– ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు
నవతెలంగాణ – సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణంలో గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఒక భవనం పైనుంచి దూకి యువకుడు మృతి చెందాడు. ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు మండలం పోరంకికి చెందిన బొడ్డు వినీత్ (29) అనే యువకుడు సత్తుపల్లి వేంసూర్ రోడ్డులోని విస్తార్ ఫైనాన్స్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అంబేద్కర్ నగర్‌లో రూమ్ అద్దెకు తీసుకుని నివాసముంటున్న వినీత్, గురువారం తెల్లవారుజామున మిలీనియం స్కూల్ రోడ్డులోని ఒక భవనం పైకి ఎక్కి ఓ ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లోని కుటుంబ సభ్యులు అతడిని చూసి ‘దొంగ దొంగ’ అని కేకలు వేశారు.
దాంతో కంగారుపడిన వినీత్ వెంటనే వెనుతిరిగి, భవనం రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. కింద ఉన్న రాయికి తల బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతనికి ప్రాథమిక వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే తీవ్రంగా గాయపడిన అతడ్ని పరీక్షించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడు వినీత్ ఆ భవనం పైకి ఎందుకు వెళ్లాడనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



