కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌
– ప్రభుత్వ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ- ముషీరాబాద్‌

కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజేషన్‌ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యపార్కు వద్ద బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో జూలకంటి మాట్లాడుతూ.. అనేక రాష్ట్ర పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్తున్నది కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులేనన్నారు. కానీ వారి జీతభత్యాలు అంతంత మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగుల కోసం విడుదల చేస్తున్న జీవోలు సైతం కిందిస్థాయిలో అనేక డిపార్ట్‌మెంట్లలో అమలు కావడం లేదని తెలిపారు.
కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 15 నుంచి 20 సంవత్సరాలుగా పర్మినెంట్‌ కాకుండా, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నారని.. రెగ్యులరైజేషన్‌ కావాలని అడగడంలో తప్పులేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయం అన్నారు. ఈ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేష్‌ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లామని చెప్పారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనైనా ఉద్యోగులను రెగ్యులరైజేషన్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరూ ఆందోళనలోకి దిగుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జైకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు సైదులు, నగర అధ్యక్షులు కుమారస్వామి, గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీల యూనియన్‌ నాయకులు దేవా, పాలిటెక్నిక్‌ కాలేజీల యూనియన్‌ నాయకులు సుధాకర్‌, రంగారెడ్డి జిల్లా నాయకులు దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love