రైల్వేలో 3.12 లక్షలకుపైగా ఉద్యోగ ఖాళీలు

– సిబ్బంది కొరతతో ఉద్యోగులపై పని ఒత్తిడి
న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలో 3.12లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయని, దీంతో రైల్వేలో సిబ్బంది కొరత తీవ్రస్థాయిలో ఉందని కేంద్ర ప్రభుత్వ గణాంకాల్ని ఊటంకిస్తూ ఆంగ్ల దినపత్రిక ఒకటి వార్తా కథనం వెలువరించింది. సిబ్బంది కొరత వల్ల రైల్వేలో ఉద్యోగులపై పని ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉందని, ఓవర్‌టైమ్‌ పనిచేయాల్సి వస్తోందని తెలిపింది. ఉద్యోగ ఖాళీలను సాకుగా చూపుతూ ఔట్‌సోర్సింగ్‌ విధానంలో సిబ్బందిని నియమిస్తున్నారని రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైల్వే ఉద్యోగాలు భర్తీచేయాలంటూ దేశవ్యాప్తంగా యువత ఆందోళనబాట పట్టినా, పరిస్థితిలో మార్పు రావటం లేదని, మోడీ సర్కార్‌ ఖాళీల భర్తీ చేపట్టడం లేదని వార్తా కథనం పేర్కొంది. రైల్వే శాఖ ప్రకటించిన 40వేల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు పూర్తవుతుందా? అని 10లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని తెలిపింది. భారతీయ రైల్వేలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయని గతేడాది మార్చిలో రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన చేసి ఏడాది గడుస్తున్నా..పరిస్థితిలో మార్పు రాలేదని వార్తా కథనం విమర్శించింది. డిసెంబర్‌ 1, 2022నాటికి దేశంలోని 18 రైల్వే జోన్లలో 3.12 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. ఇవన్నీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు. నార్తర్న్‌ జోన్‌లో 38,754, వెస్టర్న్‌ జోన్‌లో 30,476, ఈస్టర్న్‌ జోన్‌లో 30,141, సెంట్రల్‌ జోన్‌లో 28,650 నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంజనీర్లు, టెక్నీషియన్లు, క్లర్కులు, స్టేషన్‌ మాస్టర్స్‌, టికెట్‌ కలెక్టర్‌..తదితర ఉద్యోగ ఖాళీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటం వల్ల ప్రస్తుత సిబ్బందిపై పని ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉందని, ఓవర్‌ టైమ్‌ చేయాల్సి వస్తోందని సమాచారం.

Spread the love