నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో 19,800 కానిస్టేబుల్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి సంబంధించి నకిలీ నియామక ప్రకటన సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నదని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు బుధవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నకిలీ ప్రకటనను నిరుద్యోగులు, యువత నమ్మవద్దని కోరారు. అలాంటి ప్రకటన ఏదీ రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేయలేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు సరైన సమాచారం కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే సందర్శించాలని తెలిపారు. ఎలాంటి పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.