మహిళా లోకానికి ఇదేం సందేశం ?

– పోలీసుల దాష్టీకంపై క్రీడాలోకం కన్నెర్ర
న్యూఢిల్లీ : తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న మహిళా మల్లయోధులపై పోలీసుల దాష్టీకానికి సాక్ష్యంగా నిలిచిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వైరల్‌ అవుతున్నాయి. దేశానికి పతకాలు సాధించిన వినేశ్‌ ఫోగట్‌ను, రక్షణగా నిలిచిన ఆమె సోదరి సంగీతా పోగట్‌ను పోలీసులు బలవంతంగా బస్సులో ఎత్తి పడేసిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. టోక్యో ఒలింపిక్‌ పతక విజేత బజరంగ్‌ పునియా, రియో ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌ను కూడా పోలీసులు నిర్బంధించారు. ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌, ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడలు…ఇలా అనేక క్రీడా వేదికలపై దేశ పేరు ప్రఖ్యాతులను దశదిశలా ఇనుమడింపజేసిన మహిళా క్రీడాకారుల పట్ల పోలీసులు కనీసం గౌరవం చూపలేదు సరికదా తీవ్రమైన కాఠిన్యం ప్రదర్శించారు. మహిళలు భరతమాత ముద్దుబిడ్డలంటూ పొగడ్తలతో ముంచెత్తే పాలకులు రెజ్లర్లపై చూపించే గౌరవం ఇదేనా అని క్రీడాకారులు నిలదీస్తున్నారు. ‘ఇదంతా చూసి నేను చాలా విచారిం చాను. భారత క్రీడా రంగానికే ఇది చీకటి రోజు’ అని టోక్యో ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా వ్యాఖ్యానించారు. పోలీసులు ఇలా ప్రవర్తించి ఉండా ల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజమే.. పరిస్థితిని చక్కదిద్దడానికి రెజ్లర్లు ప్రభుత్వా నికి కావా ల్సినంత సమయం ఇచ్చారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షు డు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్య తీసుకోవాలంటూ రెజ్లర్లు జనవరిలోనే గళం విప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఒలింపిక్‌ పతక విజేతలు ఎంసీ మేరీకోమ్‌, యోగే శ్వర్‌ దత్‌తో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభు త్వం అదే నెల 23న ప్రకటన చేసింది.
మేరీకోమ్‌ బీజేపీ మాజీ ఎంపీ కాగా దత్‌ ఆ పార్టీ సభ్యుడు. విచారణ కోసం భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన కమిటీలో కూడా వీరిద్దరూ సభ్యులే. ఇలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భాలలో జరిపే విచారణల్లో క్రీడా శాఖ, ఒలింపిక్‌ అసోసియేషన్‌ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. గత సంవత్సరం సైక్లింగ్‌ కోచ్‌, సెయిలింగ్‌ కోచ్‌లపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు క్రీడా శాఖ వెంటనే స్పందించింది. ఫిర్యాదు అందగానే వీరిద్దరి కాంట్రాక్టులను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా రద్దు చేసింది. అంతేకాక మహిళా అథ్లెట్లకు బాసటగా నిలిచే విషయంలో జాతీయ క్రీడా సమాఖ్యలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఈ ఇద్దరు కోచ్‌లకూ రాజకీయాలతో సంబంధం లేదు. అందుకే అధికారులు వేగంగా స్పందించారు. కానీ ఇప్పుడు ఆరోపణలు వచ్చింది సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీ పైన. ఆయనపై విచారణ కోసం ఏర్పాటు చేసిన రెండు కమిటీలు నివేదికలు అందించినా వాటిని నేటి వరకూ బయటపెట్టలేదు. కనీసం ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు సైతం ఇవ్వలేదు. ఇది చాలదన్నట్లు భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు, ప్రముఖ క్రీడా కారిణి పీటీ ఉష రెజ్లర్లపైనే మండిపడ్డారు. వారిలో క్రమశిక్షణ లోపించిందని ఆరోపించారు.
బీజేపీతో 2015 నుండి సంబంధాలున్న అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి కల్యాణ్‌ చౌబే కూడా రంగంలోకి దిగారు. రెజ్లర్లు దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తు న్నారంటూ ఆయన దుయ్యబట్టారు. మహిళా రెజ్లర్లకు పతకాలు వచ్చినప్పుడు వారిని పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోడీ ఇప్పుడు మౌనముద్రలోకి జారుకున్నారు. ఇలాంటి నాయకులు మహిళా లోకానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో గమనించా ల్సిన అవసరం ఉంది.
ఢిల్లీ పోలీసుల కస్టడీలో జంతర్‌ మంతర్‌
అగ్రశ్రేణి రెజ్లర్లతో సహా 12 మందిపై కేసు నమోదు
– కాల్చి చంపుతామని రిటైర్డ్‌ ఐపీఎస్‌ బెదిరింపులు
– మా ఫిర్యాదుపై కేసు నమోదుకు ఏడు రోజులు, మాపై మాత్రం ఏడు గంటల్లోనే : వినేశ్‌ ఫోగట్‌
– 1న దేశవ్యాప్త ఆందోళనలు : పది కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు
పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవం రోజునే.. అగ్రశ్రేణి రెజ్లర్ల ఆందోళనను పోలీసులు అడ్డుకున్న తీరు యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లైగింక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలని ఆందోళన చేస్తున్న రెజ్లర్లు.. ఆదివారం కొత్త పార్లమెంట్‌ వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. వారిని పోలీసులు క్రూరంగా అడ్డుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. వారి ఆందోళన కొనసాగితే దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
అగ్రశ్రేణి రెజ్లర్లతో సహా 12 మందిపై కేసు నమోదు
అల్లర్లకు పాల్పడటం, ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకోవడం వంటి ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అగ్రశ్రేణి రెజ్లర్లు సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియా సహా 12 మందిపై ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీన్ని రెజ్లర్లు తీవ్రంగా ఖండించారు. ”బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మేం ఫిర్యాదు చేస్తే ఆయనపై కేసు నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులకు ఏడు రోజులు పట్టింది. కానీ శాంతియుతంగా నిరసన చేస్తున్న మాపై ఏడు గంటల్లోనే కేసు పెట్టారు” అని వినేశ్‌ ఫోగట్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
మార్ఫింగ్‌ ఫొటోలు వైరల్‌..
ఇదిలా ఉండగా.. రెజ్లర్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని బస్సుల్లో ఎక్కించి వేర్వేరు చోట్లకు తరలించారు. అయితే ఆ ఫొటోలను కొందరు మార్ఫింగ్‌ చేయడంతో అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆ మార్ఫింగ్‌ ఫొటోల్లో వినేశ్‌ ఫోగట్‌, సంగీత ఫోగట్‌ పోలీసు వ్యాన్లో కూర్చుని నవ్వుతూ సెల్ఫీ తీసుకున్నట్లుగా ఉంది. దీనిపై సాక్షి మాలిక్‌ స్పందిస్తూ.. ‘అవి నిజమైన ఫొటోలు కాదు. కొందరు కావాలనే మార్ఫింగ్‌ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. మాకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే ఆ మార్ఫింగ్‌ ఫోటోతో నిజమైన ఫోటోను జత చేసి రెజ్లర్లకు మద్దతుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
జంతర్‌ మంతర్‌ వద్ద అనుమతి లేదు: ఢిల్లీ పోలీసులు
రెజ్లర్ల ఆందోళనపై ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌ తాజాగా స్పందించారు. ‘గత 38 రోజులుగా జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేసిన రెజ్లర్లకు మేం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. కానీ, వారు చట్టాన్ని అతిక్రమించారు. మేం చెప్పినా వారు వినిపించుకోలేదు. అందుకే అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. రెజ్లర్లు తమ దీక్షను కొనసాగించాలనుకుంటే అందుకు అనుమతి కోరుతూ అప్లికేషన్‌ ఇవ్వొచ్చు. అయితే జంతర్‌ మంతర్‌ వద్ద మాత్రం దీక్షకు అనుమతినివ్వలేం. అది కాకుండా మరో చోట వారికి అనుమతి కల్పిస్తాం’ అని అన్నారు.
పోలీస్‌ కస్టడీలో జంతర్‌ మంతర్‌
ఆదివారం ఘటన తరువాత జంతర్‌ మంతర్‌ వద్ద రెజ్లర్ల సభాస్థలిని పోలీసులు ధ్వసం చేశారు. రెజ్లర్ల సామాగ్రిని అక్కడ నుంచి ఖాళీ చేయించారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్‌ విధించారు. ఆందోళనకారులు, ఇతరులను జంతర్‌ మంతర్‌ లోపలికి అనుమతించట్లేదు. జంతర్‌ మంతర్‌ మొత్తం పోలీస్‌ కస్టడీలో ఉంది. వందలాది పోలీసుల పహారాలో ఆ ప్రాంతం ఉంది.
కాల్చి చంపుతామని రిటైర్డ్‌ ఐపీఎస్‌ బెదిరింపులు
ఈ వ్యవహారంపై రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఒకరు ట్విట్టర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు ఒలింపిక్‌ పతకం విజేత బజరంగ్‌ పూనియా ధీటుగా బదులిచ్చారు. రిటైర్డ్‌ ఐపీఎస్‌, కేరళ పోలీస్‌ మాజీ చీఫ్‌ ఎన్‌ సి ఆస్తానా ఈ ట్వీట్‌ చేశారు. ‘పరిస్థితులు బట్టి మీపై కాల్పులు జరుపుతారు. తప్ప మీరు చెబితే కాదు. ఒక బస్తా చెత్తను పడేసినట్లే.. మిమ్మల్ని లాగి పడవేస్తాం. సెక్షన్‌ 129 ప్రకారం పోలీసులకు కాల్చులు జరిపే అధికారం ఉంది.
సమయం వస్తే ఆ కోరిక నెరవేరుతుంది. పోస్ట్‌మార్టం టేబుల్‌పై మళ్లీ కలుద్దాం’ అంటూ రెజర్లను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్‌ పై భజరంగ్‌ పునియా స్పందిస్తూ.. ‘ఈ ఐపీఎస్‌ అధికారి మమ్మల్ని కాల్చడం గురించి మాట్లాడుతున్నారు. సోదరా, మేము మీ ముందున్నాం. ఎక్కడికి రావాలో చెప్పండి. మీ బుల్లెట్లకు మా చాతీని చూపుతామని మీకు ప్రమాణం చేస్తున్నా. ఇప్పటి వరకు రెజర్లు బుల్లెట్లు మినహా మిగతావన్నింటినీ ఎదుర్కొన్నారు. ఇక మిగిలింది అదొక్కటే, అది కూడా తీసుకురండి’ అంటూ హిందీలో ట్వీట్‌ చేశారు.
జూన్‌ 1న దేశవ్యాప్త ఆందోళనలు పది కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు
లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌ భూషణ్‌ పై కాకుండా, దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మల్లయోధులపై అణచివేతను నిరసించాలని పది కేం ద్ర కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చాయి. రెజ్లర్లపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన అణచివేతను ఖండించాలనీ, దానికి వ్యతిరేకంగా జూన్‌1న నిరసన కార్యక్రమా లు చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు తమ అనుబంధ సంఘాలకు పిలుపునిచ్చా యి. ఈ మేరకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, ఏఐయూటీయూసీ, టీయూ సీసీ, సేవా, ఎఐసీసీటీయూ, ఎల్పీఎఫ్‌, యూటీయూసీ సంఘాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.

Spread the love