పారితోషికాలూ పెంచాలి : ఆశా వర్కర్ల డిమాండ్‌..

Wages should be increased: Asha workers demand..– పారితోషికాలూ పెంచాలి
– ఆశా వర్కర్ల డిమాండ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా
నవతెలంగాణ- విలేకరులు
పారితోషికాలను పెంచి, ఫిక్స్‌ వేతనం నిర్ణయించాలని కోరుతూ బుధవారం ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాలంటీర్‌ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. తమ పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని, వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ డీఎంహెచ్‌ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్‌ మాట్లాడుతూ.. ఆశావర్కర్లు కరోనా మహమ్మారి కాలంలో వైరస్‌ను నియంత్రించడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. అయితే, ఆశాలకు కేవలం రూ.9,750 పారితోషికం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. వారి పనికి తగిన వేతనాలు ఇవ్వడం లేదని, పారితోషికాలను రూ.18,000కు పెంచి ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించాలని కోరారు. సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ అధ్యక్షులు టి.యాదమ్మ, ప్రధాన కార్యదర్శి ఎం.అనిత పాల్గొన్నారు. ములుగు జిల్లాలో డిఎల్‌ఆర్‌ ఫంక్షన్‌ హల్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ముట్టడి చేపట్టి ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఏఓ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాకు ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క మద్దతు తెలిపారు. పారితోషికాలను పెంచి, ఫిక్స్‌్‌డ్‌ వేతనం నిర్ణయించాలని ఆదిలాబాద్‌, నిర్మల్‌లో ఆశాలు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్‌లో సీఐటీయు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. నిర్మల్‌ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్‌ ఆధ్వర్యంలో గాంధీ పార్క్‌ నుంచి పాత కలెక్టర్‌ కార్యాలయం వరకు ఆశాలు ర్యాలీ నిర్వహించారు. నల్లగొండ కలెక్టరేట్‌ ముందు భారీ ధర్నా నిర్వహించి జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ ఆఫీస్‌ వరకు ప్రదర్శనగా వచ్చి డీఎంహెచ్‌ఓ కొండలరావుకు వినతిపత్రం ఇచ్చారు. ప్రదర్శన అనంతరం ఆశా వర్కర్లు యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు డి.మహేశ్వరి అధ్యక్షతన సభ నిర్వహించారు. ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్‌ వేతనం రూ.18000, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సీఐటీయూ కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
స్థానిక అంబేద్కర్‌ స్టేడియం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీ కిరణ్‌కి వినతిపత్రం అందజేశారు.

Spread the love