సీపీఐ(ఎం) నాయకులపై అక్రమ కేసులు కొట్టివేత

–  పేదల ఇండ్ల స్థలాల కోసం 2007లో భూపోరాటం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని భూ పోరాటం చేసిన సీపీఐ(ఎం) నాయకులపైనా, కార్యకర్తలపైనా 2007లో పోలీసులు పెట్టిన అక్రమ కేసులను శుక్రవారం నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సీపీఐ(ఎం) మాజీ నగర కార్యదర్శి పీఎస్‌ఎన్‌ మూర్తి, మాజీ నగర కార్యదర్శివర్గ సభ్యులు జెకె.శ్రీనివాస్‌, ప్రస్తుత నగర కమిటీ సభ్యులు గోపాస్‌ కిరణ్‌, సి.మల్లేష్‌, నాయకులు రామ్‌కుమార్‌, అలీ అబ్బాస్‌, మాజీ నాయకులు మారుతీరావు, మల్లారెడ్డి ఉన్నారు. అడ్వకేట్‌ సావుకారి శ్రీనివాస్‌ ఈ కేసులో వాదించారు.
ఈ సందర్భంగా పీఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ.. నగరంలో పేదలు ఇంటి కిరాయిలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటే.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భూ పోరాటం చేసినట్టు తెలిపారు. పేదలకు 50 గజాల జాగా కోసం పోరాటం చేసి గుడిసెలు వేసినందుకు అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి కోర్టుల చుట్టూ తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు డబుల్‌ బెడ్‌రూమ్స్‌ కోసం ఇప్పటివరకు 10 లక్షల దరఖాస్తులకుపైగా పేదలు పెట్టుకున్నారని, వారందరికీ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గుడిసెలు వేసుకొని ఉన్నవారికి అక్కడే పట్టాలు ఇవ్వాలన్నారు.

 

Spread the love