– కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ భరోసా
– ప్రతిపక్షాల భేటీకి హాజరవుతాం : ఆప్
– నేడు, రేపు బెంగళూరులో ప్రతిపక్షాల భేటీ
న్యూఢిల్లీ : బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల రెండు రోజుల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ అధికారాలను హరించివేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతి రేకిస్తున్నట్లు కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఈ ప్రకటన చేసిన కొద్ది గంటలకే ఆమాద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమ, మంగళవారాల్లో బెంగళూరులో జరిగే ప్రతిపక్షాల భేటీకి తాము హాజరవుతున్నామని చెప్పారు. కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వకపోతే తాము బెంగళూరు సమావేశానికి హాజరుకాబోమని కేజ్రీవాల్ అంతకుముందు హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్ అంతర్గత కమిటీ సమావేశమై కేంద్ర ఆర్డినెన్స్‌పై కేజ్రీవాల్‌కు బాసటగా నిలవాలని నిర్ణయించింది. గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేసి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తమ పార్టీ వ్యతిరేకమని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి కెసి వేణుగోపాల్ చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. పార్లమెంటులో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టినా వ్యతిరేకించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు.
‘సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలన్నిటినీ నికరంగా వ్యతిరేకిస్తూనేవున్నాం. గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను పాలించాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూనేవున్నాం. మా వైఖరి చాలా స్పష్టం. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోం’ అని కెసి వేణుగోపాల్ చెప్పారు. ఆ వెంటనే ఆప్ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ,కాంగ్రెస్ ప్రతిపక్షాల ఐక్య గళాన్ని వినిపించడం ఓ సానుకూల పరిణామం’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బ్యూరోక్రాట్ల నియామకాలు, బదిలీల విషయంలో అంతిమ నిర్ణయం ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానిదేనని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు భిన్నంగా బ్యూరోక్రాట్లపై అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నరుకు కట్టబెడుతూ కేంద్రం ఒక దుర్మార్గమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పార్లమెంటులో దీనిపై బిల్లు పెడితే వ్యతిరేకించాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదివరకే ప్రతిపక్షాల నేతలను కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా తన వైఖరేమిటో చెప్పాలని ఆప్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తాను ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకమని స్పష్టం చేసింది.
బెంగళూరు సమాశానికి సర్వం సిద్ధం
కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ బిజెపిని ఓడించడమే లక్ష్యంగా దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఒక్కటొక్కటిగా జట్టు కడుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో గత జూన్ 23న తొలిసారి సమావేశమైన ప్రతిపక్షాల పార్టీల నేతలు మలి విడతలో భాగంగా బెంగళూరులో రెండు రోజుల పాటు (సోమవారం, మంగళవారం) సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మొత్తం 24 పార్టీలకు చెందిన అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యే అవకాశముంది. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ దీనికి వేదికగా నిలవనుంది. ఆదివారం రాత్రి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి రణదీప్ సూర్జేవాలా, రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వరన్ అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. పాట్నాలో జరిగిన తొలి సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించి తీరాలని ప్రతిపక్షాల నేతలు తీర్మానించిన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు ఎత్తుగడలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, మాజీ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. ప్రతిపక్షాల పార్టీల నాయకుల కోసం సోమవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ,శివసేన (యుబిటి) నాయకులు ఉద్ధవ్ థాకరే, సంజరు రౌత్, ఆదిత్య థాకరే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సిపిఎం నేత సీతారాం ఏచూరి, సిపిఐ నేత డి రాజా, అలాగే డిఎంకె, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సిపితో పాటు మరుమలార్చి ద్రవిడ మున్నెట్ర కఝగం (ఎండిఎంకె), కొంగు దశ మక్కల్ కచ్చి (కెడిఎంకె), విదుథులై చిరుథైగల్ కచ్చి (విసికె), రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పి), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్), కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) తదితర పక్షాల నేతలు హాజరుఎకానున్నారు.
కాంగ్రెస్ సలహా బృందం
ప్రస్తుతం దేశానికి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అవసరం లేదని కాంగ్రెస్ సలహా కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. వ్యక్తిగత చట్టాల సంస్కరణలకు అవకాశం ఉన్నప్పుడు యుసిసి అవసరం లేదని తెలిపింది. యూసీసీ పై సలహా ఇవ్వడం కోసం ఎనిమిది సభ్యులతో సలహా బృందాన్ని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఈ బృందం అంతర్గత సమావేశమయింది. ఈ సమావేశంలో అత్యధిక మంది యూసీసీ అవసరంలేదని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే కేంద్రం డ్రాఫ్ట్ ముసాయిదా విడుదల చేసే వరకూ కాంగ్రెస్ పార్టీ యూసీసీ పై వైఖరి వెల్లడించకూడదనే అభిప్రాయాన్ని బృందం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఈ బృందంలో పి.చిదంబరం, అభిషేక్ సంఘ్వి, సల్మాన్ ఖుర్షీద్, మనీష్ తివారీ, వివెక్ తంక, కెటిఎస్ తుస్లి తదితరులు ఉన్నారు.