– వీబీ-జీ ఆర్‌ఏఎమ్ జీ రాకముందే ఎస్సీ, ఎస్టీ కూలీలకు తీవ్ర నష్టం
– అదొస్తే ఇక కూలీలు అధోగతిపాలే
– 2025-26లో తెలంగాణలో కల్పించినది 7.26 కోట్ల పనిదినాలే
– దేశ సగటుతో పోలిస్తే 20.6 శాతం తగ్గుదల
– వంద రోజుల పని దక్కింది 23 వేల కుటుంబాలకే
– ఎస్సీ, ఎస్టీ కూలీలకు 38 శాతం మేర నష్టం : వివరాలు వెల్లడించిన లిబ్‌టెక్ నివేదిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ సర్కారు హయాంలో తెలంగాణలో ఉపాధి హామీ పనిదినాల సంఖ్య వేగంగా పడిపోతున్నది. ఇప్పుడే ఇలా ఉంటే వీబీ-జీ ఆర్‌ఏఎమ్‌జీ అమలులోకి వస్తే కూలోళ్లకు మరిన్ని కష్టాలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉపాధి హామీ చట్టాన్ని సమగ్రంగా అమలు చేసిన రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ట్రాలే ముందువరుసలో ఉంటూ వచ్చాయి. మోడీ సర్కారు వివక్ష కారణంగా కరోనా దగ్గర నుంచి పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. వాస్తవా నికి తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి హక్కు చట్టం కింద 21 కోట్ల పనిదినాలు అవసరం. కేంద్ర ప్రభుత్వం 2025-26 సీజన్‌లో 12.22 కోట్ల పనిదినాలను కేటాయించింది. అందులో ఇప్పటివరకూ జరిగింది 7.26 కోట్ల పనిదినాలే. అంటే దాదాపు 40.6 శాతం మేర ‘ఉపాధి’కి కోతపడింది. ఇది జాతీయ సగటు 20.6 శాతం కంటే రెట్టింపు. రాష్ట్రంలో సగటు పనిదినాల కల్పన 45.80 రోజుల నుంచి 32.93 రోజులకు పడిపోయింది. జాతీయ సగటు 43.18 రోజులు.రాష్ట్రంలో వందరోజుల పని పూర్తిచేసుకున్న కుటుం బాల సంఖ్య 93 వేల నుంచి 23 వేలకు పడిపోయింది. అంటే 75.3 శాతం మేరకు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలు కొంత మేర ఆర్థికంగా నిలదొక్కుకోవడం లోనూ, వారికి కొనుగోలు శక్తి, కూలి బేరసారాల చైతన్యం పెరగడానికి దోహదపడింది ముమ్మాటికీ ఉపాధి హామీ చట్టమే. అలాంటి చట్టం ద్వారా ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ కూలీలకు 38 శాతం మేరకు నష్టం వాటిల్లింది. ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య 17.4 శాతం, ఉపాధి పొందిన కార్మికుల సంఖ్య 20.3 శాతం తగ్గింది.
పెరుగుతున్న పనిదినాల క్షీణత
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పనిదినాల క్షీణత కనిపించింది. 32 జిల్లాల్లో నరేగా చట్టం అమలవుతున్నది. 28 జిల్లాల్లో 30 నుంచి 57 శాతం మేర పనిదినాలు తగ్గాయి. మేడ్చల్ జిల్లాలో అతి తక్కువ పనిదినాల కల్పన జరిగింది. ఆ జిల్లాలో 94.1 శాతం మేర క్షీణత కనిపించింది. ప్రతి సంవత్సరం, మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏకు చాలా కీలకం. ఆ కాలంలోనే గణనీయమైన ఉపాధి కల్పన జరుగుతుంది. అయితే, 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పనిదినాలలో (పర్సన్‌డేస్) 48.8 శాతం క్షీణత నమోదైంది. ఇది ఆ సంవత్సరంలో ఉపాధి రంగంలో గణనీయమైన నష్టాన్ని చేకూర్చింది. రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్) ఉపాధి కల్పనలో కాలానుగుణ తగ్గుదల కనిపించినప్పటికీ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో గత సంవత్సరం కంటే 27.9 శాతం పనిదినాలు తగ్గాయి. మూడో త్రైమాసికంలో 20.4 శాతం తగ్గింది. నాల్గో త్రైమాసికంలో 2.1 శాతం పెరిగింది.
వ్యవసాయ కూలీల తొలగింపు
కేంద్ర ప్రభుత్వం 2025-26 ఒక్క సీజన్‌లో తెలంగాణకు చెందిన 1.26లక్షల కార్డులను తొలగించింది. కొత్తగా 43వేల కార్డులను చేర్చింది. మొత్తంగా తెలంగాణ లో 83వేల జాబ్‌కార్డులను కుదించినట్టు అయింది. దీని ద్వారా 4.02 లక్షల మంది కూలీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. 2024-25 సీజన్‌లో తెలంగాణలో ఉపాధి కూలీలు రూ.2,607 కోట్లను పొందగా అది 2025-26కు వచ్చేసరికి రూ.1932.75 కోట్లకు పడి పోయింది. అంటే తెలంగాణలోని ఉపాధి కూలీలు ఈ ఒక్క ఏడాదిలోనే రూ. 674. 26 కోట్లను నష్టపోయారు. 2024-25లో ఉపాధి ద్వారా కూలీల సగటు కుటుంబ ఆదాయం రూ.9,770 ఉండగా..ఈ ఏడాది అది 8,766కి పడిపోయింది. ప్రతి కుటుంబానికి సగటు పనిదినాల సంఖ్య 45.80రోజుల నుంచి 32.93 రోజులకు పడి పోయింది, ఇది సుమారు 28 శాతం తగ్గుదల. ఒకవేళ ప్రతి కుటుంబానికి సగటు పనిదినాలు గతేడాది మాదిరిగానే (సుమారు 45.80 రోజులు) ఉండి ఉంటే, సంపాదించిన అధిక సగటు వేతనం కారణంగా సగటు కుటుంబ ఆదాయం రూ.12,192గా ఉండేది. దీనిని బట్టి, ఉపాధిలో తగ్గుదల సగటున ప్రతి కుటుంబానికి రూ.3,426 నష్టానికి దారితీసిందని అర్థమవుతున్నది.
దళిత, గిరిజన, బలహీనవర్గాలపై దాడి మే 15న దేశవ్యాప్త గ్రామీణ సమ్మె : దళిత, గిరిజన, బలహీన వర్గాలపై ఆర్థిక దాడి చేయడంలోనే భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తున్నది. అందులో భాగంగా వీబీ-జీ ఆర్‌ఏఎమ్‌జీ తీసుకొచ్చింది. తెలంగాణకు 21 కోట్ల పనిదినాలు అవసరం. కానీ, కల్పించి 7.26 కోట్లే. ఇది దారుణం. మేం పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుదించడం దారుణం. దళిత, గిరిజన, బహుజనవర్గాల ప్రజలకు మోడీ సర్కారు చేస్తున్న ద్రోహాన్ని మే 15న దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ సమ్మె ద్వారా ఎండగడుతాం. పని అయినా చూపండి… బువ్వ అయినా పెట్టండి అని పాలకులపై ఏండ్ల తరబడి పోరాటాలు చేయడం, కేంద్రంపై ఎర్రజెండా పార్టీలు ఒత్తిడి తీసుకురావడంతో ద్వారా యూపీఎ-1 ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొ చ్చింది. పేదలకు ఉపయోగపడే చట్టాన్ని మోడీ సర్కారు రద్దు చేయడం రాజ్యాంగ వ్యతిరేకం.
– ఆర్.వెంకట్రాములు,
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి




