వీఓఏల డిమాండ్లు నెరవేర్చాల్సిందే

సర్కారు న్యాయం చేయకపోతే సత్తా ఏంటో చూపుతాం
– గులాంగిరీ సంఘాలు తమ ధోరణిని మార్చుకోవాలి
– చేతనైతే సహాయం చేయండి.. లేకుంటే సైలెంట్‌గా ఉండండి: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– వేలాదిగా తరలొచ్చిన ఐకేపీ వీఓఏలు..మహాధర్నా విజయవంతం
– జిల్లాల్లో అడుగడుగునా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఐకేపీ వీఓఏలు చేస్తున్న సమ్మెలో న్యాయముందనీ, వారి డిమాండ్లను రాష్ట్ర సర్కారు నెరవేర్చాల్సిందేనని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ కోరారు. న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో వీఓఏల సత్తా ఏంటో చూపుతారని హెచ్చరించారు. 18 వేల మందికి వేతనాలు పెంచాలని చేస్తున్న పోరాటంపై తప్పుడు ప్రచారం చేస్తున్న పాలకవర్గాల గులాంగిరీ సంఘాలు తమ ధోరణిని మానుకోవాలని హితవు పలికారు. చేతనైతే సహాయం చేయాలనీ, లేకుంటే సైలెంట్‌గా ఉండాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. అధికారులు బెదిరింపులకు దిగినా, పోలీసులు అడ్డగించినా, అరెస్టులు చేసినా ఈ మహాధర్నాకు వేలాది మంది వీఓఏలు తరలొచ్చి జయప్రదం చేశారు. ఈ కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. వీఓఏలనుద్దేశించి భాస్కర్‌ మాట్లాడుతూ..తమ జీతాలు పెంచాలని వీఓఏలు ఏడాదిగా పోరాడుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. మంత్రులకు, సెర్ప్‌ అధికారులకు, ఎమ్మెల్యేలందరికీ తమ బాధలను మొరపెట్టుకుని చివరకు గత్యంతరం లేకనే వారు సమ్మెలోకి వెళ్లారన్నారు. దీనిపై కొన్ని సంఘాలు అసత్య ప్రచారాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సెక్రటరియేట్‌, పార్లమెంట్‌లో వాటాలొద్దనీ, సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇస్తున్నట్టు లక్షల రూపాయల వేతనాలు అడగట్లేదని చెప్పారు. రూ.3,900 వేతనంతో ఎట్లా బతుకుతారు? కనీస వేతనం అమలు చేయాలని అడగటం నేరమా? అని ప్రశ్నించారు. మహాధర్నాకు అనుమతి ఇచ్చి వీఓఏలను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. పూటగడవక కడుపుకాలి రోడ్డెక్కిన వాళ్లను అణచజూస్తే పాలకులకు పుట్టగతులుండవని హెచ్చరించారు.
కూరలో కరివేపాకులాగా వీఓల పరిస్థితి : ఎస్వీ.రమ, ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు
రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవసరాలకు వాడుకుంటూ వీఓఏల కష్టాలు, బాధలను ఏమాత్రం పట్టించుకోవడం లేదనీ, రాష్ట్రంలో వారి పరిస్థితి కూరలో కరివేపాకులాగా తయారైందని ఐకేపీ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అరె కష్టపడి పనిచేస్తున్నాం…రోజు కూరగాయలకే రూ.60,70 ఖర్చవుతున్నాయి…రోజుకు రూ.130 వేతనంతో ఎట్లా బతుకుతాం…వేతనాలు పెంచాలంటే తప్పా’ అని నిలదీశారు. అవే వేతనాలతో బతికి చూపాలని సెర్ప్‌లోని ఉన్నతోద్యోగులకు సవాల్‌ విసిరారు. వీఓఏలు తెరపైకి తెచ్చిన తొమ్మిది డిమాండ్లు న్యాయమైనవేననీ, వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 43 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర సర్కారు స్పందించకపోవడం దారుణమని విమర్శించారు.
వేతనాల విషయంలో కేరళను ఆదర్శంగా తీసుకోండి : జె.మల్లిఖార్జున్‌, కనీస వేతనాల సలహామండలి బోర్డు సభ్యులు
కనీస వేతనాల విషయంలో కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలని కనీస వేతనాల సలహా మండలి బోర్డు సభ్యులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లిఖార్జున్‌ సూచించారు. కేరళ ప్రభుత్వం కూలీలకు రోజువారీ కనీస కూలి రూ.600 ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కడుపుగాలి ఎర్రటెండను సైతం లెక్కచేయకుండా పట్టుదలతో వీఓఏలు చేస్తున్న పోరాటాన్ని తక్కువ అంచనా వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. వీఓఏలు ఢిల్లీ రైతాంగ పోరాటం స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సమ్మె కూడా యుద్ధం లాంటిందే :జె.వెంకటేశ్‌, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి
సమ్మె కూడా యుద్ధం లాంటిందేననీ, తమ డిమాండ్ల పరిష్కారానికి అన్ని దారులూ మూసుకుపోయిన నేపథ్యంలో కార్మికులు ప్రదర్శించే ఆయుధమే సమ్మె అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ అన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులు పొదుపు డబ్బులు, రుణాలు సకాలంలో కట్టేలా చూడటంలో వీఓఏల పాత్రను మరువొద్దన్నారు. గ్రామాల్లో పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న వీఓఏలు కడు పేదరికంలో బతకడం బాధాకరమన్నారు. వీఓఏల సమ్మె పట్ల సోషల్‌మీడియాలో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలి : నగేశ్‌, ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీఓఏల న్యాయమైన డిమాండ్లయిన కనీస వేతనం రూ.26 వేలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేశ్‌ డిమాండ్‌ చేశారు. రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఐడీ కార్డులు,యూనిఫాం ఇవ్వటం తదితర డిమాండ్లను నెరవేర్చాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్‌, వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు సుమలత, అనిత, శరత్‌కుమార్‌, సుధాకర్‌, రమేష్‌, వెంకటయ్య, జ్యోతి, శోభారాణి, అరుణ, అంజి, రాములు తదితరులు పాల్గొన్నారు.
సెర్ప్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌తో చర్చలు
మహాధర్నా నేపథ్యంలో ఐకెపి వీఓఏ ఉద్యోగుల సంఘం, సీఐటీయూ నేతలను సెర్ప్‌ ఉన్నతాధికారులు పిలిచి చర్చించారు. ఈ చర్చలు సెర్ప్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సూర్యారావు సమక్షంలో జరిగాయి. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్లను వివరిస్తూ సెర్ప్‌ పరిధిలో ఆర్ధికేతర, ప్రభుత్వమే పరిష్కరించాల్సిన ఆర్ధికపరమైన వాటిని కూలంకషంగా తెలిపారు. దీనికి సూర్యారావు స్పందిస్తూ వీఓఏ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సెర్ప్‌ సీఈఓ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తక్షణమే తీసుకెళ్తామని హామీనిచ్చారు. ఈ చర్చలో భాస్కర్‌తో పాటు జె. వెంకటేష్‌, ఎస్వీ.రమ, ఎం. నగేష్‌, కె. రాజ్‌కుమార్‌, సుమలత పాల్గొన్నారు.

Spread the love