పోరాడి సాధించుకోవాలి

–  అంగన్‌వాడీలను పర్మినెంట్‌ చేయాలి  ఇందిరాపార్కు వద్ద అంగన్‌వాడీల మహాధర్నా
– ఈఎస్‌ఐ, పీఎఫ్‌, రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ కల్పించాలి : సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి డిమాండ్‌
– మార్చి 1,2,3 తేదీల్లో ర్యాలీలు, వంటావార్పు, కలెక్టరేట్ల దిగ్బంధనం : జయలకి
నవతెలంగాణ- సిటీబ్యూరో
రాష్ట్రంలో 35వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సుమారు 70వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్స్‌ సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాడాలి.. కొట్లాడి హక్కులు సాధించుకోవాలని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. పెరుగుతున్న ధరల వల్ల ఒక్క కుటుంబం కనీస పోరాడి సాధించుకోవాలి అవసరాలు తీర్చుకోవడానికి రూ.20వేలకుపైగా అవుతుందని, అందువల్ల అంగన్‌వాడీలకు కనీస వేతనమివ్వడంతోపాటు వారిని పర్మినెంట్‌ చేయడం, పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత, రిటైర్డ్‌ బెన్‌ఫిట్స్‌ ఇతర చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఐసీడీఎస్‌ రక్షణ, అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు అన్ని జిల్లాల నుంచి వేలాది మంది అంగన్‌వాడీ టీచర్లు, మినీటీచర్లు, హెల్పర్స్‌ తరలిరావడంతో ఇందిరాపార్కు ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. మహాధర్నాకు అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.పద్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లు, కేంద్రం బడ్జెట్‌ రూ.45 లక్షల కోట్లు.. మరి ఇంత పెద్ద బడ్జెట్లలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్స్‌ సమస్యలను పరిష్కరించడానికి ఇబ్బందేముందని ప్రశ్నించారు. పొట్లాడి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని భరోసా కల్పించారు. రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శవంతంగా తీసుకునేలా తమ సర్కారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నదని ముఖ్యమంత్రి చెబుతున్నారని.. అలా అయితే.. ఇక్కడి అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్స్‌ సమస్యలు పరిష్కరిస్తే.. దేశవ్యాప్తంగా వారు మీకు జై కొడుతారనే విషయాన్ని మరవొద్దన్నారు. అంగన్‌వాడీలవి గొంతెమ్మ కోర్కెలు కాదని.. రేపే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని.. ఒకవేళ ఈ మధ్య కలిస్తే ఆయనకు స్వయంగా వివరిస్తామని హామీ ఇచ్చారు.తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి మాట్లాడుతూ.. ఈ ధర్నాకు అధికారులు, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించి.. అరెస్టులు చేసినా వేలాది మంది టీచర్లు, వర్కర్స్‌ తరలివచ్చి విజయవంతం చేశారన్నారు. అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు అంగన్‌వాడీల విషయంలో అన్నీ అబద్ధాలు చెప్పారన్నారు. అంగన్‌వాడీలపై పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌హెచ్‌టీఎస్‌ ట్రాక్‌ను రద్దు చేయాలన్నారు. లేబర్‌ పదం చులకనగా ఉందని అంగన్‌వాడీ టీచర్స్‌గా సీఎం పేరు మార్చినా వారి జీవితాలు మారలేదన్నారు. ప్రభుత్వ టీచర్ల మాదిరిగా వేతనాలు కల్పించాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్త సమ్మె సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు వేసి రోడ్లపైకి రావాలన్నారు. మార్చి 1న ర్యాలీలు, 2న కలెక్టరేట్ల వద్ద వంటావార్పు, నిద్ర, 3వ తేదీన కలెక్టరేట్ల దిగ్బంధం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌లో మరో వెయ్యి కోట్లు అదనంగా కేటాయిస్తే అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్స్‌కు కనీస వేతనం అమలు చేయొచ్చని తెలిపారు. పర్మినెంట్‌తో పాటు ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, పెన్షన్‌ అమలు చేయొచ్చని.. ఇది మీ చేతిలోనే ఉందని ప్రభుత్వానికి గుర్తుచేశారు. అవసరమైతే కేంద్రంపై పోరాటానికి అన్ని వామపక్షాల మద్దతు తీసుకుని ముందుకెళ్దామన్నారు. కేరళ సర్కారు కనీస వేతనం రూ.26వేలు అమలు చేస్తున్నదని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు కనీస వేతనాలతోపాటు 100 గజాల స్థలం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తు ఉద్యమాలకు సీఐటీయూ సంఘీభావం, సహకారం అందిస్తుందన్నారు. ఈ ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, కోశాధికారి కె.సునీత, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ జి.కవిత, జి.పద్మ, ఈ.వెంకటమ్మ, స్వర్ణ, డి.సునీత, కోటేశ్వరి, స్వప్ప, శారద, మేలమ్మ, నర్సమ్మ, త్రివేణి పాల్గొన్నారు.

Spread the love