శాంతి కాముక భారత్‌ను నిర్మిద్దాం

– క్రిస్మస్‌ వేడుకలో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జై భారత్‌ నినాదంతో అద్భుత భారత్‌ను నిర్మిద్దామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు జరిగాయి. క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి సీఎం వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కెేసీఆర్‌ మాట్లాడుతూ మంచి కోసం చేసే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కొత్త సమరానికి శంఖం పూరించామని తెలిపారు. రాష్ట్రంలాగానే దేశాన్ని శాంతి కాముక దేశంగా పురోగమింపచేద్దామని చెప్పారు. సమాజంలో కరుణ, దయ ఉండాలని క్రీస్తు కోరుకున్నారని గుర్తు చేశారు. ఈ విషయంపై ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే సమాజానికి అంత మంచి చేకూరుతున్నదని చెప్పారు. క్రీస్తు బోధనలు ఆచరిస్తే.. ప్రపంచంలో ద్వేషం, అసూయ, అసహనం ఉండదన్నారు. ప్రపంచ యుద్ధాలే జరగవని చెప్పారు. జైళ్లు అసలే అవసరముండబోవన్నారు. మానవుడు పరిణితిని, పరిపక్వతను సాధిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్నప్పటికీ ఇటువంటి విషయాల్లో ఇంకా పురోగమనం చెందాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. దాని కోసం క్రమపద్ధతిలో మతపెద్దలు విస్తృతంగా ప్రచారం చేయటం అవసరమన్నారు. వసుదైక ప్రపంచం రావాలని, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రగతి కోసం, అందరూ చక్కగా జీవించే సమాజం కోసం క్రీస్తు తర్వాత ఎందరో ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. మనిషి తనకు తాను ఏ విధంగా ప్రేమించుకుంటాడో, పొరుగువారిని, ఇతరులను కూడా ప్రేమించడం అలవాటు చేసుకోవాలని చెప్పి ఒక శాంతిదూతగా ప్రపంచానికి సందేశం ఇచ్చినటవుంటి మహౌన్నతమైన టువంటి దేవుని బిడ్డ జిసస్‌ క్రీస్తు అని చెప్పారు. పూల ఆంథోని బిషప్‌ స్థాయి నుంచి ఎదిగి పోప్‌ను ఎలెక్ట్‌ చేసే కార్డినల్స్‌లో భాగస్వామి కావడం మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. క్రైస్తవ పెద్దలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై చర్చించేందుకు త్వరలో సమావేశం నిర్వహిస్తానని సిఎం తెలిపారు. వికలాంగ విద్యార్ధులకు సీఎం బహుమతులు అంద జేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహి స్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.అన్ని మతాలు, కులాలను గౌరవిస్తూ వారి మనోభావాలను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభు త్వం పనిచేస్తున్నదని చెప్పారు. లౌకక స్ఫూర్తితో పాలన సాగిస్తున్నా మన్నారు. మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి,శాసన సభ స్పీకర్‌ పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు మహమూద్‌ అలీ, కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్‌, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, సైబరాబాద్‌ సిపి స్టీఫెన్‌ రవీంద్ర, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మతగురువులు, బిషప్‌లు, ఫాస్టర్లు, వేడుకల్లో పాల్గొన్నారు.

Spread the love