సుప్రీంను అవమానించిన కేంద్రం

– ‘ఢిల్లీ ఆర్డినెన్స్‌’ను సవాలు చేస్తాం : అరవింద్‌ కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ : అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ కేంద్రం తెచ్చిన కొత్త ఆర్డినెన్స్‌పై ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆర్డినెన్స్‌ను తమ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్డినెన్స్‌ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రత్యక్ష ధిక్కారమనీ, దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానించడమేనని అన్నారు. ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లతో సహా సేవల విషయాలలో తను ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాన్ని బీజేపీ నేతత్వంలోని కేంద్రం తగ్గించిన కొన్ని గంటల తర్వాత ఆయన స్పందిస్తూ.. ”ఇది ప్రజాస్వామ్యంపై కేంద్రం చేసిన వికారమైన జోక్‌” అని అన్నారు. ”కేంద్రం రివ్యూ పిటిషన్‌ ఎందుకు వేసింది? కేంద్రం సుప్రీంకోర్టును సవాల్‌ చేస్తున్నది? ఆర్డినెన్స్‌ ను సవాల్‌ చేస్తాం” అని కేజ్రీవాల్‌ తెలిపారు.ఐఏఎస్‌, డానిక్స్‌ క్యాడర్‌ అధికారుల బదిలీ, క్రమశిక్షణా చర్యల కోసం నేషనల్‌ క్యాపిటల్‌ సివిల్‌ సర్వీస్‌ అథారిటీని రూపొందించడానికి కేంద్రం శుక్రవారం ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. ఢిల్లీలో పోలీసు, పబ్లిక్‌ ఆర్డర్‌, భూమికి సంబంధించిన సేవలను మినహాయించి సర్వీసెస్‌ నియంత్రణను ఎన్నికైన ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అప్పగించిన వారం తర్వాత ఇది చోటు చేసుకోవటం గమనార్హం. సమాఖ్య నిర్మాణాన్ని కేంద్రం దెబ్బతీసినందున పార్లమెంటులో ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించడానికి ప్రతిపక్ష నేతలను సంప్రదిస్తామని కేజ్రీవాల్‌ చెప్పారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్‌ ఇంటింటికీ ప్రచారం ప్రారంభించి మెగా ర్యాలీ నిర్వహించనుంది.నేషనల్‌ క్యాపిటల్‌ సివిల్‌ సర్వీస్‌ అథారిటీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్‌ హౌం సెక్రెటరీ, అథారిటీకి సభ్య కార్యదర్శిగా ఉంటారు. అధికారం ద్వారా నిర్ణయించాల్సిన అన్ని విషయాలు హాజరైన, ఓటు వేసిన సభ్యుల మెజారిటీ ఓట్ల ద్వారా నిర్ణయించబడతాయి. అయితే, అభిప్రా య భేదాల విషయంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నిర్ణయమే అంతిమం.

Spread the love