ఆర్టీసీకి అన్యాయం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్న టీఎస్‌ఆర్టీసీపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించి, మరో రూ.1,500 కోట్లు సర్కారు గ్యారెంటీ రుణాలు ఇపిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. కానీ బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,500 కోట్లలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు విడుదల చేశారు. మిగిలిన సొమ్ము వస్తుందో…రాదో తెలీదు. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఆర్టీసీకి కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే కేటాయించారు. అదీ సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఇతర పద్దుల కింద సంస్థకు రావల్సిన సొమ్మే కావడం గమనార్హం. ఈ ఏడాదిలో సర్కారు గ్యారెంటీ రుణాలుగా ఆర్టీసీ రూ.వెయ్యి కోట్లు మాత్రమే తీసుకున్నది. దానికి వడ్డీ సహా అసలు కూడా సంస్థే చెల్లిస్తున్నది. బడ్జెట్‌ కేటాయింపు ద్వారా రావల్సిన నిధులు రాలేదు. ఫలితంగా సంస్థపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నది. డీజిల్‌ ధరలు పెరగడంతో నిర్వహణ వ్యయం కూడా పెరిగినట్టు యాజమాన్యం చెప్పింది. దాన్ని కవర్‌ చేసుకోవడానికి వివిధ సెస్‌ల రూపంలో ప్రయాణీకులపై ఆర్థిక భారం వేసినా, ఇంకా సంస్థ లోటులోనే ఉన్నదని అధికారులు చెప్తున్నారు. ఆర్టీసీకి బడ్జెట్‌లో రెండు శాతం నిధులు కేటాయించాలని కార్మిక సంఘాలు ఏటా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. ప్రయోజనం శూన్యం. ఆర్టీసీ కార్మికులకు 2015లో జరిగిన వేతన సవరణ తర్వాత ఇప్పటి వరకు జీతాలు పెరగలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాదిలోనే 30 శాతం జీతాలు పెంచిన ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులను మాత్రం పట్టించుకోలేదు. దానితో పాటు సీసీఎస్‌, ఎస్‌ఆర్‌బీఎస్‌ సహా పలు రూపాల్లో కార్మికులకు సొమ్ము చెల్లించాల్సి ఉంది. వాటి ఊసు బడ్జెట్‌లోనే లేదు. దీనిపై ఆర్టీసీలోని కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి. టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్‌, కన్వీనర్లు కే రాజిరెడ్డి, వీఎస్‌ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే కార్మికులకు రెండు వేతన సవరణలు ఇవ్వాల్సి ఉంది. వాటి గురించి అతీగతీ లేదు. ఈ ఏడాది కూడా వేతన సవరణ ఉండదని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్టు అయ్యిందని ఆక్షేపించారు. కార్మికుల సహనాన్ని ఇంకా పరీక్షించడం ప్రభుత్వానికి సమంజసం కాదని హెచ్చరించారు.
నేడు డిమాండ్స్‌ డే
బడ్జెట్‌లో ఆర్టీసీకి నిధుల కేటాయింపులో వివక్షను వ్యతిరేకిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ని డిపోలు, యునిట్లలో డిమాండ్స్‌ డే బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. కార్మికులు ఈ ఆందోళనను విజయవంతం చేయాలని కోరారు. జేఏసీ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Spread the love