కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయాలి

Contract ANMs should be regularized– సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
– సమ్మెకు మద్దతు
నవ తెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్‌ చేయాలని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్‌ఎంల సమ్మె కొనసాగుతోంది. బుధవారం యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్‌ ఆధ్వర్యంలో బుధవారం కోఠిలోని డీఎంహెచ్‌ఎస్‌ ఆవరణలో కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమ్మెకు సీపీఐ(ఎం) తరఫున మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ గతంలో అనేక సభల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దేశంలోనే వైద్య ఆరోగ్యశాఖ నెంబర్‌ వన్‌గా ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పుడు.. అందులో ఏఎన్‌ఎంల భాగస్వామ్యం కూడా ఉందన్నారు. కరోనా సమయంలో ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలు అందించారన్నారు. ఆ సమయంలో కరోనాతో కొంతమంది ఏఎన్‌ఎంలు ప్రాణం కోల్పోయరని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి సేవలను గుర్తించి సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా యూనియన్‌ ప్రతినిధులను పిలిచి చర్చలు జరపాలని కోరారు. 20 ఏండ్లుగా వైద్య శాఖలో సేవలందిస్తున్నారని తెలిపారు. ఈ మధ్యనే కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారని చెప్పారు. ఏఎన్‌ఎంలను ఎలాంటి రాత పరీక్షలు లేకుండా రెగ్యులర్‌ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ గౌరవాధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు బలరాం, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు జె.కుమారస్వామి, ఏఎన్‌ఎంలు కిరణ్మయి, రాజేశ్వరి, రమాదేవి, నీలిమ, స్వాతి, సంగీత, వివిధ జిల్లాల ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట రెండో ఏఎన్‌ఎంలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ సెంటర్‌లో సెకండ్‌ ఏఎన్‌ఎంలు కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే సీతక్క పాల్గొని సంఘీభావం తెలిపారు. వరంగల్‌ జిల్లాలో మోకాళ్ళపై నిలబడ్డారు.రెండో ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలని భద్రాచలం పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఆరోగ్య శాఖ పరిధిలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న సెకండ్‌ ఏఎన్‌ఎంలను భేషరతుగా రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌లో కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన కొనసాగింది. మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.

Spread the love