త్వరలో అందుబాటులోకి 1050 బస్సులు

త్వరలో అందుబాటులోకి 1050 బస్సులు– మంత్రి పొన్నం ప్రభాకర్‌
– 80 కొత్త బస్సులు ప్రారంభించిన మంత్రి, టీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డి, మేయర్‌
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
తెలంగాణలో త్వరలో 1050 ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ కొత్తగా 80 బస్సులను ప్రారంభించింది. ఇందులో 30 ఎక్స్‌ప్రెస్‌, 30 రాజధాని, 20 లహరి నాన్‌ ఏసీ బస్సులు ఉన్నాయి. ఈ కొత్త బస్సులను డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం వద్ద టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్‌ విజయరెడ్డితో కలిసి శనివారం మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం మహిళలకు ఒక వరమన్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 400 కోట్ల వ్యాయంతో 1050 నూతన బస్సులను కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆర్టీసీ చాలా బలోపేతం అయిందన్నారు. ప్రయాణికుల సంఖ్య మూడొంతులు పెరిగిందని చెప్పారు. బస్సులు ఓవర్‌లోడ్‌ అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పురుష ప్రయాణికుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించి ఆలోచిస్తున్నామన్నారు. ఉద్యోగుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌, సీసీఎస్‌ బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేస్తామన్నారు. ఆర్టీసీ సిబ్బంది, బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మాట్లాడుతూ త్వరలోనే అందుబాటులోకి రానున్న వెయ్యి బస్సుల్లో 500 హైదరాబాద్‌కు, మరో 500 బస్సులను జిల్లాలకు కేటాయించామన్నారు. గతంలో 69 శాతం ఉన్న ఓఆర్‌ ప్రస్తుతం 88 శాతం నమోదు అవుతోందని, కొన్ని డిపోలలో 100 శాతం వస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆధికారులు, కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love