Thursday, April 23, 2026
E-PAPER
Homeజాతీయం'ఓటు కు నోటు' విచారణ

‘ఓటు కు నోటు’ విచారణ

- Advertisement -

– మే 20కి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

‘ఓటుకు నోటు’ కేసులో దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు మే 20కి వాయిదా వేసింది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల నియమావళి కింద విచారణ చేపట్టాలని 22 జులై 2021న రేవంత్‌రెడ్డి, తన పేరును తొలగించాలని కోరుతూ 13 ఏప్రిల్‌ 2021న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లు కలిపి జస్టిస్‌ జే.కే.మహేశ్వరి, జస్టిస్‌ విజరు బిష్ణోరుల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూత్రా, ప్రతివాదుల తరఫున సీనియర్‌ న్యాయవాది ఆర్యమ సుందరం, జగదీశ్వర్‌రెడ్డి తరఫున న్యాయవాది వికాస్‌ సింగ్‌లు హాజరయ్యారు. తొలుత ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ… అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్‌ 12, సహా పలు సెక్షన్లు ‘మహేంద్ర కుమార్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’ కేసులో జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర, జస్టిస్‌ కే వీ విశ్వనాథన్‌ ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసిందన్నారు. ఆ తీర్పులోని అంశాలు ఓటుకు నోటు కేసుతో ముడిపడి ఉన్నాయని, ఈ తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామని గతంలో ధర్మాసనం వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు.
ఆ తీర్పు వచ్చే వరకు పిటిషన్లపై విచారణ వాయిదా వేశారన్నారు. మరో రెండు వారాల్లో ఆ తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రస్తుత విచారణను వాయిదా వేయాలని కోరారు. మరోవైపు జగదీశ్‌రెడ్డి తరఫున వికాస్‌ సింగ్‌ జోక్యం చేసుకొని… ఇంప్లీడ్‌ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకొని పిటిషనర్లకు నోటీసు ఇవ్వాలని కోరారు. అయితే… ఈ వాదనలపై సిద్దార్థ్‌ లూత్రా అభ్యంతరం తెలిపారు. కాగా… అన్ని వైపుల అంశాలను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం…. విచారణను మే 20 మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. అలాగే జగదీశ్‌రెడ్డి ఇంప్లీడ్‌ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకునేందుకు నిరాకరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -