పేదలకు ఉచిత విద్యుత్‌ అందిస్తాం

–   కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఏం మాట్లాడతారో వారికే తెలియదు.. : విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఉచిత విద్యుత్‌ను ఆపే ప్రసక్తే లేదని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. రాయితీ విద్యుత్‌ చార్జీలను డిస్కంలకు ముందస్తుగా చెల్లించాలనే నూతన కేంద్ర విద్యుత్‌ విధానంపై స్పందించిన మంత్రి మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పేద ప్రజలకు అందించే రాయితీ విద్యుత్‌పై కేంద్రం కుట్రలు పన్నడం దుర్మార్గం అన్నారు. సీఎం కేసీఆర్‌ రైతులకు ఉచిత విద్యుత్‌ అందించడం కేంద్రానికి కంటగింపుగా మారిందన్నారు. సామాజిక, ఆర్థిక సమతుల్యం లేని దేశంలో సబ్సిడీలు అవసరం ఉందన్నారు. విద్యుత్‌రంగాన్ని ప్రయివేట్‌పరం చేయడం కోసమే కేంద్రం ఎత్తులు వేస్తుందని ఆరోపించారు. అన్నం పెట్టే రైతుకు ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచడం కోసమే సబ్సిడీలు అందిస్తున్నామని చెప్పారు. రైతుకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని ఉచితమని కేంద్రం భావించడం అవివేకం అన్నారు. ఒకరిద్దరు సంపన్నుల కోసం కోట్లాది మంది ప్రజలను దారిద్య్రంలోకి నెట్టే కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేస్తామని చెప్పారు. కేంద్రం ఫ్యూడల్‌ ఆలోచనలతో పేదలకు నష్టం వాటిల్లుతుందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం చేసే దుర్మార్గమైన ఆలోచనకు తాము పూర్తి వ్యతిరేకమన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎప్పుడు ఏ పార్టీ గురించి మాట్లాడుతారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఉండి బీజేపీ గెలుస్తుందని, బీజేపీలో ఉండి కాంగ్రెస్‌ గెలుస్తుందనడం హాస్యాస్పదమన్నారు. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Spread the love