బీజేపీ కుట్రలను తిప్పికొట్టడమే కమ్యూనిస్టుల ఎజెండా

దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఎర్రజెండా పాత్ర కీలకం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-మునుగోడు
దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ తెలంగాణలో పాగా వేసేందుకు చేసే కుట్రలను తిప్పికొట్టడమే కమ్యూనిస్టుల ఎజెండా అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన సీపీఐ(ఎం) కార్యాలయం, మాజీ సర్పంచ్‌ బొందు పెద్దనర్సింహ అమరవీరుల స్మారక భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ముందుగా అమరవీరుల స్థూపాలకు నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామంలో ప్రధాన వీధుల నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడారు. ప్రస్తుతం దేశ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఎర్రజెండా కీలకపాత్ర పోషించే రోజులొచ్చాయన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసుకునేందుకు కోరి తెచ్చుకున్న మునుగోడు ఉపఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడంలో ఎర్రజెండా కీలకపాత్ర పోషించిందన్నారు. అదే తరహాలో దేశంలో మతోన్మాదం పేరుతో ముందుకొస్తున్న బీజేపీని తరిమికొట్టేందుకు కమ్యూనిస్టులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఐక్యం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం, ధరణి సమస్యలు, పోడు భూముల పట్టాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, పెండింగ్‌లో ఉన్న ఆసరా పెన్షన్ల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో వీఆర్‌ఏల సమస్యను పరిష్కరిం చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అదే తరహాలో జూనియర్‌ గ్రామపంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలతోపాటు ఇతర కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
నిరుపేద కుటుంబాల ఇంటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలివ్వాలని డిమాండ్‌ చేశారు. కల్వకుంట గ్రామం చిన్నదైనప్పటికీ ఇక్కడ సీపీఐ(ఎం)పై ఉన్న మమకారంతో ప్రతిఒక్కరి కృషితో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని చెప్పారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుంట్ల గ్రామస్తులు, యువత ఇతర గ్రామాల్లో తమ కళా ప్రదర్శనలు చేసి వచ్చిన డబ్బులతో పార్టీ కార్యాలయం కోసం 10 గుంటల స్థలాన్ని కొనుగోలు చేయడం గర్వకారణ మని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్‌, నాయకులు నాంపల్లి చంద్రమౌళి, మునుగోడు, మర్రిగూడ మండలాల కార్యదర్శులు మిర్యాల భరత్‌కుమార్‌, ఏర్పుల యాదయ్య, డీవైఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఐతగోని విజరుకుమార్‌, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బొట్ట శివకుమార్‌, వెల్మకన్నె ఎంపీటీసీ చాపల మారయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love