రాష్ట్రంలో పట్టుబడ్డ 104 కోట్ల నగదు

నవతెలంగాణ – హైదరాబాద్
పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు, మద్యం, డ్రగ్స్‌ పట్టుబడుతున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 28 వరకు రూ.104.18 కోట్లను తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 477 ఎఫ్‌ఎస్‌టీ, 464 ఎస్‌ఎస్‌టీ బృందాలు 89 సరిహద్దు చెక్‌పోస్టుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్‌, ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో రూ.63.18 కోట్ల నగదు ఇప్పటికే దొరకడం కలకలం సృష్టిస్తున్నది. ఇక రూ.5.38 కోట్ల విలువైన మద్యం, రూ.7.12 కోట్ల విలువైన డ్రగ్స్‌, రూ.21.34 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.6.91 కోట్ల విలువైన ఇతర వస్తువులును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,174 లైసెన్స్‌డ్‌ ఆయుధాలను పోలీసులకు డిపాజిట్‌ చేశారు. అనధికారికంగా వెంటపెట్టుకొన్న 14 ఆయుధాలను సీజ్‌ చేశారు. జిలిటెన్‌స్టిక్స్‌, డిటోనేటర్లు, కార్టన్‌ బాక్స్‌ వంటి పలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Spread the love