ఆశా వర్కర్స్‌ సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించండి

నవతెలంగాణ-ధూల్‌పేట్‌
ఆశా వర్కర్స్‌ సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, పరిష్కారానికి కృషి చేయాలని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయు) గోషామహల్‌ జోన్‌ కమిటీ నాయకులు కే.జంగయ్య కోరారు. యూనియన్‌ ఆధ్వర్యంలో గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ కార్యాల యంలో కార్యదర్శి అర్జున్‌ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశాలకు కనీస వేతనం రూ.20వేలు ఇవ్వాలనీ, ఈలోపు ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్నట్టు వేతనం రూ.10వేలు వెంటనే నిర్ణయం చేయాలన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. 2022 డిసెంబర్‌ 6 నుంచి నిర్వహించిన లెప్రసీ సర్వే ప్రభుత్వం అధనంగా డబ్బులు చెల్లించాలన్నారు. 2023 జనవరి 18 నుంచి నిర్వహించిన కంటి వెలుగు పనికి అదనపు డబ్బులు చెల్లించాలన్నారు. గతంలో అశాలు నిర్వహించిన లెప్రసీ, కంటి వెలుగు పెండింగ్‌ డబ్బులను వెంటనే చెల్లించాలన్నారు. టీబీ స్కూటమి డబ్బాలను ఆశాలతో ముగించే పనిని రద్దు చేయాలన్నారు. ఆశాలకు పని భారం తగ్గించి, జాబ్‌ చార్టులను విడుదల చేయాలన్నారు. 2021 జూలై నుంచి డిసెంబర్‌ వరకు ఆరు నెలల పీఆర్సీ ఎరియర్స్‌ వెంటనే చెల్లించాలన్నారు. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్‌ అలవెన్స్‌ నెలకు రూ.వెయ్యి చొప్పున 16 నెలల బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. 32 రకాల రిజిస్టర్‌ ప్రింట్‌ చేసి ప్రభుత్వం సప్లై చేయాలనీ, ఈ లోపు రిజిస్టర్స్‌ కోసం పెట్టిన ఖర్చులు చెల్లించాలన్నారు. క్వాలిటీతో కూడిన ఐదేండ్లుగా పెండింగ్‌ లో ఉన్న యూనిఫామ్‌ వెంటనే ఇవ్వాలన్నారు. జిల్లా ఆస్పత్రిలో ఆశాలకు రెస్ట్‌ రూములు ఏర్పాటు చేయాలన్నారు. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలనీ, ఈలోపు పని చేసిన ఆశలకు ఇన్ఛార్జీ అలవెన్స్‌ చెల్లించాలన్నారు. ఆశాలపై అధికారుల వేధింపులు ఆపాలనీ, ప్రసూతి సెలవులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకుల కె.నాగమణి, పి.నాగేశ్వర్‌ పాల్గొన్నారు.

Spread the love