బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ నిర్లక్ష్యం

హైకోర్టు స్టే ఎత్తివేతపై సరిగ్గా స్పందించని అధికారులు
– విద్యామంత్రి, కార్యదర్శి సానుకూలమే డైరెక్టరేట్‌లోనే వైఫల్యం
– బడుల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా ప్రభుత్వం చూడాలి
– ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులను 31లోగా పూర్తిచేయాలి
– నిరసనగా 27న దీక్ష : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై పాఠశాల విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. విద్యాశాఖ అధికారులు సరిగ్గా స్పందిస్తే హైకోర్టులో స్టే వచ్చేది కాదన్నారు. స్టే వచ్చిన తర్వాత కూడా సరైన రీతిలో అధికారులు స్పందిస్తే ఎత్తేసే అవకాశముండేదని అన్నారు. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, కార్యదర్శి వాకాటి కరుణ సానుకూలంగానే ఉన్నా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లోనే పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తున్నదని చెప్పారు. అప్రమత్తంగా వ్యవహరిస్తే స్టే తొలగిపోయేదని, బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్‌ ఈ సెలవుల్లో కొనసాగేదని వివరించారు. జూన్‌ 13 వరకు స్టే కొనసాగుతుందన్నారు. ఎర్లీ హియరింగ్‌ అప్లికేషన్‌ను ఇవ్వాలంటూ మంత్రి, కార్యదర్శికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని అన్నారు. ఏజీ, ఏఏజీకి సరైన వివరాలివ్వడంలో విద్యాశాఖ విఫలమైందన్నారు. విద్యాశాఖ నిర్లక్ష్యంపై ఈనెల 27వ తేదీన దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 18 వేల ప్రాథమిక, మూడు వేలకుపైగా ప్రాథమికోన్నత, 4,600 ఉన్నత పాఠశాలల్లో 20 లక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. 1.04 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని చెప్పారు. పదోన్నతుల్లేకపోవడంతో 1,900పైగా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులు, రెండు వేలకుపైగా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులు, ఏడు వేలకుపైగా స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. రూ.3,497 కోట్లతో 9,123 పాఠశాలల్లో ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. డ్యూయల్‌ డెస్క్‌లు, బడులకు రంగులు, వసతులు కల్పిస్తేనే సరిపోదని, ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని సూచించారు. లేదంటే మన ఊరు-మనబడి నిరుపయోగంగా మారే ప్రమాదముందన్నారు. బదిలీలు, పదోన్నతులపై నిర్లక్ష్యం వహించే అధికారులను అవసరమైతే పక్కన పెట్టాలని కోరారు. మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదేండ్లుగా బదిలీలు, పదోన్నతులు చేపట్టడం లేదని చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌. పీఎఫ్‌ రుణాల కోసం ఆర్నెళ్లపాటు ఎదురుచూడాల్సి వస్తోందని అన్నారు. ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులతో కుబేరుని పొట్ట పగిలే పరిస్థితి ఉందన్నారు. పెండింగ్‌ బిల్లులను ఈనెల 31వ తేదీలోగా చెల్లించాలని కోరారు. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మినిమం బేసిక్‌ పే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
డిమాండ్లు
– ప్రభుత్వ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలల ‘బదిలీలు-పదోన్నతుల’ షెడ్యూల్‌పై హైకోర్టులో ఉన్న స్టేను ఎత్తేయించి ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి.
– మోడల్‌ స్కూళ్లలో ‘బదిలీలు-పదోన్నతుల’ షెడ్యూల్‌ను ప్రకటించి వెంటనే పూర్తి చేయాలి.
– ఈ-కుబేర్‌లో మార్చి వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ ఈనెల 31లోగా చెల్లింపులు పూర్తి చేయాలి.
– కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ‘మినిమం బేసిక్‌ పే’ను వేతనంగా చెల్లించాలి.

Spread the love