ఈ-కుబేర్‌ పేరుతో బిల్లులు పెండింగ్‌లో పెట్టొద్దు

– కనీసవేతనం రూ.25 వేలు ఇవ్వాలి
– యూనివర్సిటీల రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసి పోస్టులు భర్తీ చేయాలి
– పీహెచ్‌సీలు 24 గంటలు పనిచేసేలా చూడాలి
– అందరికీ విద్యా,వైద్యం అందితేనే సంక్షేమం : బడ్జెట్‌పై చర్చలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఈ కుబేర్‌ ఆన్‌లైన్‌ వచ్చాక అనేక బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. బిల్లులు వెంటనే చెల్లించాలి. వైద్యం చేయించుకుంటే సకాలంలో రీయింబర్స్‌ మెంట్‌ రాదు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలిచ్చేదే నాలుగైదు నెలలకోసారి. అందులోనూ మళ్లీ ఈ కుబేర్‌ పేరుతో పెండింగ్‌లో పెట్టడం అన్యాయం. బిల్లులు పెండింగ్‌లో లేకుండా చేయాలి. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు ప్రతినెలా ఐదు నుంచి ఏడో తేదీల్లోపు జీతాలు చెల్లించాలి’ అని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బుధవారం శాసనమండలిలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంకా కొంత మంది భార్యాభర్తల బదిలీలు మిగిలిపోయాయనీ, వారికి భరోసా కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానికత పోయింది అనే భావనలో ఉన్న వారికి భవిష్యత్‌లో అవకాశం వచ్చినప్పుడు సొంతజిల్లాలకు పంపిస్తామనే భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేజీబీవీలలో పనిచేసే వారికి రూ.26 వేలకు మించి వేతనం ఇవ్వడంలేదనీ, అదే పనిచేసే రెగ్యులర్‌ ఉద్యోగులకు రూ.56 వేల నుంచి 80 వేల వరకు వేతనాలు అందుతున్న పరిస్థితి ఉందని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు పెంచాలన్నారు. చాలా రంగాల్లోనూ కార్మికులకు రూ.8 వేల నుంచి రూ.9 వేలకు మించి అందటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 25 వేల కనీస వేతనం ప్రకటిస్తే లక్షలాది మంది పనిచేసేందుకు ముందుకు వస్తారని తెలిపారు. 11వేల మంది కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణను స్వాగతిస్తున్నామని చెప్పారు. వర్సిటీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లకు 30 శాతం పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ చొరవ తీసుకుని యూనివర్సీటీల రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లును ఆమోదించాలని కోరారు. వర్సిటీల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. జిల్లాకో ఇంటర్మీడియట్‌ అధికారిని నియమించాలనీ, ఖాళీగా ఉన్న వరంగల్‌ ఆర్జేడీ పోస్టును మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. 2015లో పాఠశాల విద్యలో 7000 ఎస్జీటీలు మిగిలిపోయాయనీ, వాటిని భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాల నుంచి సర్దుబాటు చేసైనా సరే పాఠశాల విద్యకు అధిక నిధులు అందేలా చూడాలన్నారు. రూ.500 కోట్ల నిధులను వర్సిటీలకు పంచి అభివృద్ధి కోసం వెచ్చించాలని కోరారు. ఉన్నత విద్యలోని సెమీ ఫైనాన్స్‌ కోర్సులను రెగ్యులర్‌ కోర్సులుగా మార్చాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటలు పనిచేసేలా చూడాలనీ, ప్రతి పీహెచ్‌సీకి ముగ్గురు డాక్టర్లు, ఆరుగురు నర్సులు ఉండేలా చూడాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు ప్రత్యేక అలవెన్స్‌లు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. విద్య, వైద్యం అందరికీ అందేలా చూడాలని కోరారు.
ఖాళీగా 10 లక్షల కేంద్ర ప్రభుత్వ పోస్టులు : ఎమ్మెల్సీ కవిత
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 10 లక్షల మేరకు ఖాళీగా ఉన్నాయనీ, వాటిని భర్తీ చేసే పనికి మోడీ సర్కారు పూనుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆ పోస్టులను భర్తీ చేస్తే అందులో కనీసం 2 లక్షల పోస్టులు తెలంగాణ బిడ్డలకు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా, మండల పరిషత్‌ సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలను, కలెక్టర్ల వద్ద పరిష్కారమయ్యే అంశాలను కొందరు సీనియర్‌ సభ్యులు మండలిలో ప్రస్తావించడం బాధాకరమంటూ వ్యాఖ్యానించారు. దీనికి జీవన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత అలా మాట్లాడటం సరిగాదన్నారు. మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ అన్‌పార్లమెంటరీ పదజాలం, కించపరిచే మాటలుంటే తొలగిస్తామనీ, జీవన్‌రెడ్డి కూర్చోవాలని చెప్పటంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత కవిత మాట్లాడుతూ…ఏ రాష్ట్రాల్లోనూ లేనన్ని మినహాయింపులను కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టుల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదనీ, అయితే, కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. టీ-ఐడియా ద్వారా సృజనాత్మకత ప్రదర్శించే ఎంతో మంది పిల్లలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
రైతు రుణమాఫీకి రూ.20 వేల కోట్లు కావాలి : ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి
రైతు బంధు పేరుతో రైతులకు గతంలో ఉపయోగకరంగా ఉన్న సబ్సిడీలను, పంటరుణాలను నిలిపే యడం సరిగాదని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణ రైతాంగానికి ఉపయో గపడే చెక్కర ఫ్యాక్టరీని ఓపెన్‌ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ డెయిరీలకు పాలు పోసే రైతులకు లీటర్‌ పాలపై రూ.4 ఇన్సెంటివ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మేకలు, గొర్రెల పెంపకం దారులకు షెడ్ల నిర్వహణ భారంగా మారిందనీ, వారికి ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కోతుల బెడద ఎక్కువైందనీ, అవి పంటలను మొత్తం నాశనం చేస్తున్నాయని చెప్పారు. కోతుల బెడద నివారణకు ప్రతి మండలంలోనూ నిర్మల్‌లో మాది రిగా స్టెరిలైజేషన్‌ సెంటర్‌ పెట్టాలని సూచించారు. గల్ఫ్‌లోని మన కార్మికుల సంక్షేమం కోసం కేరళ ప్రభుత్వ తరహాలో సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్లకు ట్రైనింగ్‌ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. బడ్జెట్‌పై చర్చలో ఎమ్మెల్సీలు భానుప్రకాశ్‌, ఫారూఖ్‌ హుస్సేన్‌, జనార్ధన్‌రెడ్డి, ఎమ్‌ఎస్‌ ప్రభాకర్‌, బండా ప్రకాశ్‌, రఘోత్తంరెడ్డి, కోటిరెడ్డి, తదితరులు మాట్లాడారు.

 

Spread the love