Tuesday, June 16, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తొలి రోజు 
హాజరు అంతంతే

తొలి రోజు 
హాజరు అంతంతే

- Advertisement -

పాఠశాలల ప్రారంభం రోజు ప్రభుత్వ బడుల్లో పరిస్థితి
కొన్ని చోట్ల ముగ్గురు, 
నలుగురు విద్యార్థులు
అమావాస్య అనే మూఢ నమ్మకమే కారణం!
నవతెలంగాణ- విలేకరులు
రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి రోజు విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే నమోదైంది. పలుచోట్ల ఉపాధ్యాయులు ఫోన్‌ చేసినా విద్యార్థులు పాఠశాలలకు రాలేదు. అందుకు సోమవారం అమావాస్య కావడం కూడా బలమైన కారణంగా తల్లిదండ్రులు చెబుతున్నారు. దాంతో కొన్ని పాఠశాలల్లో ముగ్గురు, నలుగురు మాత్రమే కనిపించారు.

రాజన్న సిరిసిల్ల వీర్నపల్లి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 1,206 మంది విద్యార్థులకు167 మంది మాత్రమే తొలిరోజు బడికి వచ్చారు. మండల కేంద్రంలోని పాఠశాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ ఉన్న 152 మంది విద్యార్థులకు నలుగురు మాత్రమే క్లాసు రూముల్లో కనిపించారు.
ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు హాజరైనప్పటికీ విద్యార్థులు మాత్రం ఏ పాఠశాలలో చూసినా నలుగురు, ఐదుగురు, 10, 14 మందికి మించి రాలేదు. సోమవారం అమావాస్య కావడంతో కొందరు తల్లిదండ్రులు మూఢనమ్మకాలతో పిల్లలను పాఠశాలలకు పంపించడానికి వెనుకాడినట్టు తెలుస్తోంది. మెదక్‌ జిల్లాలో టేక్మాల్‌, చేగుంట మండలాల పరిధిలోని పాఠశాలల్లో ఒక్కరిద్దరూ తప్ప ఎక్కువగా విద్యార్థులు రాలేదు. సిద్దిపేట జిల్లాలో బెజ్జంకి, నంగునూరు, గజ్వేల్‌ మండలాల్లోనూ ఇదే పరిస్థితి. నంగునూర్‌ మండల పరిధిలో మొదటి రోజు 15 శాతం హాజరయ్యారని సీఆర్పీలు తెలిపారు. గజ్వేల్‌ మండలం కొడకండ్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 84 మంది ఉండగా తొలి రోజు 9 మంది మాత్రమే హాజరయ్యారు. పోన్‌ చేసి రావాలని కోరినా రాలేరని ఉపాధ్యాయులు తెలిపారు.

పూల వర్షంతో విద్యార్థులకు స్వాగతం..
నారాయణపేట జిల్లా క్రిష్ణ మండల పరిధిలోని ముడుమాల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిజముద్దీన్‌, ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పాలు చల్లుతూ.. చేతికి గులాబీ పువ్వు ఇచ్చి ఆహ్వానించారు. దామరగిద్ద మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, కాన్పూర్‌ విద్యార్థులకు మామిడి తోరణాలతో స్వాగతం పలికారు. ఊట్కురు పాఠశాలలో పాఠాలు నేర్పే ఉపాధ్యాయుడు తన కుమారుడిని అదే బడిలో చేర్పించారు.

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పరిధిలోని సంపత్రాపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సర్పంచ్‌ ఒరే వెంకటయ్య, ఉప సర్పంచ్‌ నాగమణి, ఉపాధ్యాయులు పుస్తకాలు పంపిణీ చేశారు. చందాపూర్‌ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ భవన నిర్మాణానికి సంబంధించి బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్లు గేటు తాళం వేసి నిరసన తెలిపారు. నిర్మల్‌ జిల్లాలో తొలిరోజు సుమారు 56 శాతంలోపే విద్యార్థులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -