మతోన్మాదంతో కార్మికుల మధ్య బీజేపీ చిచ్చు

– తిప్పికొట్టేందుకు ఐక్యంగా ముందుకు సాగాలి
– కష్టజీవుల మీద భారాలు.. కార్పొరేట్లకు రాయితీలు
– ఏప్రిల్‌ 5న ఢిల్లీలో మహాప్రదర్శనకు కష్టజీవులు కదిలిరావాలి : సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత
– సిద్దిపేటలో సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభలు ప్రారంభం
సిద్ధిపేట నుంచి అచ్చిన ప్రశాంత్‌
కులం, ప్రాంతం, మతోన్మాదం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల మధ్య చిచ్చుపెట్టి కార్పొరేట్లకు అనుకూల నిర్ణయాలు చేసుకుంటూ పోతున్నదని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని తిప్పికొట్టేందుకు కార్మిక సంఘాలన్నీ మరింత ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 2023, ఏప్రిల్‌ ఐదో తేదీన కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. బుధవారం సిద్దిపేటలోని మల్లు స్వరాజ్యం నగర్‌లోని సున్నం రాజయ్య ప్రాంగణంలో సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. గత మూడేండ్ల కాలంలో ప్రపంచం ముందు కరోనా, ఆర్థిక సంక్షోభం రూపంలో పెద్ద సమస్యలు వచ్చిపడ్డాయన్నారు. కరోనాతో లక్షలాది మంది చనిపోయారనీ, కోట్లాది మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేయకపోవడం వల్లనే ప్రపంచంలోనూ, దేశంలోనూ ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొందరి చేతుల్లోనే బంధీ కావడం ఆందోళనకరమన్నారు. కరోనా, ఆర్థిక సంక్షోభంతో కోట్లాది మంది రోడ్డునపడ్డారన్నారు. వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో మన దేశంలో పేదలకు వైద్య సౌకర్యాలు, ఉపాధి కల్పించడం, ఆసరాగా నిలవడం వంటి అంశాలనుంచి మోడీ సర్కారు పక్కకు తప్పుకున్నదన్నారు. మేలు చేయకపోగా కార్మికులపైనా, కష్టజీవులపైనా భారాలు మోపుతూ కార్పొరేట్లకు నష్టాల పేరిట రాయితీలు కల్పిస్తూ పోతున్నదని విమర్శించారు. అన్ని పెట్టుబడిదారీ దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం అయ్యాయన్నారు. ఓవైపు ప్రజలు
కరోనాతో అల్లాడుతుంటే మోడీ సర్కారేమో లేబర్‌కోడ్‌లు, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వేగతరం చేసిందన్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు అంటూ ఆశా, అంగన్‌వాడీ వర్కర్లతో కరోనా సమయంలో సేవలు చేయించుకున్నదనీ, వారికి ఇస్తామన్న గౌరవ వేతనాలను మాత్రం ఇవ్వలేదని విమర్శించారు. కార్మికుల వేతనాల కోత, బోనస్‌, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వంటి పరిణామాలు దేశంలో జరుగుతున్నాయన్నారు. దీనికి వ్యతిరేకంగా అఖిల భారత స్థాయిలో సార్వత్రిక సమ్మెలను అన్ని కార్మిక సంఘాలతో కలిసి విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగానూ ఇలాగే పోరాటాలు ఉధృతం అవుతున్నాయన్నారు. ఇంగ్లాండ్‌లో రైల్వే కార్మికులు వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలలో మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వస్తున్నారని చెప్పారు. గ్రీస్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, అమెరికాలో జరుగుతున్న కార్మిక, ప్రజా పోరాటాల గురించి వివరించారు. ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాడుతున్న వామపక్షాల బలం ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని తెలిపారు. చిలీలో రవాణా చార్జీల తగ్గింపు కోసం మొదలైన పోరాటం అక్కడ రాజ్యాంగాన్నే మార్చుకునే దాకా ఊపందుకున్నదని చెప్పారు. మన దేశంలోనూ కార్మిక పోరాటాలు పెరిగాయన్నారు. అయితే, మన దగ్గర కార్మికులు ఐక్యం కాకుండా మతం, కులం, ప్రాంతం పేరుతో చీల్చి ఉంచే కుట్రలకు మోడీ సర్కారు పూనుకున్నదని విమర్శించారు. తెలంగాణలోనూ కనీస వేతనాల జీవో కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ కంటే బీజేపీ మరింత ప్రమాదకరమన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అవుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి, కార్మికుల్లోకి తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత సీఐటీయూపై ఉందని నొక్కి చెప్పారు. కష్టజీవుల ఐక్యతను పెంచుకుంటూ కార్మిక సంఘాలు ఐక్యపోరాటాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్మిక ఐక్యత మీద జనవరి 30న ఢిల్లీలో కార్మిక సంఘాల ఐక్య సమావేశం జరుగబోతున్నదని చెప్పారు. రీచ్‌టూ అన్‌రీచ్‌ పేరుతో ప్రతి కార్మికుని దగ్గరకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.

Spread the love