ఆరోగ్య-వెల్‌నెస్‌ కేంద్రాల ప్రారంభం

కేరళలో ప్రజారోగ్య రంగానికి మరింత ఊతం
– ఇదే నిజమైన కేరళ స్టోరీ : ఎల్‌డీఎఫ్‌
కొచ్చి : అధికారాన్ని చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కేరళలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో 5,409 ఆరోగ్య-వెల్‌నెస్‌ కేంద్రాలను ప్రారంభించి ంది. ఆరోగ్య సేవలను కింది స్థాయి వరకూ విస్తరించడం ఈ కేంద్రాల లక్ష్యం. ‘ఈ కేంద్రాల్లో వివిధ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. గర్భిణులకు అవసరమైన మందులు, సలహాలు ఇస్తారు. శారీరక ధృడత్వం కోసం జిమ్‌లు కూడా ఉంటాయి’ అని కేరళ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. ఈ కేంద్రాలు వారానికి ఆరు రోజులు పని చేస్తాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుంటే కేరళలో మాత్రం పరిస్థితి భిన్నమని, ఇదే ‘నిజమైన కేరళ స్టోరీ’ అని ఎల్‌డీఎఫ్‌ వ్యాఖ్యానించింది. ప్రజారోగ్య రంగంలో కేరళ తరహా విజన్‌కు ఈ కేంద్రాలు తాజా ఉదాహరణ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి ఈ కేంద్రాలు మరింత ఊతమిస్తాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వంద రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా నివారించడం, సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి వార్షిక వైద్య పరీక్షలు నిర్వహించడం, వాటికి అనుగుణంగా అవసరమైన వారికి చికిత్స అందించడం ఈ కేంద్రాల ఉద్దేశం. ప్రజలు తమ జీవన సరళిని మార్చుకుని ఆరోగ్యవంతులుగా ఉండేలా స్థానిక సంస్థల భాగస్వామ్యంతో ప్రచార కార్యక్రమాలు కూడా చేపడతారు.

Spread the love