అసంతృప్తుల ఐక్యత

Unity of the Disaffected– ఒక్కటవుతున్న బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కని నేతల అనుచరులు
– ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ
అసంతృప్తుల మధ్య ఐక్యత చిగురిస్తోంది. బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కని నేతల అనుచరులు ఏకమవుతున్నారు. కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చి బీఆర్‌ఎస్‌నే నమ్ముకున్న నేతలకు మొండిచేయి చూపించడంపై మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు చేయాలని భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల, వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ అనుచరులు రహస్య సమావేశం అయినట్టు తెలుస్తోంది. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో వేముల వీరేశం అనుచరులు కూడా తిరుగు’బాట’లో ఉన్నారు. టిక్కెట్‌ రాని నేతల స్పందన ఎలా ఉన్నా వారి అనుచరులు మాత్రం బీఆర్‌ఎస్‌ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి కేసీఆర్‌ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు
‘నల్లగొండ’ బీఆర్‌ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి తారాస్థాయిలో కొనసాగుతోంది. టికెట్‌ మాకు ఇవ్వకున్నా పర్లేదు కానీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఇవొద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కోదాడ, నల్లగొండ, నాగార్జునసాగర్‌, దేవరకొండ, మునుగోడు, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల వ్యవహారమే ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. కోదాడ టికెట్‌ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు సీరియస్‌ అయ్యారు. కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డితోపాటు     డీసీసీబీ చైర్మెన్‌ ముత్తవరపు పాండురంగారావు తదితరులంతా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు.
ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని వేనేపల్లి చందర్‌రావు శశిధర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకట రత్నంబాబు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు. కోదాడ పట్టణంలోని పెరిక భవన్‌లో నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నోముల భగత్‌కు టికెట్‌ ఇవ్వడాన్ని అక్కడి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ టికెట్‌ ఆశించిన యాదవ సామాజిక తరగతికి చెందిన కట్టెబోయిన అనిల్‌కుమార్‌, గురువయ్యయాదవ్‌, మన్నెం రంజిత్‌ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అధిష్టానం మానసు మార్చుకుని వీరిలో ఎవరికి టికెట్‌ దక్కినా.. మిగిలిన వారంతా కలిసి పనిచేయాలని, లేనిపక్షంలో ఇతర పార్టీల్లోకి జంప్‌ చేస్తే ఎలా ఉంటుందనే అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నకిరేకల్‌ నియోజకవర్గ టికెట్‌ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
బుధవారం నకిరేకల్‌లో పెద్దఎత్తున అనుచరులు, సన్నిహితులతో సమావేశమ య్యారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయ భవిష్యత్‌పై వారం రోజుల తర్వాత చెబుతామన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని నేతలు బహిరంగంగానే సభలు, సమావేశాలు పెడుతున్నారు. ఇప్పటికే ఆయనకు టికెట్‌ కేటాయించొద్దంటూ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి విన్నవించారు. అధిష్టానం రవీంద్రకుమార్‌కు టికెట్‌ కేటాయించినప్పటి నుంచి నియోజకవర్గంలో అసంతృప్తి స్వరం మరింత పెరిగింది.ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం.. వారిపై భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు రావడంతో టికెట్‌ తమకే దక్కుతుందని పలువురు నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా బీఆర్‌ఎస్‌ అధిష్టానం సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వడంతో షాక్‌ తిన్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు లీడర్లు టికెట్‌ ఆశించారు. కానీ టికెట్‌ సిట్టింగ్‌కే దక్కడంతో ఇన్నాళ్లూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేసిన అసంతృప్తులంతా ఏకమయ్యారు.
కరీంనగర్‌ శాసనసభకు పోటీ చేస్తా..
బీఆర్‌ఎస్‌లో గుర్తింపు, గౌరవం లేదు మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌ వచ్చే శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్‌ తెలిపారు. సుమారు ఆరేండ్లపాటు బీఆర్‌ఎస్‌లో కొనసాగిన ఆయన పార్టీకి, పార్టీ ప్రాథ మిక సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలంటూ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు స్వయంగా ఆహ్వానించడంతో 2018లో కాంగ్రెస్‌ని వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశానని చెప్పారు. అయితే పార్టీలో తనకు గుర్తింపు, గౌరవం లేకపోవడం వల్ల అందులో ఇమడలేక రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. మిత్రులు, శ్రేయోభిలాషులు, కరీంనగర్‌ నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించే వారితో త్వరలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. 1981లో కౌన్సిలర్‌గా రాజ కీయ ప్రస్థానం ప్రారంభించిన తాను నీతి, నిజా యితీగా ప్రజాసేవలో కొనసాగుతున్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. వచ్చే శాసనసభ ఎన్ని కల్లో కాంగ్రెస్‌ లేదా బీజేపీ నుంచి పోటీ చేసే అవ కాశం ఉందని, ఇప్పటికే రెండు పార్టీల నేతలు తనను సంప్రదించారని తెలిపారు.అయితే, తన శ్రేయోభిలాషుల సూచనలకు అను గుణంగానే రాజ కీయ భవిష్యత్తుపై నిర్ణయం ఉంటుందని చెప్పారు.
‘తాటికొండ’ను కలిసేందుకు పల్లా ప్రయత్నం
స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్యకు ముందు నుంచి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి గాడ్‌ఫాదర్‌గా వ్యవహరించారు. ఈసారి మాత్రం ‘తాటికొండ’కు ‘పల్లా’ టికెట్‌ ఇప్పించలేకపోయారు. దీంతో ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. రాజయ్యను ఓదార్చడానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తు న్నారు. బుధవారం ‘తాటికొండ’ అందుబాటులోకి రాకపోవడంతో ‘పల్లా’ ఎమ్మెల్యే అనచరులతో చర్చలు జరిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే రాజయ్యతోపాటు కలవనున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ సముచిత స్థానం కల్పిస్తారని అన్నారు. ‘పల్లా’ తన ఇంటికి వచ్చినట్లు సమాచారం తెలిసినా, ఆయన్ను కలవడానికి ‘తాటికొండ’ నిరాకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మాజీ మంత్రి తుమ్మలతో ఎంపీలు, ఎమ్మెల్యేలు భేటీ
అనారోగ్యంతో ఉన్నందుకే కలిశామంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిక్కెట్‌ దక్కని నేతల అనుచరులు ఏకమవుతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌పై ఆశలతో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాదని ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డికి టిక్కెట్‌ ఇవ్వడంపై తుమ్మల అనుచరులు బీఆర్‌ఎస్‌ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ను కాదని గత ఎన్నికల్లో ఈయన చేతిలో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌కు టిక్కెట్‌ ఇవ్వడం కూడా వివాదానికి దారితీసింది. దాంతో తుమ్మల, రాములునాయక్‌ అనుచరులు వైరాలోని ఓ రహస్య ప్రదేశంలో సమావేశం అయ్యారు. వైరాలో తుమ్మల అనుచరులు గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ తర్వాత మాజీ మంత్రిని కలిసేందుకు హైదరాబాద్‌ వెళ్లనున్నట్టు సమాచారం. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఉండటంతో ఆయన్ను పలువురు వెళ్లి పరామర్శించి వస్తున్నారు. పనిలో పనిగా బీఆర్‌ఎస్‌ నేతలు సైతం వెళ్లి వస్తున్నారు. కానీ వీటిపై స్పందించేందుకు తుమ్మల సుముఖంగా లేరని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్‌ మంగళవారం రాత్రి తుమ్మలను పరామర్శించారు.ఖమ్మం ఎంపీ, బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావుతో పాటు మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్‌రావు వెళ్లి తుమ్మలను పరామర్శించారు. ఈ భేటీలకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని సమాచారం. కేవలం అనారోగ్యంతో ఉన్న మాజీ మంత్రిని పరామర్శించేందుకే నేతలు వచ్చినట్టు తుమ్మల ప్రధాన అనుచరులు చెబుతున్నారు. వెళ్తూ వెళ్తూ నామ నాగేశ్వరరావు తమను కేసీఆర్‌ పంపించలేదని మరీ స్పష్టత ఇచ్చారు. ఈ విషయాల పైనేకాక, భవిష్యత్‌ కార్యాచరణపై అనుచరుల సమావేశాలపైనా ఆయన నుంచి ఎలాంటి స్పందనా లేదు. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించి తమనేత తదుపరి నిర్ణయం ఉంటుందని తుమ్మల వర్గీయుల మాట. బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు తప్పదని సైతం వారు హెచ్చరిస్తున్నారు.

Spread the love