10 ఎంపీ సీట్లు గెలవాల్సిందే

– తెలంగాణలో భవిష్యత్‌ బీజేపీదే
– క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయండి : అమిత్‌షా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ 35శాతం ఓట్లతో 10 పార్లమెంటు సీట్లు గెెలిచేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రూపొందించుకోవాలని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. అనంతరం చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జులు తరుణ్‌చుగ్‌, అర్వింద్‌ మీనన్‌, ప్రకాశ్‌జవదేకర్‌, రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజరు, మురళీధర్‌రావు, రాష్ట్ర నేతలు ఈటల రాజేందర్‌, ప్రేమేందర్‌రెడ్డి, జి.మోహన్‌రావు, బండారు విజయ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.వెంకటరమణారెడ్డి, పాయల్‌ శంకర్‌, రాజాసింగ్‌, పి.హరీశ్‌బాబు, ఎ.మహేశ్వర్‌రెడ్డి, రామారావు పటేల్‌, పి.రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. సమావేశాన్నుద్దేశించి అమిత్‌షా మాట్లాడారు. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలనీ, గెలిచేంత వరకు అక్కడ నుంచి రావొద్దని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కూడా ఇదినాది అనే లక్ష్యం పెట్టుకుని ముందుకెళ్లాలని కోరారు. కార్యకర్తలంతా కష్టపడి పనిచేస్తే దేశంలో మళ్లీ 350 నుంచి 400 సీట్లను బీజేపీ గెలుస్తుందనీ, మోడీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని చెప్పారు. మూడోసారీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలవలేదనీ, బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8 స్థానాలకు ఎదిగామనీ, ఇది వచ్చే ఎన్నికల్లో 64 కావచ్చు..95 కావచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో భవిష్యత్‌ బీజేపీదేనని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయనీ, దీన్ని సద్వినియోగం చేసుకుని మరింత బలపడాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ మునిగిపోయిన నావ అనీ, కాంగ్రెస్‌ మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న నావ అని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఒక కుటుంబ పాలన నుంచి విముక్తి పొంది మరో కుటుంబ పాలన చేతుల్లో పడ్డారని చెప్పారు. దేశంలో స్కామ్‌లన్నీ కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయన్నారు. తెలంగాణలో బీజేపీ ఇచ్చిన అన్ని హామీలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామన్నారు. సమయాభావం వల్ల ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ రద్దయింది. కానీ, బీజేపీ ఎమ్మెల్యేలను దగ్గరకు పిలిపించుకున్న అమిత్‌షా వారిని పరిచయం చేసుకున్నారు. గురువారం రాత్రి ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారు. సమావేశంలో మోడీ మరోసారి ప్రధాని కావడం చారిత్రాత్మక అవసరం అనే అంశంపై డీకే అరుణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

Spread the love