ఏకకాలంలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన‌ కేసీఆర్

నవతెలంగాణ – హైద‌రాబాద్ : దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా శుక్రవారం సరికొత్త రికార్డు న‌మోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీల త‌ర‌గ‌తుల‌ను సీఎం కేసీఆర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారితో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు,వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పండుగ వాతావరణంలో నిర్వహించింది. మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో జిల్లాకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఇటీవల మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కనీసం 15-20 వేల మందితో జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వ‌హించారు. ఇందులో పెద్ద ఎత్తున యువతను, విద్యార్థులను భాగస్వాముల‌ను చేశారు.

Spread the love