మృత్యు గంటలు

సిగలింగ్‌ వైఫల్యంతో చితికిన బతుకులు
– ఒకేచోట పట్టాలు తప్పిన రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు
– గూడ్స్‌ను ఢకొీని పల్టీలు కొట్టిన కోరమండల్‌
– ప్రక్క ట్రాక్‌ పడిన బోగీలను ఢకొీన్న యశ్వంత్‌పుర్‌
– 50 మంది పైగా ప్రయాణికులు మృతి
– 350 మందికి గాయాలు

– ఒడిశాలో బాలాసోర్‌ సమీపంలో ఘోర ప్రమాదం
– సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి
భువనేశ్వర్‌ : రైల్వే భద్రతకు నిధుల కోత. .రైల్వేల ప్రయివేటీకరణ చర్యలు ఇప్పుడు ఏకంగా ప్రయాణికుల ప్రాణాలను తోడేస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా సమీపంలోని బహనగ స్టేషన్‌ వద్ద సిగలింగ్‌ వ్యవస్థ వైఫల్యంతో రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలు తప్పాయి. తొలుత బహనగ స్టేషన్‌లో ఆగివున్న గూడ్సు బండిని కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢకొీని పట్టాలు తప్పి పల్టీలు కొట్టింది. 13 బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. అదే సమయంలో యశ్వంతపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దూసుకొచ్చి కోరమండల్‌ బోగీలను ఢకొీనింది. దీంతో పలు బోగీలు పల్టీ కొట్టాయి. శుక్రవారం రాత్రి 7.08 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘోర జంట ప్రమాదాల్లో 50 మంది బతుకులు చితికిపోయాయి. మరో 350 మంది పైగా ప్రయాణికులు గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రమాదస్థలిలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. కారుచీకట్లలో ప్రయాణికుల హాహాకారాలు మిన్నంటాయి. మృతదేహాలను ఒక్కటొక్కటిగా బయటకు తీశారు. రక్తమోడుతున్న క్షతగాత్రులను అంబులెన్సులలో వివిధ ఆస్పత్రులకు తరలించారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ ప్రమాదంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని, త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఘోర ప్రమాదం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీశ్‌ ధన్కర్‌, ప్రధాని మోడీ, సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిధుల కొరత కారణంగా సిగలింగ్‌ వ్యవస్థ నిర్వహణాలోపమే ఇంతటి ఘోర విషాదానికి కారణమని రైల్వే రంగ నిపుణులు తెలిపారు.కోచ్‌ల మధ్య పలువురు ప్రయాణికులు చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు, వైద్యులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వరకూ సహాయక చర్యలు కొనసాగాయి. దాదాపు 60 అంబులెన్సులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను తరలించారు. భువనేశ్వర్‌ తదితర ప్రాంతాల నుంచి వైద్యులను తరలించి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో సుమారు 1800 ప్రయాణికులు ఉన్నారని, ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉందని అధికారులు ప్రకటించారు. సిగల్‌ లోపం కారణంగా రెండు రైళ్లు ఒకే ట్రాక్‌ పైకి వచ్చి ఢకొీన్నాయని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు భారీగా ధ్వంసమైంది.
హెల్ప్‌లైన్లు ఏర్పాటు
ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్‌ లైన్‌ నెంబర్లను రైల్వే శాఖ ప్రకటించింది విశాఖపట్నం వారు 0891-2746330, 0891-2744619, విజయనగరం వారు 08922-221202, 08922-221206, హౌరా వారు 033-26382217, ఖరగపూర్‌ వారు 8972073925, 9332392339, బాలాసోర్‌ వారు 8249591559, 7989418322, షాలిమర్‌ వారు 9903370746 నెంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు.
రూ.10 లక్షల చొప్పున పరిహారం
ఈ ఘోర ప్రమాదంలో మరణించిన ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందజేస్తామని తెలిపారు.
దురదృష్టకరం : కేసీఆర్‌
ప్రమాదఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అని ఆయన పేర్కొన్నారు.మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మె రుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుం బాలను ఒడిశా,కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Spread the love