లైంగిక వాంఛ తీర్చాలని

మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ అనుచిత ప్రవర్తన
– ఛాతీపై చేతులు వేశారు
– కౌగిలించుకునేందుకు ప్రయత్నించారు

– ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు
న్యూఢిల్లీ : తన లైంగిక వాంఛ తీర్చాలంటూ మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ ఒత్తిడి చేశారని ఆరోపణలు నమోదయ్యాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌ (ప్రాథమిక సమాచార నివేదిక)లను, పది ఫిర్యాదులను నమోదు చేశారు. రెజ్లర్లతో అసభ్య పదజాలాన్ని ఉపయోగించి సంభాషించడం వంటివి చేసేవారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన లైంగిక వాంఛ తీర్చాలని ఆయన మహిళా రెజ్లర్లను డిమాండ్‌ చేశారని ఆరోపణలు నమోదు చేశారు. ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ పోలీస్‌ స్టేషన్‌లో వీటిని నమోదు చేశారు. బ్రిజ్‌ భూషణ్‌ మహిళా రెజ్లర్లను అనుచితంగా ముట్టుకున్నారని, వారి ఛాతీపై చేతులు వేశారని, ఛాతీ నుంచి వీపువైపు తన చేతితో తడిమారని, వారిని వెంటాడారని ఈ ఫిర్యాదుల్లో ఆరోపించారు. ఈ ఫిర్యాదులు ఏప్రిల్‌ 21న నమోదయ్యాయనీ, రెండు ఎఫ్‌ఐఆర్‌లు ఏప్రిల్‌ 28న నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. ఈ ఆరోపణలు రుజువైతే దోషికి సుమారు మూడేండ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు.
ఆరుగురు ఒలింపియన్ల ఆరోపణల ఆధారంగా మొదటి ఎఫ్‌ఐఆర్‌ను, ఓ మైనర్‌ తండ్రి ఫిర్యాదు మేరకు మరొక ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. తనను బ్రిజ్‌ భూషణ్‌ అనుచితంగా ముట్టుకున్నారని, తన భుజాలను గట్టిగా నొక్కారని ఈ మైనర్‌ ఆరోపించింది. ఫొటో తీసుకోవాలనే సాకుతో ఆయన తనను గట్టిగా పట్టుకున్నారని తెలిపింది. తనను ఫాలో అవ్వొద్దని తాను బ్రిజ్‌ భూషణ్‌ను స్పష్టంగా కోరానని చెప్పింది.
తన భుజాలు, మోకాళ్లు, అరచేతులను సింగ్‌ అనుచితంగా ముట్టుకున్నారని ఓ రెజ్లర్‌ ఆరోపించారు. ఓరోజు ఆయన నన్ను పిలిచి టీషర్ట్‌ లాగారని, తన శ్వాస తీరును తెలుసుకునే నెపంతో తన ఛాతీని, పొట్టను అనుచితంగా ముట్టుకున్నట్టు తెలిపారు. ఓసారి నాకు తెలియని ఓ పదార్థాన్ని తీసుకొచ్చి తినమని చెప్పారని మరో ఫిర్యాదుదారు ఆరోపించారు. తనను ఆయన వైపునకు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. తనను కౌగిలించుకుని, తనకు లంచం ఇవ్వజూపారని మరో రెజ్లర్‌ ఆరోపించారు. తాను వరుసలో నిల్చున్నపుడు తనను అనుచితంగా ముట్టుకున్నారని మరో బాధితురాలు ఆరోపించింది. కోచ్‌ లేని సమయంలో తమ వద్దకు వచ్చి ఇలాగే అభ్యంతరకరంగా ప్రవర్తించేవారని అవార్డు గెలుచుకున్న ఓ రెజ్లర్‌ ఆరోపణలు చేశారు.
బ్రిజ్‌ భూషణ్‌ తమతో దారుణమైన రీతిలో బెదిరింపులు, అనుచితమైన, దారుణమైన రీతిలో బెదిరింపులు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజ్లర్లు పేర్కొన్నారు. ‘ఆయనకు భయపడి మహిళా అథ్లెట్లు ఎప్పుడు బయటకు వచ్చినా బృందాలుగానే ఉండేవారం. అయినప్పటికీ.. ఆయన మా బృందంలో నుంచి ఒకరిని వేరుగా తీసుకెళ్లి అభ్యంతరకర ప్రశ్నలు అడిగేవారు. వాటికి సమాధానాలు చెప్పలేకపోయేవాళ్లం” అని ఓ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
”విదేశాల్లో జరిగిన పోటీల్లో నేను గాయపడ్డాను. అప్పుడు ఆయన (బ్రిజ్‌ భూషణ్‌) నా వద్దకు వచ్చి.. తనతో సాన్నిహిత్యంగా ఉంటే ట్రీట్మెంట్‌ ఖర్చులన్నీ ఫెడరేషనే భరిస్తుందని చెప్పారు’ అని మరో బాధితురాలు తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేసింది. ఫొటో తీసుకుందామంటూ తనను బలవంతంగా గట్టిగా హగ్‌ చేసుకున్నారని మరో రెజ్లర్‌ ఆరోపించింది.
ఇక, రెజ్లింగ్‌ సమాఖ్య సెక్రటరీ వినోద్‌ తోమర్‌ పైన ఓ రెజ్లర్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఓసారి తాను ఢిల్లీలోని డబ్ల్యూఎఫ్‌ఎస్‌ఐ కార్యాలయానికి వెళ్లినప్పుడు.. తోమర్‌ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. గదిలో అందర్నీ బయటకు పంపించి, తనను బలవంతంగా ఆయనవైపు లాక్కొన్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, బ్రిజ్‌ భూషణ్‌ పై వచ్చిన ఆరోపణలపై త్వరలోనే తుది నివేదకను కోర్టులో సమర్పించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు.

Spread the love