Tuesday, June 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్టీపీకి దళితుల భూములు ఎంపిక

ఎస్టీపీకి దళితుల భూములు ఎంపిక

- Advertisement -

అమీన్‌పూర్‌లో వ్యతిరేకిస్తే..లక్డారానికి మార్పు 60 ఏండ్లుగా సాగులో ఉన్న దళిత కుటుంబాలు
ఓ వైపు కంకర క్రషర్లు.. మరో వైపు ఎస్టీపీ
వారం రోజులుగా ఆందోళన చేస్తున్న భూ బాధితులు
మద్దతు ప్రకటించిన సీపీఐ(ఎం), ప్రజాసంఘాలు

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఎస్టీపీ ప్లాంట్‌ ఏర్పాటును అమీన్‌పూర్‌ రైతులు వ్యతిరేకించి అడ్డుకుంటే అధికారులు లక్డారానికి మార్చారు. ప్లాంట్‌ పేరుతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామంలో దళితుల భూములను తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామంలో ఇప్పటికే కంకర క్రషర్ల దుమ్మూదూళితో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటుంటే.. మళ్లీ ఎస్‌టీపీ (సీవరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌) ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అధికారులు భూసేకరణ చేస్తున్నారు. కంకర క్రషర్ల నుంచి వచ్చే దుమ్మూదూళి వల్ల జనం ఓ వైపు శ్వాసకోశ సమస్యలు రావడంతోపాటు టీబీ, క్యాన్సర్‌ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పుడు మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు వల్ల గ్రామంతోపాటు పరిసర ప్రాంతాలు పూర్తిగా కలుషితమయ్యే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం అమృత్‌ 2.0 కింద వచ్చే నిధులతో రెండు మురుగునీటి శుద్ధి కేంద్రాల ను నెలకొల్పడానికి లక్డారంలో భూ సేకరణకు సిద్దమైంది. దీని కోసం పేద దళితుల భూముల ను సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం గ్రామ సభ పెట్టి ఎస్‌టీపీ ప్లాంటు నిర్మాణం అభిప్రాయ సేకరణ చేయకుండానే భూములను తీసుకుంటామని ప్రకటించడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. భూములు కోల్పోతున్న దళిత కుటుంబాలకు సీపీఐ(ఎం) నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు.

అమీన్‌పూర్‌లో వ్యతిరేకిస్తే లక్డారం ఎంపిక
మురుగునీటి శుద్ధి కోసం అధికారులు బయోడైవర్సిటీ హెరిటేజ్‌ లేక్‌ కోసం ముందుగా అమీన్‌పూర్‌ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇది పూర్తి జీవవైవిధ్యమైన ప్రాంతం. ఆహ్లాదకరంగా ఉన్న ప్రకృతిని నాశనం చేసేలా ప్లాంట్‌ నిర్మాణానికి సిద్ధమయ్యారు. పర్యావరణ నియమాలను తుంగలో తొక్కి, కొండలను పిండి చేస్తూ, చెట్లను నరికేస్తూ చేపడుతున్న ఈ నిర్మాణం వల్ల భవిష్యత్‌లో ఈ ప్రాంతం ఉనికి ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితులు ఉన్నాయని అమీన్‌పూర్‌ ప్రాంతవాసులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అమీన్‌పూర్‌ ప్రాంతంలో ఎస్‌టీపీ నిర్మాణం వాయిదా వేసి లక్డారం గ్రామాన్ని ఎంపిక చేశారు. లక్డారం సర్వే నంబర్‌ 498లోని సుమారు 21 ఎకరాల 31 గుంటల భూమిపై ప్రాజెక్ట్‌ చేపట్టేందుకు అధికారులు ఎంపిక చేశారు. లక్డారం గ్రామంలో పర్యావరణానికి తూట్లు పొడవడమే కాకుండా పచ్చని పంట పొలాలను సైతం ధ్వంసం చేయనున్నారు. 60 సంవత్సరాలుగా దళితులు భూముల్లో పంటలు పండించుకుని జీవనం సాగిస్తుంటే వారికి ఎలాంటి సమాచారమూ లేకుండా, కనీసం గ్రామ సభ నిర్వహించకుండా అధికారులు ఇష్టారీతిన భూములను గుంచుకుని ఎస్‌టీపీ ప్లాంటు నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఎస్టీపీ ప్రాజెక్టును వెంటనే విరమించుకోవాలని, లేకపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.

భూములు తీసుకోవద్దు
ఎస్టీపీ ప్లాంటు ఏర్పాటుకు దళిత రైతుల భూములు తీసుకుంటే ఊరుకునేది లేదు. 1973లో లక్డారం గ్రామ రైతులకు ఎకరా, 20 గుంటల చొప్పున దాదాపు 22 ఎకరాల భూములను ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం అనడం సరైంది కాదు. ఒకవేళ రైతుల భూములను ప్రభుత్వం తీసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రైతులకు నోటీసులు ఇచ్చి, నష్టపరిహారం చెల్లించాలి. ఏ ఒక్క రైతుకు నోటీసు ఇవ్వకుండా, వారి భూమిని స్వాధీనం చేసుకునే చర్యలు ఏవిధంగా చేపడతారు. వెంటనే భూములు తీసుకోవడం ఆపాలి. లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తాం. – సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వర్‌రావు

దళిత రైతులకు న్యాయం చేయాలి
ఎస్‌టీపీ ప్లాంటు (మురుగునీటి శుద్ది ప్లాంటు) పేరుతో 
దళిత భూములను తీసుకోవద్దు. ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా భూములు ఎలా తీసుకుంటారు. లక్డారం గ్రామ పరిధిలోని అసైన్డ్‌ భూములను సాగు చేస్తున్న దళిత రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలి. భూములు కోల్పోతున్న రైతులకు చట్టబద్ధమైన న్యాయం, తగిన పరిహారం లేదా ప్రత్యామ్నాయం గా భూమి కల్పించడం ప్రభుత్వ బాధ్య త. రైతుల సమస్యలను అధికారులు పునఃసమీక్షించి, వారితో చర్చించి న్యాయబద్ధమైన పరిష్కారం చూపాలి.
కేవీపీఎస్‌ సంగారెడ్డి
జిల్లా కార్యదర్శి పి.అశోక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -