సృజనాత్మకత వెలికి తీయడమే లక్ష్యం

– విద్యార్థుల కోసం జాతీయ వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన
– నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు బడులకు అవకాశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యార్థుల్లో దాగి ఉన్న సహజ ఉత్సుకత, సృజనాత్మకత, నూతన ఆలోచనలను వెలికి తీయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విద్యా పరిశోధన మండలి (ఎన్‌సీఈఆర్టీ) చర్యలు చేపడుతోంది. జవహర్‌లాల్‌ నెహ్రూ జతీయ వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన (జేఎన్‌ఎన్‌ఎంఈఈ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తోంది. దీంతో పాటు నేషనల్‌ చిల్డ్రన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌(ఎన్‌సీఎస్‌సీ), స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌(ఎస్‌ఐసీ) వంటి ప్రదర్శనలు నిర్వహించనుంది. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలలో సత్తా చాటేందుకు విద్యార్థులకు నవంబర్‌ నెల వేదికగా మారనుంది. ఈ నెలలో మొత్తం మూడు రకాల ప్రదర్శనలలో పాల్గొనేందుకు విద్యార్థులకు అద్భుత అవకాశం లభించిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 50వ జవహర్‌ లాల్‌ నెహ్రూ నేచురల్‌ సైన్స్‌ మ్యాథ్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎగ్జిబిషన్‌ను నవంబర్‌ చివరిలో జరగనుంది. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో అన్నీ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చు. 6 నుంచి 12వ తరగతి వరకు చదివే వారందరికీ అవకాశం కల్పిస్తున్నట్టు ఎసీఈఆర్టీ ప్రకటించింది. స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌(ఎస్‌ఐసీ)-2022 ప్రారంభమైనది. విద్యార్థులు ఉపాధ్యాయులలో డిజైన్‌ ఆలోచనలు, ఆవిష్కరణ సంస్కృతిని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఉన్నత పాఠశాలలు తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ పాల్గొనేందుకు అర్హులు. నవంబరు 5లోగా ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. నవంబర్‌ 16న జరిగే శిక్షణ కార్యక్రమ రిజిస్ట్రేషన్‌కు https:///bit.ly/SIP2022Registerలింక్‌తో పాటు జిల్లా సైన్స్‌ అధికారి సి. ధర్మేందర్‌ రావ్‌ మొబైల్‌ నెంబర్‌ 7799171277కు సంప్రదించాలని జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్‌. రోహిణి తెలిపారు. బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ 2022-23కి గాను జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌( నేషనల్‌ చిల్డ్రన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌) జిల్లా స్థాయి ప్రదర్శన ఈ నెలలో జరగనుంది. ఆరోగ్యం, సంక్షేమం కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం అంశంపై ప్రాజెక్టు నిర్వహించాలి. ఇద్దరు సభ్యులతో కూడిన విద్యార్థుల బృందం గైడ్‌ టీచర్‌ పర్యవేక్షణలో ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలి. ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించి బృందంగా అడిగేస్తే విజయం తప్పక సాధించవచ్చు. సాధ్యమైనన్ని ఎక్కువ పాఠశాలలు దరఖాస్తు చేసుకునేలా అధికారులకు డీఈవో సూచించారు.
ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు
జిల్లా స్థాయి నేషనల్‌ చిల్డ్రన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రదర్శన, జిల్లాస్థాయి జవహర్‌ లాల్‌ నెహ్రూ నేషనల్‌ సైన్స్‌ మ్యాథమెటిక్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎగ్జిబిషన్‌ ఈ నెల చివరిలో జరగనుంది. అందులో భాగంగా పాతబస్తీ పరిధిలోని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ, ప్రయివేటు ఉపాధ్యాయులకు ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. దీనిని బహుదూపూర్‌ మండంలోని పొలరీస్‌ ఇంటరాక్ట్‌ స్కూల్లో శుక్రవారం ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు నిర్వహించనున్నారు. తెలంగాణ సైన్స్‌ ఫెయిర్‌ అకాడమీ అధ్యక్షులు డాక్టర్‌ అజిజ్‌ రెహమాన్‌, ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్‌ రఘునందన్‌ రావు, రిటైర్డ్‌ జిల్లా సైన్స్‌ అధికారి జి.ప్రభాకర్‌, ప్రొఫెసర్‌ గఫూర్‌ యూనిసా, రిటైర్డ్‌ బయోలాజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ నిర్మలా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ రిటైర్డ్‌ అబ్దుల్‌ కమల్‌ నాజర్‌ రిసోర్స్‌ పర్సన్స్‌గా సైన్స్‌ ఉపాధ్యాయులకు అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. డీఈవో ఆర్‌.రోహిణి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా సైన్స్‌ అధికారి సి.ధర్మేందర్‌ రావు, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ రామకృష్ణ నిర్వహించనున్నారు.

Spread the love