బుల్‌డోజర్‌కు హృదయం ఉండదు…

మన భయమే దాని బలం
– నేడు అది జాతీయ వ్యాధిగా మారింది
– మతోన్మాదులకు భవిష్యత్తు లేదు
– కె శ్రీనివాస్‌ ‘బుల్‌డోజర్‌ సందర్భాలు’ పుస్తకావిష్కరణలో సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అన్నింటిని అణచివేసే బుల్‌డోజర్‌కు హృదయం, బలం ఉండబోవని ప్రముఖ నటుడు, రచయిత ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుప్రీకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌ రచించిన బుల్‌ డోజర్‌ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనలో ఉన్న భయమే బుల్‌ డోజర్‌ బలమనీ, దానికంటూ బలముండబోదని చెప్పారు. ఆ భయమే ప్రస్తుతం ఒక జాతీయ వ్యాధిగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మనస్సాక్షి ఉన్న వారే మనుషులనీ, అలాంటి మనిషి శ్రీనివాస్‌ తన గొంతుకను పుస్తకరూపంలో వినిపించారని కొనియాడారు. సమాజంలో ఇలాంటి మరిన్ని గొంతుకలు రావాలని ఆకాంక్షించారు. తన స్నేహితురాలు రచయిత్రి గౌరీలంకేష్‌ మరణం సందర్భంగా తమకు భయం లేదంటూ నినదించామని గుర్తుచేశారు. ప్రశ్నించడం ప్రజల హక్కని తెలిపారు. ‘మూర్ఖుడి చేతిలో దేశాన్ని పెట్టాం. వాడికి హృదయం లేదు. పిచ్చి, పిచ్చి వేషాలు వేస్తున్నాడు. చరిత్రలో ఏ నియంతా మనుగడ సాగించినట్టు దాఖలాలులేవు. అలాంటి వారికి చరిత్రే లేదు. పరిణామక్రమానికి, ప్రకృతికి రైట్‌ వింగ్‌ (మతోన్మాదం) వ్యతిరేకమైనది. అలాంటి వాటికి భవిష్యత్తు కూడా ఉండదనేది స్పష్టం…’ అని ప్రకాష్‌ రాజ్‌ తెలిపారు.జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం భాష, భావజాలం, అభిప్రాయ వ్యక్తీకరణకు వాడే పదజాలం ఇలా అన్నింటిపై బుల్‌ డోజర్‌ ప్రయోగిస్తున్నారని తెలిపారు. శ్రీనివాస్‌ పుస్తకంలో పురాతన , మధ్య యుగాల చరిత్రతో పాటు ప్రస్తుతం జరుగుతున్న తంతు కనిపిస్తుందని తెలిపారు. ఒక పరిశోధకుడు, ఒక రచయిత, ఒక తాత్వికుడి కలయిక ఉన్న వ్యక్తి శ్రీనివాస్‌ అని కొనియాడారు. ప్రతి ఒక్కరు పుస్తకాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలని కోరారు.పుస్తక పరిచయకర్త, బీబీసీ తెలుగు సంపాదకులు జీ.ఎస్‌.రామ్మోహన్‌ మాట్లాడుతూ శ్రీనివాస్‌ తన పుస్తకం ద్వారా వర్తమాన సందర్భం, సంక్లిష్టతను చెప్పే ప్రయత్నం చేశారన్నారు. నిస్పృహ, నిస్సహాయత నుంచి వెలుగు కోసం ప్రయత్నించడంతో పాటు బయటికి వెళ్లే మార్గంపై చర్చను రేకెత్తించారని తెలిపారు. ఒంటరి జీవులు, ఒంటరి సమూహాలుగా మారి భయపడుతున్న వేళ శ్రీనివాస్‌ అభిప్రాయం చుట్టూ తిప్పుకునేలా ఉందన్నారు. అనుకూల పరిస్థితులను కాలదన్నుకోవద్దంటూనే, ఈ ఏడాది అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారని వివరించారు.
సామాజిక కార్యకర్త సజయ మాట్లాడుతూ అసహన జాఢ్యం పాలకవర్గాల నుంచి ప్రవహించి అందరిలోకి ప్రవేశించిందని తెలిపారు. అభిప్రాయ వ్యక్తీకరణ భరించలేని పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. భావప్రకటనపై దుర్మార్గమైన దాడిని తగ్గించుకోవాలని కోరారు. గౌరీలంకేష్‌ చనిపోయినా ఆ మార్గంలో చాలా మంది పయనిస్తున్నారని, ఇప్పుడు అందర్నీ అన్నిరకాలుగా భయపెడుతున్నారనీ, ఇలాంటివాటిని ఎదుర్కోకపోతే చాలా ప్రమాదమని హెచ్చరించారు. కార్యక్రమానికి మలుపు బాల్‌ రెడ్డి స్వాగతం పలికారు.

Spread the love