జులై 11,12, 13 తేదీలలో ప్రత్యేక కేంద్ర కమిటీ
మోడీ ప్రభుత్వ హయాంలో అవినీతి : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రెండు రోజుల పాటు జరిగిన సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సమావేశం శనివారం ముగిసింది. జులైలో జరగనున్న ప్రత్యేక కేంద్ర కమిటీ సమావేశంలో పరిశీలించాల్సిన ఎన్నికల సమీక్షా నివేదికను పొలిట్‌బ్యూరో సమావేశం రూపొందించింది. కేంద్ర కమిటీ పరిశీలించాల్సిన మూడు డాక్యుమెంట్లకు పొలిట్‌బ్యూరో ఆమోదం తెలిపిందని ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ మీడియాతో అన్నారు. కేరళతో సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికల పనితీరును సమీక్షించేందుకు ప్రత్యేక కేంద్ర కమిటీ సమావేశం జులై 11, 12, 13 తేదీలలో జరగనుందని తెలిపారు.
ప్రతిపక్షాలను బలహీనపరిచే కుట్రలు
దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించేందుకు కేంద్ర కమిటీ సమావేశం వచ్చే నెల 11 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్టు ఎంఏ బేబీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో చర్చించేందుకు మూడు కీలక పత్రాలకు పొలిట్‌బ్యూరోలో తుది రూపు ఇచ్చినట్టు తెలిపారు. “ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను సమీక్షించిన పార్టీ.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం, కేరళలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ఎల్డీఎఫ్కు ఎదురుదెబ్బ తగలడం, తమిళనాడులో కొత్త రాజకీయ పరిస్థితులు ఏర్పడడం వంటి అంశాలను చర్చించాం. ఆదివాసీ ప్రాంతాల్లో పార్టీ విస్తరణ, పార్టీలోని లోపాలను సరిదిద్దే ‘రెక్టిఫికేషన్’ ప్రక్రియ, పార్లమెంటరీ అవకాశవాదం, పార్లమెంటరీ వైఖరిలోని లోపాలపై ప్రత్యేక పత్రాలను ఉపసంఘం ముందుంచనున్నాం” అని తెలిపారు. “కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీలను చీల్చి తమ పార్లమెంటరీ బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ పార్టీలను ‘అక్విజిషన్, విలీనం, టేకోవర్’ విధానంలో బలహీనపరచడం రాజ్యాంగ విరుద్ధం. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి కూడా వ్యతిరేకం. ఈ అంశంపై దేశవ్యాప్తంగా రాజకీయ ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరుపనున్నాం” అని అన్నారు. “కేంద్ర ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగింది. వ్యవసాయ శాఖకు చెందిన ఒక మంత్రి తన సొంత సంస్థకు రూ.99 లక్షల నిధులు మంజూరు చేశారన్న వార్తలు దీనికి నిదర్శనం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి భూ కుంభకోణం ఒక ఉదాహరణ. అయోధ్య రామమందిర అవకతవకల వ్యవహారంలో అసలు సూత్రధారులపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. బాధ్యులందరిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం” అని ఆయన తెలిపారు.
ప్రతిపక్ష పార్టీలను బలహీనపర్చే కుట్రలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



