ఆడబిడ్డలకు వరం ‘కల్యాణలక్ష్మి’ పథకం

నవతెలంగాణ-గంగాధర
ప్రభుత్వ అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డలకు వరంగా మారిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండల కోట్ల నర్సింహులపల్లి, సర్వారెడ్డిపల్లి, వెంకటాయపల్లి గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటి ఇంటికి వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం అమలుతో ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గిందన్నారు. ఏ రాష్ట్రంలో అమలు చేయనన్ని సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ సర్కార్ అమలు చేస్తుందన్నారు. కళ్యాణలక్ష్మీ పథకం వంటి బృహత్తర పథకం బీజేపీ పాలిత రాష్టాల్లో ఎక్కడ అమలు చేయడం లేదని, ఆ పార్టీ నేతలు, కేంద్ర ప్రభుత్వ పాలకులు విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. 2014 కంటే ముందు అప్పు చేసి ఆడపిల్లల పెళ్లీలు చేసేవారని, కల్యాణలక్ష్మి పథకం అమలుతో ఆ బాధ లేకుండా పోయిందన్నారు. బడుగు, బలహీన వర్గాలు, పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. దేశంలో రైతుల బాగోగులు ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకానికి ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుని సంవత్సరానికి దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల ప్రీమియం చెల్లిస్తుందని అన్నారు. అనంతరం కాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మడుపు తిరుపతిరెడ్డి అనే రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, అతని కుటుంబానికి 5 లక్షల విలువ గల రైతు బీమా ప్రొసీడింగ్ ను అందించారు. ఈ కార్యక్రమంలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త పుల్కం నర్సయ్య, గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, సర్పంచులు తోట కవిత-మల్లారెడ్డి, జోగు సాగర్, శ్రీమల్ల మేఘరాజ్, మడ్లపల్లి గంగాధర్, బీఆర్ఎస్ నాయకులు కర్బుాజ తిరుపతి గౌడ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love