఆమె తమిళనాడులో డాక్టరేట్ అందుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం పొందిన తొలి ట్రాన్స్ జెండర్ మహిళగా నిలిచింది. అంతేగాదు ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం బహిరంగంగా ఆమెను అభినందించారు. ఆ సభలో ఆమె మాట్లాడుతూ ఈ క్రెడిట్‌ని తన ట్రాన్ కమ్యూనిటికీ చెందిన జెన్సీ అన్నది. ఆమె మాటలు వందల మంది విద్యార్థులను కదిలించాయి. ఆ తర్వాత ఆమెను ఎన్నో వేదికలపై విజేతగా నిలబెట్టాయి. ప్రస్తుతం ఆమె ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు ఇస్తూ వారు జీవితంలో ముందుకు వెళ్లేందుకు మార్గం చూపుతుంది.
ఇతరులకు కూడా…
తను నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో పోరాటాలు, తిరస్కరణలు ఎదుర్కోవలసి వచ్చిందని ఆమె అన్నది. ప్రస్తుతం ఆమె ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా అవసరమైన ప్రోత్సాహం అందిస్తుంది. తన ఖాళీ సమయంలో వారికి విద్యలో అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది. సామాజికంగా, విద్యాపరంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు ప్రతి ఏడాది వారికోసం ఏడు నుంచి 12 సీట్లు రిజర్వ్ చేసేలా కాలేజీ యాజమాన్యంతో కలిసి పనిచేస్తుంది. ‘నా ప్రయాణం అవకాశాలకు నాకు తలుపులు తెరిచింది. అలాగే నా కమ్యూనిటీలోని ఇతరులకు కూడా అవకాశాలు అందించాలనే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను’ అని అంటుంది ఆమె.
సంస్థాపరమైన మార్పుకై…
‘చాలా మంది ట్రాన్స్‌జెండర్‌లు వారి ఉనికిని బయటకు చెప్పిన తర్వాత సర్టిఫికేట్లలో తమ లింగాన్ని మార్చుకోవలసి వస్తుంది. మాటల్లో చెప్పేందుకు ఇది చిన్న విషయంగానే కనిపిస్తుంది. నిజానికి ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. అయితే ఇది మాకెంతో సాధికారతను ఇచ్చే అంశం. అందుకే నేను ఇలాంటి సర్టిఫికేట్ కోసం ప్రయత్నించే ట్రాన్స్ జెండర్స్ కోసం నేను ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి వారికి సాయం చేస్తున్నాను’ అంటూ ఆమె తెలిపింది. అంతేకాదు ఆమె కేవలం విద్యలోనే కాకుండా సంస్థాపరంగా రావల్సిన మార్పుల కోసం కూడా పోరాడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్స్‌కు ఒక్క శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమె గట్టిగా డిమాండ్ చేస్తుంది. దీనివల్ల ఉద్యోగాల్లో వివక్షకు గురవుతున్న వారు సమాజంలో గౌరవంగా బతికేందుకు వీలు కలుగుతుందని ఆమె వాదిస్తుంది. ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన తిరువళ్లూరులోని ఓ జంట పేద పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇస్తూ జెన్సీని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. సమాజ పక్షపాత వైఖరికి ఓటమితో తలవంచకుండా.. విద్యతో ధీటుగా సమాధానమిచ్చి ఆమోదించేలా చేసుకోవాలని జెన్సీ తన కథ ద్వారా చక్కటి సందేశం ఇచ్చింది.



