రక్తదానానికి కదిలొచ్చిన యువకులు…

నవతెలంగాణ వెబ్ డెస్క్: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని ఆలోచించిన వందలాదిమంది యువకులు రాత్రికి రాత్రే బాలేశ్వర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.   వీరంతా ఏ పిలుపూ లేకుండానే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. గంటల తరబడి వేచి ఉండి మరీ.. క్షతగాత్రులకు రక్తదానం చేస్తున్నారు.అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కొందరు స్థానికులు మానవత్వాన్ని చాటుకున్నారు. బహానగా బజార్‌ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో 238 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 900 మందికి పైనే గాయపడ్డారు. క్షతగాత్రులను బాలేశ్వర్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు సమీప ఆసుపత్రులకు తరలించారు.
స్థానికుల సహాయ చర్యలు..
ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు చాలా వేగంగా స్పందించారు. ఘటనాస్థలానికి వెళ్లి సహాయకచర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయచర్యలు చేపట్టారు. ‘‘ప్రమాదం గురించి తెలియగానే మేం వెంటనే అక్కడకు బయల్దేరాం. దాదాపు 200-300 మందిని కాపాడగలిగాం’’ అని స్థానికులు మీడియాకు తెలిపారు.
200 అంబులెన్స్‌లు..
ప్రమాద స్థలంలో భారత సైన్యం ముమ్మర సహాయకచర్యలు చేపట్టింది. బోగీల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి శరవేగంగా ఆసుపత్రులకు తరలించేందుకు 200 అంబులెన్స్‌ లను ఘటనాస్థలంలో ఏర్పాటు చేశారు. ఇందులో 167 వరకు 108 వాహనాలు కాగా.. 20కి పైగా ప్రభుత్వ అంబులెన్స్‌లు ఉన్నాయి. వీటితో పాటు 45 మొబైల్‌ హెల్త్‌ బృందాలు ఘటనాస్థలంలో అందుబాటులో ఉన్నాయి. అదనంగా మరో 50 మంది వైద్యులను కూడా పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Spread the love