పాత కవుల్ని కదిలిస్తున్న నిర్గుణ్..

– ప్రసిద్ధ కవి శివారెడ్డి ‘బహిరంగ ప్రకటన’ పుస్తకావిష్కరణ
నవతెలంగాణ-అంబర్‌పేట
ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలు అద్భుతంగా కవితలు రాస్తున్నారని ప్రసిద్ధ కవి శివారెడ్డి అన్నారు. ప్రముఖ కవి ఇబ్రహీం నిర్గున్‌ రచించిన ‘బహిరంగ ప్రకటన’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ కవి సంగమం ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శివారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అద్భుతమైన కవితలు రాసే వారంతా తన పిల్లలేనన్నారు. స్త్రీ హృదయం లేకపోతే పురుషులు కూడా కవితలు రాయలేరని తెలిపారు. కవి నిర్గుణ్ కు మతం, కులంలో నిక్షిప్తమైన దుఃఖం ఉందని ఆయన స్రుసించని వస్తువు లేదని, అంతర్లీనంగా సాధన చేసే శక్తి అతనిలో ఉందని తెలిపారు. దానితోనే పాత కవుల్ని కదిలిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి ఆనందచారి మాట్లాడుతూ.. రచయితలో భాషా విస్ఫోటనం ఉందని, సామాజిక బాధ్యత గుర్తెరిగిన మనిషిని తెలిపారు. వీక్షణం సంపాదకులు ఎన్‌ వేణుగోపాల్‌ పుస్తకాన్ని పరిచయం చేస్తూ కవిత్వం వైవిధ్యమైనదని దీనిలో పురాస్ముతులు దాగి ఉన్నాయని, అతనిలో సామాజిక బాధ, అంతర్జాతీయ దుఃఖం ఉందన్నారు. వీటితో పాటుగా ముస్లింల ఆధునిక వాస్తవ అస్థిత్వం వేధన ప్రతిబింబిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి యాకూబ్‌, దేవేంద్ర, నరేష్‌ కుమార్‌సూఫీ, శిలాలోలిత, రూపా రుక్మిణి, సలీమా, నశ్రీన్ ఖాన్‌, తగుళ్ల గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love