బడి ఎరుగని పల్లెలు..!

–  ఆదివాసీ పిల్లలకు అందని ప్రాథమిక విద్య
–  పాఠశాలల నిర్మాణంలో ఐటీడీఏ అలసత్వం
–  అక్షరాలకు దూరమవుతున్న చిన్నారులు
– పట్టించుకోని అధికారులు
– కొండ కోనల మధ్య అలరారుతున్న అందమైన పల్లెలివి. ప్రకృతి రమణీయతకు
అద్దం పడుతున్న ఈ పల్లెల్లో అక్షరజ్ఞానం లేకుండా పోతోంది. శాస్త్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో కనీసం బడులు లేవంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో ఇప్పటికీ బడులు నిర్మించలేదు. గతంలో కొన్ని చోట్ల పాకల్లో నడిచినవి నేడు కనుమరుగయ్యాయి. దీంతో అక్కడ నివాసముంటున్న ఆదివాసీ గిరిజన చిన్నారులకు అక్షరాలు నేర్పేవారు లేరు. బడులను అభివృద్ధి చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాభివృద్ధికి పాటుపడుతున్నమని చెబుతున్న ప్రభుత్వాలు.. ఏజెన్సీ ప్రాంతంలో కనీసం బడి కూడా లేని విషయాలపై దృష్టిసారించడం లేదు. ఫలితంగా ఈ పేద గిరిజన చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏజెన్సీ పరిధిలో ఇలాంటి బడులు 920 వరకు ఉండగా.. వీటి పరిధిలో సుమారు 15వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఐటీడీఏ ఏర్పడి అనేక ఏండ్లు గడుస్తున్నా ఏజెన్సీ పరిధిలోని కొన్ని పల్లెల్లో ఇప్పటికీ బడులు లేవు. జిల్లా వ్యాప్తంగా మొదటి నుంచి అసలు బడులే లేని గ్రామాలు సుమారు 20వరకు ఉంటాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దాంతోపాటు ఇటీవల రేషనలైజేషన్‌లో ఎత్తేసినవి అదనం. ఇలా పాఠశాలలు లేని ఏజెన్సీ గ్రామాలు చాలా ఉన్నాయి. దీంతో ఈ గ్రామాల పరిధిలోని విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమవుతున్నారు. కొందరు ఆటల్లో.. మరికొందరు చిన్నారులు పనుల్లో నిమగమవుతున్నారు. విద్యకు దూరమవడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 20మంది పిల్లలు ఉన్న చోట తప్పనిసరిగా బడిని ఏర్పాటుచేసి చదువు చెప్పాలనే నిబంధన ఉన్నప్పటికీ ఐటీడీఏ అధికారులు
అవేమీ పట్టించుకోవడం లేదు. మరికొన్ని చోట్ల రేషనలైజేషన్‌ పేరుతో 20మంది కంటే తక్కువగా విద్యార్థులు ఉన్న బడులను మూసేసి ఆ విద్యార్థులను వేరే చోటకు బదిలీ చేశారు. సొంతూరిలో బడిలేక.. మరో చోటకు దూరం వెళ్లలేక ఆ పిల్లలు డ్రాపౌట్లుగా మిగిలిపోతున్నారు.
దృష్టిసారించని ఐటీడీఏ..!
ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఐటీడీఏను ఏర్పాటు చేసింది. విద్య, వైద్యం ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ శాఖమీదనే ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి ఐటీడీఏకు నిధులు అందజేసి అధిక ప్రాధాన్యతనిస్తుంటాయి. ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధికి రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని పాలకులు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం అభివృద్ధి జాడలు కనిపించడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీడీఏ పరిధిలో ప్రాథమిక విద్యను అందించే గిరిజన ఆశ్రమ పాఠశాలల పరిస్థితి దయనీయంగానే ఉంది. అనేక పాఠశాలల్లో టీచర్లు లేకపోవడం.. వారు ఉన్న చోట భవనాలు లేకపోవడం వంటి సమస్యలు అనేకమున్నాయి. కొన్ని గ్రామాల్లో ఏండ్లుగా బడులు లేకపోవడం.. అక్కడి పిల్లలు పనులకు వెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అక్కడి గ్రామస్తులు పలుమార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఎలాంటి ఫలితమూ కనిపించడం లేదని ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
పదేండ్ల నుంచి ఇక్కడ బడి లేదు
జైవంత్‌రావు- సిడాం దేవ్‌రావు
మా గ్రామంలో పదేండ్ల కిందట పశువుల పాకలో బడిని ఏర్పాటుచేసి ఉపాధ్యాయుడిని నియమించారు. ఆ సమయంలో చదువుకున్న కొందరు పిల్లలు ఇతర ఆశ్రమ ఉన్నత పాఠశాలలకు వెళ్లడంతో ఇక్కడి బడిని మూసేశారు. అప్పటి నుంచి మా పిల్లలకు చదువు లేకుండా పోయింది. బడిని ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదు. ఇక్కడ బడిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం
దిలీప్‌- ఐటీడీఏ డీడీ- ఆదిలాబాద్‌
ఏజెన్సీ పరిధిలోని కొన్ని గ్రామాల్లో బడులు లేవనే విషయాన్ని గుర్తించాం. ఇలాంటి గ్రామాలు సుమారు పది వరకు ఉంటాయని అంచనా వేశాం. వీటిలో బడుల నిర్మాణానికి నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అక్కడ్నుంచి అనుమతి రాగానే నిర్మించేలా చర్యలు తీసుకుంటాం.

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం పీచర గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన పిల్లలు వీరు. ప్రస్తుతం ఈ గ్రామంలో 23మంది చిన్నారులు ఉన్నారు. కానీ ఇక్కడ బడి లేకపోవడంతో ఈ బాలలు ప్రాథమిక విద్యకు దూరమవుతు న్నారు. ఇంటి వద్దే ఉంటూ ఆటలతోనే కాలం గడుపుతున్నారు. ఈ గ్రామంలో పదేండ్ల కిందట పశువుల పాకలో బడిని ఏర్పాటుచేసి ఉపాధ్యాయుడిని నియమించారు. కొన్నాండ్లపాటు కొనసాగినా వివిధ కారణాలతో ఎత్తివేశారు. దీంతో ఈ విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు.

సిరికొండ మండలం పాలవాగు గ్రామానికి చెందిన విద్యార్థులు వీరు. ఇక్కడ 20మంది విద్యార్థులు ఉన్నారు. 30ఏండ్ల కిందట ఈ గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ పాఠశాల లేదు. గతంలో ఈ మండలంలో పనిచేసిన సీఐ, ఎస్‌ఐలు చొరవ తీసుకొని తాత్కాలికంగా ఓ గుడిసెలో పాఠశాల ఏర్పాటుచేసి విద్యావాలంటీర్‌ను నియమించి అక్షరాలు నేర్పించారు. కానీ వారు బదిలీపై వెళ్లిపోవడంతో ఈ పాఠశాల నిర్వహణ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సిరికొండ యువసేన సభ్యులు సొంతంగా డబ్బులు పోగు చేసి ఏడు నెలల నుంచి ఒక విద్యావాలంటీర్‌ను నియమించడంతోపాటు విద్యార్థులకు పలకలు, పుస్తకాలు అందించి అక్షరాలు నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Spread the love