ఉద్యోగాల కల్పనే లక్ష్యం

– డిగ్రీ పాఠ్యప్రణాళికలో మార్పులు
– వచ్చే ఏడాది ఓయూ, కేయూలో అమలు
– ఉన్నత విద్యామండలి సదస్సులో చైర్మెన్‌ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలను కల్పించడమే తమ లక్ష్యమని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి చెప్పారు. అందుకనుగుణంగా డిగ్రీ పాఠ్యప్రణాళికలో మార్పులు చేస్తున్నామని అన్నారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలో వాణిజ్య, ఆర్థిక, చరిత్ర, రాజనీతి శాస్త్రం విభాగాల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నూతన పాఠ్యప్రణాళిక అమల్లోకి వస్తుందన్నారు. ‘అత్యుత్తమ పాఠ్యప్రణాళిక అభివృద్ధి’ కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండురోజుల సదస్సు బుధవారం హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌)లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అవసరాలకనుగుణంగా తెలంగాణ ఉన్నత విద్య బోధన ప్రణాళికను రూపొందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈ ప్రక్రియలో విదేశీ విశ్వవిద్యాలయాలు తోడ్పాటు అందించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. సరికొత్త విధానాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ చదువు తర్వాత విద్యార్థులు తేలికగా ఉపాధి పొందేలా విద్యావిధానం ఉండాలని చెప్పారు. సాధించే డిగ్రీలు వాస్తవ విజ్ఞానానికి కొలమానం కావడం లేదన్నారు. ప్రస్తుత పరీక్షా విధానం విద్యార్థుల్లో దాగున్న అసలైన ప్రతిభను వెలికి తేయడం లేదని చెప్పారు. బట్టీ విధానంతో పరీక్షలు రాయడం వల్ల ఉపయోగం ఉండబోదని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో విశ్లేషణాత్మకంగా సృజనాత్మకంగా ఆలోచించే విధానం కొరవడిందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల విద్యార్థులకు పూర్తిస్థాయిలో విజ్ఞానం అందడం లేదనీ, ఫలితంగా మారుతున్న కాలంతో పోటీ పడలేని స్థితి ఏర్పడిందన్నారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ యూకే, యూఎస్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా రాష్ట్ర ఉన్నత విద్యలో మార్పులు రావడం మంచి పరిణామమని చెప్పారు. నైపుణ్యంతో కూడిన విద్యను అండర్‌ గ్రాడ్యుయేట్‌ (డిగ్రీ) స్థాయి నుంచి అందించాల్సిన అవసరముందని సూచించారు. ప్రాజెక్టులు, సామాజిక విశ్లేషణాత్మక విద్యకు శ్రీకారం చుట్టాలని కోరారు. ఆలోచనాత్మక విద్యాబోధన దిశగా సాగుతున్న ప్రయత్నానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. పాఠ్యప్రణాళికల్లో మార్పులు చేయాల్సిన అవసరముందని బ్రిటీష్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ జనక పుష్పనాథన్‌ చెప్పారు. ఓయూ వీసీ ప్రొఫెసర్‌ డి రవీందర్‌ మాట్లాడుతూ నూతన పాఠ్యప్రణాళికను తమ వర్సిటీ పరిధిలో సత్వరమే అమల్లోకి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అబెరిస్ట్‌ విత్‌ విశ్వవిద్యాలయం ప్రో వైస్‌ చాన్సలర్‌ తిమోతీ వుడ్స్‌, కెరీర్‌ ఉపాధి కల్పన విభాగాధిపతి బెవర్లీ హెర్రింగ్‌, బంగోర్‌ వర్శిటీ ప్రో వైస్‌ చాన్సలర్‌ నికోలా కాలో, టీచింగ్‌, లెర్నింగ్‌ డైరెక్టర్‌ అమో ఇయో, సెస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రేవతి, ప్రొఫెసర్‌ వి ఉషాకిరణ్‌, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love