పెట్టుబడులు ఆకర్షించడంలో విజయం సాధించాం-సీఎం కేసీఆర్‌

–   ఆయన సమక్షంలో జపాన్‌ సంస్థతో ఒప్పందం
–  లక్షమందికి ఉపాధి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వం విజయం సాధించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో ఆయన సమక్షంలో జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి సంస్థ ‘హౌన్‌ హై ఫాక్స్‌ కాన్‌’తో భారీ ఆర్ధిక పెట్టుబడి ఒప్పందం జరిగింది. ఆ సంస్థ చైర్మెన్‌ యంగ్‌ ల్యూ నేతత్వంలోని ప్రతినిధి బందం సీఎం కేసీఆర్‌ను కలిసి దశలవారీగా విస్తరించే తమ ప్రాజెక్ట్‌ ప్రాధాన్యతలను వివరించారు. దీనివల్ల రాష్ట్రంలో దాదాపు లక్షమందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయమని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆ సంస్థ చైర్మెన్‌ యంగ్‌ ల్యూ పుట్టిన రోజు కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్‌ కార్డును సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆయనకు అందచేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడే యంగ్‌ ల్యూ ప్రతినిధి బందంతో కలిసి లంచ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కే తారకరామారావు, వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌రావు, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు రామకష్ణారావు, అరవింద్‌కుమార్‌, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి, డైరెక్టర్‌ ఎలక్ట్రానిక్స్‌ సుజరు కారంపురి తదితరులు పాల్గొన్నారు.

Spread the love