బీజేపీని ఓడించడమే సీపీఐ లక్ష్యం

– సీపీఐ జాతీయ కార్యదర్శి డా|| కె. నారాయణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
విధ్వంసక రాజకీయాలు చేస్తున్న బీజేపీని దేశవ్యాప్తంగా ఓడించడమే సీపీఐ లక్ష్యం అని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డా|| కె.నారాయణ తెలిపారు. సీపీఐ ఏప్రిల్‌ 15 నుంచి మే 15 వరకు నెల రోజులు దేశ వ్యాప్తంగా ‘బీజేపీ కో హటావో – దేశ్‌ కో బచావో’ నినాదంతో బీజేపీ ప్రజా వ్యతిరేక, వినాశకరమైన విధానాలను ప్రజలకు వివరించేందుకు పాద యాత్రలు నిర్వహించినట్టు తెలిపారు. హైదరాబాద్‌ లోని మూసారాంబాగ్‌, ఆస్మాన్‌ గఢ్‌, టీవీ టవర్‌, బీ బ్లాక్స్‌, తిరుమల హిల్స్‌, వీకే దాగే నగర్‌, బ్యాంక్‌ కాలనీ తదితర బస్తీలు, కాలనీల్లో ఆదివారం హైదరాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశమంతటా మత విషాన్ని వ్యాపింపజేస్తున్న బీజేపీ.. ప్రజలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి అని హుకుం జారీచేస్తే ప్రజలు ఊరుకోరని కర్నాటక మాదిరిగానే దేశమంతటా తరమికొడతారని తెలిపారు.కర్నాటకలో మోడీ, అమిత్‌ షా ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించినా బీజేపీ అవ మానకరమైన ఓటమి చెందిందన్నారు. ప్రజలను పేదరికం, వెనుకబాటు నుంచి బయటికి నడిపిం చడంలో మోడీ ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైం దన్నారు. రెండు పర్యాయాల బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం.. దేశ సంస్కృతి, నైతికత, ప్రజా సంస్థలు, ప్రజాస్వామ్య నిర్మాణం, రాజ్యాంగ విలువలకు అపారమైన నష్టం కలిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం.. రాజ్యాంగ ఆదేశాన్ని పరిరక్షించడం కోసం ప్రగతిశీల, ప్రజాసామ్య వాదులందరూ ఏకమై బీజేపీ వినాశకరమైన విధా నాలు ప్రజలకు తెలిపి, చైతన్య పరిచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ మాట్లాడుతూ.. బీజేపీ నియంతృత్వ పాలన నుంచి దేశాన్ని కాపాడు కోవల సిన అవసరం ఏర్పడిందని, ప్రజలు బీజేపీ తప్పి దాలను గమనించి వచ్చే ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ పాద యాత్రలో.. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌. ఛాయాదేవి, రాష్ట్ర సమితి సభ్యులు బి. వెంకటేశం, జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, స్టాలిన్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు జి. చంద్రమోహన్‌ గౌడ్‌, నిర్లేకంటి శ్రీకాంత్‌, కంపల్లి శ్రీనివాస్‌, పార్టీ నగర నేతలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love