Thursday, August 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవైఎస్సార్‌ మ్యూజియానికి త్వరలో పూర్వ వైభవం

వైఎస్సార్‌ మ్యూజియానికి త్వరలో పూర్వ వైభవం

- Advertisement -

2500 ఏండ్ల నాటి ఈజిప్షియన్ మమ్మీ సంర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు
దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు
వారంలోగా పనుల అంచనాలు సమర్పించాలి : పర్యాటక శాఖ మంత్రి జూపల్లి ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

చారిత్రక, పురావస్తు సంపదకు నిలయమైన డా. వైఎస్సార్‌ మ్యూజియానికి పూర్వ వైభవం తీసుకొస్తామని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని చెప్పారు. ఇన్నేండ్లుగా, నిర్లక్ష్యానికి గురైన మ్యూజియాన్ని సమగ్రంగా పునరుద్ధరిస్తామని తెలిపారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు సందర్శించేలా అభివృద్ధి చేస్తామని వివరించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని డా. వైఎస్ఆర్ రాష్ట్ర హెరిటేజ్ మ్యూజియాన్ని బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. మ్యూజియంలోని వివిధ గ్యాలరీలను పరిశీలించి అక్కడ భద్రపరిచిన అరుదైన పురావస్తు, చారిత్రక వస్తువుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రాంజ్, బుద్ధిస్ట్, శిల్పకళ, ఫిరంగులు, పెయింటింగ్ గ్యాలరీలను పరిశీలించారు. మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న క్రీ.పూ. 2500 ఏండ్లనాటి ఈజిప్షియన్ మమ్మీని మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. ఇంతటి ప్రాచీనమైన మమ్మీని భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండేలా అత్యంత భద్రంగా సంరక్షించాలని అధికారులను ఆదేశించారు. జర్మన్ నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా మమ్మీ సంరక్షణకు రూ.82 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు అధికారులు మంత్రికి వివరించారు. హైదరాబాద్‌కు వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే ప్రదేశంగా హెరిటేజ్ మ్యూజియాన్ని తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. మ్యూజియంలోని అరుదైన పురావస్తు సంపద, చారిత్రక విశేషాలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. మ్యూజియం పునరుద్ధరణకు అవసరమైన నిధులను త్వరితగతిన విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. భవన సంరక్షణతో పాటు మ్యూజియం పునర్నిర్మాణం, పెయింటింగ్ తదితర పనులను చేపట్టేందుకు సమగ్ర అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.

మ్యూజియం పునర్నిర్మాణం, భవన సంరక్షణ, పెయింటింగ్ పనులకు సంబంధించిన అంచనాలను రూపొందించి వారంలోగా సమర్పించాలని పురావస్తు శాఖ డైరెక్టర్ డా. అర్జునరావును మంత్రి ఆదేశించారు. మ్యూజియం అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే అరుదైన సంపదను పరిరక్షించడంతోపాటు వాటిని ప్రజలకు, పర్యాటకులకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఈ కార్య‌క్ర‌మంలో పురావ‌స్తు శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్ డా. రాములు నాయ‌క్, డా. నాగ‌రాజు, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ బి. మ‌ధు, డి. బుజ్జి, తదిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -