బీజేపీ సెల్ఫ్‌గోల్‌

ఆ పార్టీ చర్యలతోనే కాంగ్రెస్‌కు లాభం
– కర్నాటక ఎన్నికల ఫలితాలపై విశ్లేషకులు, సామాజికవేత్తలు
న్యూఢిల్లీ : దక్షిణాది రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. కర్నాటకను ఆధారంగా చేసుకొని దక్షిణాదిన విస్తారిద్దామనుకున్న బీజేపీ ఆశలు అడియాశలయ్యాయి. అయితే, రాష్ట్రంలో ఆ పార్టీ ఓటమికి తాను తీసుకున్న నిర్ణయాలు, చర్యలే కారణమని విశ్లేషకులు, సామాజికవేత్తలు, నిపుణులు అన్నారు. ఫలితంగా కాంగ్రెస్‌కు లాభం చేకూరటం.. హస్తం పార్టీ కూడా ఐక్యంగా ముందుకు వెళ్లటంతో తాజా ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఈ సందర్భంగా విశ్లేషకులు, సామాజికవేత్తలు కొన్ని విషయాలను తెలిపారు.
8 దేశంలోని చాలా రాష్ట్రాలు విపక్షాల పాలనలో ఉన్నాయనేది వాస్తవమే అయినా.. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో నిరంకుశ ధోరణిని మరవకూడదని నిపుణులు, మేధావులు అన్నారు. కర్నాటక విజయం మరింత శ్రేయోదాయకమనీ, రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేసిన విపరీతమైన ఆగ్రహాన్ని ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు.
8 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ), ఇన్‌కమ్‌ ట్యాక్స్‌(ఐటీ) డిపార్ట్‌మెంట్‌, ఇతర కేంద్ర ఏజెన్సీల ద్వారా ప్రతిపక్షంతో సంబంధం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ఎన్నికల ప్రచారంలో నిరాటంకంగా కొనసాగిందని చెప్పారు. ఈ సంస్ధల కీలక పదవులకు ఎంపికైన వ్యక్తులు సంస్థలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు.
8 ఎన్నికల సంఘం(ఈసీ) నరేంద్ర మోడీ, అమిత్‌ షాల అనేక ప్రకటనలు, చర్యలపై.. కాంగ్రెస్‌, ఇతరులు చేసిన ఫిర్యాదులను విస్మరించిందని తెలిపారు. ఇది ఒక పక్షపాతాన్ని ప్రదర్శించిందన్నారు. ఓటు వేసేటప్పుడు జై బజరంగ్‌బలి అనే మతపరమైన ప్రార్థనను ఉపయోగిం చాలని మోడీ ఓటర్లను నిర్ద్వంద్వంగా ఉద్బోధించడంపై ఈసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నోటీసూ రాలేదని గుర్తు చేశారు. ఈ పిలుపు ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమేని కాంగ్రెస్‌ ఆరోపించిందని తెలిపారు.
8 అజ్ఞాత ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా సేకరించిన నిధులను బీజేపీ మరోసారి వినియోగించుకోగలిగిందని విశ్లేషకులు అన్నారు. ఈ రకమైన అపారదర్శక రాజకీయ నిధుల రాజ్యాంగబద్ధతను సవాలుపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేస్తూనే ఉన్నది. అంటే కర్నాటక ఎన్నికలు కచ్చితంగా నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగలేదని అభిప్రాయపడ్డారు.
8 ఎన్నికల కోడ్‌ను విధించే ముందు అధికారిక సందర్శనల కోసం మోడీ రాష్ట్ర వనరులను భారీగా ఖర్చు చేయడంతో కార్పొరేట్‌ యాజమాన్యంలోని పెద్ద జాతీయ మీడియా బీజేపీకి ప్రచార విభాగంగా పని చేసిందని తెలిపారు.
8 కాంగ్రెస్‌ పార్టీ టెర్రరిస్టులతో కలిసి పనిచేస్తోందని చెప్పడం నుంచి కాంగ్రెస్‌ గెలిస్తే అల్లర్లు జరుగుతాయని అమిత్‌ షా చెప్పడం వరకు బీజేపీ ప్రచారం, మోడీ ప్రసంగాలు తీవ్ర మతతత్వ, విద్వేషపూరితంగా ఉన్నాయని విశ్లేషకులు అన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేయాలనే నిర్ణయంతో ఎన్నికల ముందు బీజేపీ తన ప్రచారాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ చర్యపై సుప్రీంకోర్టు స్టే విధించటం గమనార్హం. ఈవీఎం బటన్‌ను నొక్కిన తర్వాత ‘జై బజరంగ్‌బలి’ అని కేకలు వేయాలని ఓటర్లను కోరడం ఒక్కటే కాదు.. హిందువుల ఓటర్లను ఆకట్టుకునేందుకు మోడీ ‘కేరళ స్టోరీ’ చిత్రం సహాయం కూడా తీసుకున్నారని సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు అన్నారు.
8 మణిపూర్‌లో 60 మందికి పైగా అధికారికంగా ప్రాణాలు కోల్పోయిన భారీ హింసాకాండను మోడీ,షా పట్టించు కోలేదని చెప్పారు. వారు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున హింసాకాండ కారణంగా 35,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారనీ, ఇద్దరు నేతలు కర్నాటకలో ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌’ ప్రాముఖ్యతపై పాఠాలు చదువుతుండగా, మణిపూర్‌లో ‘లా అండ్‌ ఆర్డర్‌’కు ఆటంకం ఏర్పడిందని తెలిపారు.
అదేవిధంగా, ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడుల కారణంగా భారత సైన్యానికి చెందిన ఐదుగురు స్పెషల్‌ ఫోర్సెస్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కర్నాటక ప్రచారంలో బిజీగా ఉన్న మోడీ వారి మరణాలను గుర్తించకపోవడం గమనార్హం.
8 కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ గుజరాత్‌ కోర్టు తీర్పుతో లోక్‌సభ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. రాహుల్‌ విషయంలో న్యాయస్థానం, లోక్‌సభ సెక్రెటరీ, స్పీకర్‌ శీఘ్ర నిర్ణయాలు తీసుకోవటం బీజేపీకే మైనస్‌గా మారిందన్నారు.
8 ప్రచార సమయంలో అదానీ అవినీతి సమస్యపై మోడీ మౌనం నిరాటంకంగా కొనసాగిందనీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ’40 పర్సంటేజీ సర్కారు’ అని జనాల్లోకి బలంగా నాటుకుపోయిందని చెప్పారు.
8 ఎన్నికలకు ముందు రాష్ట్ర, కేంద్ర స్థాయిలలో బీజేపీ ప్రభుత్వం అనవసర కేసులు, ఇతర ప్రతీకార చర్యల ద్వారా పౌర సమాజ గొంతులను భయపెట్టడానికి తన శాయశక్తులా ప్రయత్నించిందన్నారు. హిందూత్వాన్ని విమర్శిస్తూ సోషల్‌ మీడియా పోస్ట్‌ చేసినందుకు నటుడు చేతన్‌ కుమార్‌ను అరెస్టు చేయడం, అతని ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ) కార్డును రద్దు చేయాలనే నిర్ణయం తీసుకోవడం దీనికి ఉదాహరణ అని విశ్లేషకులు గుర్తు చేశారు.

Spread the love