అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వడంలో సర్కార్‌ ఆలస్యం

నవతెలంగాణ-దుండిగల్‌
డబుల్‌ ఇండ్ల నిర్మాణాలు పూర్తయి ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వం అర్హులరు అందించడంలో ఆలస్యం చేస్తుందని సీఐటీయూ బాచుపల్లి ఏరియా నాయకులు ఎం.చంద్రశేఖర్‌ తెలిపారు. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక పిలుపు లో భాగంగా బాచుపల్లి, రాజీవ్‌ గాంధీ నగర్‌, ఇందిరానగర్‌ బస్తీల్లో సర్వే చేసి లబ్దిదారులతో సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం బాచుపల్లి మండల కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మండల అధికారి మంజులకి వినతి పత్రంతో పాటు లబ్ధిదారుల దరఖాస్తులు అందజేసి సామాజిక సర్వే నిర్వహించి ఇండ్లు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజానీకం బతుకుతెరువు కోసం ఏండ్లుగా హైదరాబాద్‌ నగరంలో అనేక బస్తీల్లో జీవిస్తున్నారాన్నారు. ధరల పెరుగుదల బడుగు జీవుల మీద శరాఘాతంగా మారి బతకలేని పరిస్థితుల్లో ఉండటానికి చారెడు జాగా లేక ఇల్లు లేక సంపాదిస్తున్న అతి తక్కువ జీతాల్లో అధిక భాగం కిరాయిలకు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఋవో 58, 59 ప్రకారం ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి ఉచితంగా పట్టాలు, రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించినట్టు తెలిపారు. అనేకమంది పేదలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పట్టాలు పూర్తిగా అందరికీ ఇవ్వలేదన్నారు. 120 గజాల పైనున్న స్థలంలో నివసిస్తున్న వారికి అతి తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్‌ చేస్తామనీ, భూముల ధరలు అధికం కావడంతో ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.లక్షలు, 15 లక్షల రుసుములు చెల్లించాలని చెప్పటం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పేదలను మభ్య పెట్టే మాటలు కట్టి పెట్టి అర్హులైన అందరికీ ఇండ్లు ఇండ్ల పట్టాలు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటాలను ఉదృతం చేసి ప్రభుత్వం మెడలు వంచి పేదవాడి నివాస భూమి, ఇండ్లు సాధిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు ఎన్‌.ఎల్లమ్మ, స్థానిక నాయకులు నీరుడు యాదయ్య, బి.ప్రవీణ్‌, మాణిక్యం, బస్తీల నుంచి నీలమ్మ, కరుణ, సునీత, శ్రీకాంత్‌, ఉపేందర్‌, బి.రాజు, శ్రీను, శివ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love