ప్రతినెలా 14… అంగన్‌వాడీ టీచర్ల జీతాల తేది

 మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి

నవతెలంగాణ హైదరాబాద్‌: అంగన్‌వాడీ టీచర్లకు ప్రతినెలా 14వ తేదీకి జీతాలు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని  గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వారికి బీమా సౌకర్యం, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లుల సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయన్నారు. అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌, మినీ అంగన్ వాడీ, సీఐటీయూ, ఏఐటీయూసీ యూనియన్‌లతో సచివాలయంలో మంత్రి సమావేశమయ్యారు.
అంగన్‌వాడీల విజ్ఞప్తులు ఇవే..
రిటైర్మెంట్‌ ప్రయోజనాలు, బీమా సౌకర్యం, వేతన సవరణ, కారుణ్య నియామకాలు, మినీ అంగన్‌వాడీలను ప్రధాన సెంటర్లుగా మార్చడం పదోన్నతుల్లో సర్వీసు నిబంధనలు సడలించాలని కోరారు. అలాగే టీఏ, డీఏలు చెల్లించాలని, సూపర్ వైజర్‌ల నియామకాలను పరీక్షల ద్వారా కాకుండా సీనియార్టీ ప్రతిపాదన అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అంగన్‌వాడీల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
త్వరలో బ్రిడ్జి కోర్స్..
 సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్‌వాడీలకు అండగా నిలిచిందని.. దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను పెంచినట్టు మంత్రి తెలిపారు. అంగన్‌వాడీల్లో త్వరలో బ్రిడ్జి కోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో టేక్ హోమ్ రేషన్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపడుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని యూనిసెఫ్‌ ప్రతినిధులు కొనియాడిన విషయాన్ని  ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

Spread the love