– నైలాన్, సింథటిక్ మాంజా వాడొద్దు..పక్షుల ప్రాణాలు తీయొద్దు
– వాడితే మూడు నుంచి ఏడేండ్లపాటు జైలు శిక్ష
– రూ.10 వేల జరిమానా పడే అవకాశం
– వాటిని అమ్మేవారిపైనా కేసులు
– అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్లు 040 -23231440, 1800 4255 364
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంక్రాంతి పండుగకు పతంగులు ఎగువేస్తున్నారా? జరఫైలం. బిల్డింగ్లు, ఇంటి మిద్దెలపై వాటిని ఎగరేసే సమయంలోనే కాదు దారం వాడే విషయంలోనూ జర జాగ్రత్తలు తీసుకోండి. నైలాన్, సింథటిక్ మాంజాలపై నిషేధం ఉన్న విషయాన్ని గుర్తెరిగి నడుచుకోండి. ‘పతంగులతో పాటు పక్షులనూ ఎగరనిద్దాం’ అనే అటవీశాఖ నినాదానికి కట్టుబడి ఉండండి. కాదూ..కూడదు అని సింథటిక్, నైలాన్ దారానే వాడుతామంటారా? ఇక మీయిష్టం. రూ.10 వేల జరిమానా కట్టాల్సిందే. అంతేకాదండోరు.. మూడు నుంచి ఏడేండ్ల పాటు జైలు శిక్షకు కూడా గురి కావాల్సిందే. జర జాగ్రత్త సుమా. జంతు, పర్యావరణ ప్రేమికుల్లారా…ఎవరైనా నైలాన్, సింథటిక్ మాంజాలను అమ్ముతున్నట్టుగానీ, వాడుతున్నట్టుగానీ గుర్తిస్తే వెంటనే అటవీశాఖ టోల్ ఫ్రీ నెంబర్లు 040 -23231440, 1800 4255 364 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించండి. సంప్రదాయ కాటన్ దారాలను పతంగుల కోసం వాడాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్ చేసిన సూచనను ఆచరిద్దాం. వేలాది పక్షుల ప్రాణాలు కోల్పోకుండా మన వంతు కృషి చేద్దాం.సంక్రాంతి పండగను అందరూ ఆనందంగా జరుపుకోవాలి. కానీ పండగ సందర్భంగా ఎగరేసే పతంగుల వల్ల పర్యావరణం, పక్షులకు విపరీతంగా హాని జరుగుతున్నది. పతంగులను ఎగుర వేసేందుకు ఉపయోగించే నైలాన్, సింథటిక్ (చైనీస్ మాంజా) దారాల వల్ల ప్రతియేటా తీవ్ర అనర్ధాలు జరుగుతున్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ చైనీస్ మాంజాలను నిషేధించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2016లోనే ఈ విషయంపై ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే 28 లక్షల రూపాయల విలువైన 1391 కిలోల దాకా చైనీస్ మాంజా సీజ్ చేశామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పతంగులను ఎగురవేసే సమయంలో దారాలు తెగిపోవడం సాధారణం. మామూలు దారమైతే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ, కొందరు గ్లాస్ కోటింగ్‌తో ఉన్న నైలాన్, సింథటిక్ తాడును వాడుతున్నారు. పండగ తర్వాత ఎక్కడికక్కడ ఈ వ్యర్థాలు మిగిలిపోయి పర్యావరణం, పక్షులకు హాని జరుగుతున్నది. అవి చెట్టుకొమ్మలకు, స్తంభాలకు చిక్కుకుని అట్లాగే ఉండిపోతున్నాయి. వైరులాగా ఉండే ఆ దారం ఒక పట్టాన తెగదు. పైగా చిక్కులు పడిపోతుంది. దాన్ని గట్టిగా తగిలితే మెడ కూడా తెగిపోయే ప్రమాదం ఉంటుంది. పక్షుల విషయంలో ఇదే జరుగుతున్నది. చెట్టుకొమ్మ లకు, స్తంభాలకు చిక్కుముడిపడి ఉన్న నైలాన్ దారాల్లో పక్షుల కాళ్లు ఇరుక్కో వడం, అవి వెళ్లే క్రమంలో రెక్కలకు చుట్టుకోవడం, మెడకు పట్టుకుని తెగడం వంటివి జరుగుతున్నాయి. ఆ దారాల్లో చిక్కుకుని పక్షులు విలవిలలాడి ప్రాణాలను విడుస్తున్నాయి. మనుషులు కూడా గాయపడుతున్నారు.
నిషేధించాం..మాంజా అడ్డుకోవడం కోసం ఐదు నిఘా టీమ్‌లు పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్
చైనా మాంజాపై నిషేధం ఉంది. ఎవరైనా రవాణా చేస్తే వాహనాలు కూడా సీజ్ చేస్తామని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్ హెచ్చరించారు. నిఘా కోసం ప్రత్యేకంగా ఐదు టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. చైనా దారం అమ్మకం గురించిన వివరాలు తెలిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్లు 040 -23231440, 1800 4255 364 తెలియజేయాలన్నారు. ఎన్జీవోల సహకారంతో స్కూలు పిల్లలతో పాటు అందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. చైనా మాంజా అమ్మినా, నిలువ, రవాణా చేసినా ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా ఉందని, మాంజా వాడకం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరిగితే 3 నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష రూ. 10 వేల జరిమానా ఉంటుందని హెచ్చరించారు.