కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే… పాత పెన్షన్‌ పథకం

–  ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే, రాజస్తాన్‌ తరహాలో సీపీఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్‌ ఎంపీ ఎన్‌ ఉత్త్తమ్‌ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. జీవో 317 వల్ల కోల్పోయిన స్థానికతను తీసుకొస్తామన్నారు. టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన హర్షవర్ధన్‌ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్‌ లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు మహేష్‌ కుమార్‌గౌడ్‌, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రోహిన్‌రెడ్డి, బొల్లు కిషన్‌, నగేష్‌ ముదిరాజ్‌, ప్రదీప్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేజీబీవీ టీచర్లకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలనీ, ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడిం దన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రతి నెల మొదటి రోజే జీతాలు అందేలా చూస్తామని తెలి పారు. బీఆర్‌ఎస్‌ సర్కారుపై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని చెప్పారు. కేసీఆర్‌ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పారు. కాంగ్రెస్‌ చేపట్టిన హాత్‌ సే హాత్‌ జోడో పాద యాత్రకు ప్రజల్లో మంచి స్పందన వస్తున్నదన్నారు. మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఈనెల 9న కరీం నగర్‌లో కాంగ్రెస్‌ భారీ బహిరంగసభ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఛత్తీస్‌గడ్‌ సీఎం భూపేష్‌ భగేల్‌ హాజరు కానున్నట్టు తెలిపారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బెదిరింపులు సరైందికాదు
టీపీసీసీ ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్‌ను ఎంపీ కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి బెదిరించడం సరైందికాదని మహేష్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి మంచివి కావని తెలిపారు. ఈ విషయాన్ని ఏఐసీసీకి దృష్టికి తీసుకెళతామని చెప్పారు.
సాత్విక్‌ ఆత్మహత్యపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరపాలి
నగేష్‌ ముదిరాజ్‌
శ్రీచైతన్య కళాశాల విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని శిక్షించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్‌ ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఇప్పటికే విచారణ కమిటీ నివేదికలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయని గుర్తు చేశారు. విద్యార్దులను మానసిక ఒత్తిడికి గురి చేయడమేకాక, భౌతిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ విష యంలో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి ఉన్నతస్థాయి సమావే శాలంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.కమిటీ నివేదికపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Spread the love